'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' రివ్యూ: ఎక్స్ ట్రార్డినరీగా ఉందా? లేదా?
నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజశేఖర్, రావు రమేష్, సంపత్, సుదేవ్ నాయర్, బ్రహ్మాజీ, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు
దర్శకుడు: వక్కంతం వంశీ
నిర్మాతలు: ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి
సంగీతం: హారిస్ జయరాజ్
నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్". శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రంలోని పాటలు, ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈరోజు విడుదలైన సినిమా అలరించిందో లేదో చూద్దాం..!
కథ:
చిన్నప్పట్నుంచి తన చుట్టుపక్కల వారి జీవితాల్లో పరకాయ ప్రవేశం చేయడం అలవాటుగా పెరిగి పెద్దవుతాడు అభినయ్(నితిన్). పెద్దయ్యాక సినిమాల్లో హీరోగా ప్రయత్నిస్తూ, బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడానికి పడరానిపాట్లు పడుతూ ఉంటాడు. లిఖిత (శ్రీలీల) అభినయ్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అభినయ్ కి ఉద్యోగం ఇచ్చి మరీ తన పక్కనే ఉండేలా చూసుకొని ప్రేమిస్తుంటుంది. అంతా సెటిలైంది అనుకుంటున్న తరుణంలో ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి తన దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది, నువ్వే హీరో అంటాడు అభినయ్ తో. అప్పటి నుంచి అభినయ్ జీవితం ఎలా మారింది? ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు? విలన్ కు ఎందుకు ఎదురెళ్లాడు? వంటివాటికి సమాధానం "ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్"

నటీనటుల పనితీరు:
నితిన్ స్టైలిష్ గా, క్రేజీ డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నాడు. క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. సినీ పరిశ్రమకు చెందినవారికి, పరిశ్రమ గురించి తెలిసినవారికి ఈ పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. శ్రీలీల మళ్ళీ మూడు పాటలు, నాలుగు సన్నివేశాలకు పరిమితమైపోయింది. అందంగా కనపడిందికానీ నటిగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రాజశేఖర్ తనకు బాగా అలవాటైన యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించారు. రావు రమేష్ ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ క్యారెక్టర్ లో జీవించారని చెప్పవచ్చు. నితిన్-రావు రమేష్ మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ఆకట్టుకుంటాయి. సెల్వమణి అలియాస్ శివమణి అనే పాత్రలో సంపత్ నటన, బాడీ లాంగ్వేజ్ చాలా బాగున్నాయి.
సాంకేతికవర్గం పనితీరు:
ఈ సినిమాకు పనిచేసిన ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు మంచి ఔట్ పుట్ ఇచ్చారు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ను బాగా చూపించారు. హారిస్ జైరాజ్ పాటలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఆయన ఇచ్చిన చిన్నపాటి రెట్రో టచ్ బాగుంది. వక్కంతం వంశీ స్క్రీన్ ప్లే కాస్త డిఫరెంట్ గా ఉంది. హీరో & విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పేలాయి. విలన్ కి ముందు వార్నింగ్ ఇచ్చి.. ఆ తర్వాత దాని ఆర్డర్ మార్చుకోమని విలన్ కే చెప్పే సీన్ బాగా వర్కౌటైంది. కథకుడిగా వంశీకి మంచి మార్కులు పడతాయి. దర్శకుడిగా బెటర్ టేకింగ్ ఉంటే బాగుంటుంది. సరదా సన్నివేశాలు & సంభాషణలు, ఆసక్తికరంగా సాగే స్క్రీన్ ప్లే, నితిన్ నటన, శ్రీలీల డ్యాన్సుల కోసం హ్యాపీగా ఒకసారి చూడొచ్చు.












Click it and Unblock the Notifications