అదుపు తప్పిన మెగాస్టార్ ఫ్యాన్స్ హంగామా.. !!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కామినేని కొణిదెల కవల బిడ్డలకు స్వాగతం పలికారు. ఒక బాబు, ఒక పాప. అపోలో ఆసుపత్రిలో డెలివరీ అయ్యారు ఉపాసన. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ వెల్లడించారు. దీనిపై శనివారం అర్ధరాత్రి ట్వీట్ పోస్ట్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం కవల పిల్లలను స్వాగతించారని తెలిపారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని, అందరి ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
ఉపాసనకు ఇది రెండో కాన్పు. తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చారామె. 2023 జూన్ 20న క్లింకారా పుట్టారు. రెండున్నరేళ్ల తర్వాత కవల పిల్లలకు జన్మనిచ్చారు. రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఇప్పుడు ముగ్గురు బిడ్డలకు తల్లిదండ్రులయ్యారు. రెండో కాన్పులో కవల పిల్లలు జన్మించడం, ఓ బాబు, ఓ పాప కావడంతో రామ్ చరణ్ ది ఇక కంప్లీట్ ఫ్యామిలీ అయింది. ఆ ఆనందం.. చిరంజీవి, సురేఖ పెట్టిన పోస్ట్ లో కనిపించింది.

భగవంతుడి ఆశీస్సులు, అపారమైన ఆనందంతో ఈ ఇద్దరు చిన్నారులను తమ కుటుంబంలోకి స్వాగతిస్తోన్నామని, తాత మామ్మలుగా ఎంతగానో సంతోషిస్తున్నామని చిరంజీవి, సురేఖ పేర్కొన్నారు. అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ట్వీట్ లో రాశారు.
ఈ సంక్రాంతికి విడుదల అయిన మన శంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పటికే జోష్ లో ఉంది మెగాస్టార్ కుటుంబం. 300 కోట్ క్లబ్ లో చేరిందీ మూవీ. ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలతో పోల్చుకుంటే రేసులో టాప్ లో నిలిచింది. ఈ మధ్యకాలంలో చిరంజీవి కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఈ సంతోష సమయాన్ని రెట్టింపు చేస్తూ రామ్ చరణ్- ఉపాసన దంపతులు కవల పిల్లలకు స్వాగతం పలికారు.
తనకు పుట్టిన మనవడు, మనవరాలిని చూడటానికి ఈ తెల్లవారు జామునే చిరంజీవి అపోలో ఆసుపత్రి వెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగా కాంపౌండ్ అభిమానులు భారీ సంఖ్యలో అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. సందడి చేశారు. రామ్ చరణ్, ఉపాసన ఫొటోలను ముద్రించిన ఫ్లెక్సీలు, జెండాలు పట్టుకొచ్చారు. కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య అండ్ వదిన అని రాసివున్న భారీ సైజు ప్లకార్డులను ప్రదర్శించారు. చిరంజీవి, రామ్ చరణ్ కు జిందాబాద్ కొట్టారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు.












Click it and Unblock the Notifications