"కన్నప్ప" కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న 'కన్నప్ప' సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న విడుదల కానుంది. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, భారీ సెట్లతో సినిమాను ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆధ్యాత్మికత, భక్తి, సాహసం కలబోసిన ఈ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
భారీ బడ్జెట్- అగ్రశ్రేణి నటీనటులు:
భారీ బడ్జెట్, అగ్రశ్రేణి నటీనటులతో రూపొందిన ఈ సినిమా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోంది. మహాకవి ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప కథను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రంలో సినీ ఇండస్ట్రీలోని అగ్రనటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ కోసం శ్రమిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్‌తో సినిమా నిర్మితమవుతోందని చెప్పారు.

ఈ తరానికి మీరే శివుడు:
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నారు. అయితే, ఈ పాత్ర కోసం మొదటిసారి సంప్రదించినప్పుడు అక్షయ్ తిరస్కరించారని, తర్వాత వేరే దర్శకుడితో కథ వివరించి ఒప్పించామని విష్ణు వెల్లడించారు. అక్షయ్ ఈ పాత్రకు వందశాతం న్యాయం చేశారని, 'ఈ తరానికి మీరే శివుడు' అని చెప్పానని అన్నారు.
ప్రభాస్, మోహన్‌లాల్ పారితోషికం:
అలాగే, రెబల్ స్టార్ ప్రభాస్ రుద్రుడి పాత్రలో, మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కథ విన్న వెంటనే ఇద్దరూ సమ్మతించారని, షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ప్రశ్నించారని విష్ణు తెలిపారు. ఆశ్చర్యకరంగా, ప్రభాస్, మోహన్‌లాల్ ఈ చిత్రంలో నటించడానికి ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని చెప్పారు. మోహన్‌బాబు గారి మీద ఉన్న అభిమానంతో మోహన్‌లాల్ ఈ సినిమాలో పాల్గొన్నారని అన్నారు. పారితోషికంపై ప్రస్తావన తెస్తే, మోహన్‌లాల్ నవ్వుతూ 'నువ్వు అంత పెద్ద వాడివయ్యావా' అని అన్నారని విష్ణు గుర్తు చేసుకున్నారు. అలాగే, ప్రభాస్ వల్ల తన స్నేహంపై నమ్మకం పెరిగిందని తెలిపారు.
పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్:
'కన్నప్ప' చిత్రానికి ప్రముఖ దర్శకుడు ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన 'మహాభారత' సిరీస్‌ను తెరకెక్కించిన అనుభవం కలిగి ఉన్నారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విశేషంగా, విష్ణు తనయుడు అవ్రామ్ ఈ సినిమాతో తెరంగేట్రం చేయనున్నాడు. ప్రముఖ నటీనటులు శివరాజ్‌కుమార్, ఆర్. శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రలో అలరించనుంది. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ కలిసి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్, అగ్రనటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications