తెలుగులో తొలిసారిగా 100 రోజులు ఆడిన సినిమా
ప్రస్తుత రోజుల్లో థియేటర్లలో సినిమాలు 100 రోజులు ఆడటం అనేది కలగా మిగిలిపోతోంది. ఓటీటీలు అందుబాటులోకి రావడం, శాటిలైట్ ఛానల్స్ కూడా వెంటనే కొత్త సినిమాలను ప్రదర్శిస్తుండటం ఒక కారణమవుతోంది. పెరిగిన టికెట్ ధరలతో ప్రజలు థియేటర్లకు, మల్టీప్లెక్స్ లకు వెళ్లడం తగ్గించారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులంతా కలిసి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలతో మాట్లాడుకుంటున్నారు. మొదటి రెండు వారాలు లేదంటే 10 రోజులు టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వీటికితోడు థియేటర్ల క్యాంటిన్లలో ధరల దోపిడీలుంటాయి. ఇన్ని దోపిడీలను తట్టుకోలేమని భావించిన ప్రజలు ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు.
మూడోవారం నుంచి తండోప తండాలుగా
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న తరుణంలో తొలిసారిగా ఓ సినిమా 28 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. అంతేకాదు.. అదే సినిమా నాలుగు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ (175 రోజులు) కూడా జరుపుకొని సంచలన విజయాన్ని సాధించింది. అదేం సినిమా అంటే నందమూరి తారకరామారావు, మాలతి హీరో హీరోయిన్లుగా నటించిన పాతాళభైరవి సినిమా. కె.వి.రెడ్డి దర్శకత్వంలో విజయ స్టూడియోస్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. ఎస్వీ రంగారావు మాంత్రికుడిగా అద్భుతమైన నటనను కనపరిచారు. ఈ సినిమా విడుదలైనప్పుడు మొదటి రెండువారాలు థియేటర్లకు ప్రజలు సరిగా రాలేదు. మూడోవారం నుంచి తండోపతండాలుగా తరలిరావడంతో సినిమా సంచలన విజయం దిశగా దూసుకుపోయింది.

ముందుగా హీరో ఎన్టీఆర్ కాదు..
1951 మార్చి 15న తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలైంది. రెండు భాషల్లోను అద్భుత విజయాన్ని అందుకుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాతాళభైరవి తనకంటూ ఓ పేజీని సృష్టించుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను క్లాసిక్ గా భావిస్తారు. వాస్తవానికి ఎన్టీరామారావుకు బదులుగా అక్కినేని నాగేశ్వరరావును ముందుగా నిర్మాతలు అనుకున్నారు. కానీ దర్శకుడు కొత్తగా ఆలోచించి ఎన్టీ రామారావు అయితేనే బాగుంటుందని తనను తీసుకున్నాడు. మాంత్రికుడిగా కూడా వేరేవారిని అనుకున్నప్పటికీ హీరోను మార్చాం కాబట్టి మాంత్రికుడిని కూడా మార్చాలని భావించి ఎస్వీరంగారావును తీసుకున్నారు. ఈ సినిమాను తిరిగి మళ్లీ తీయాలని ఎంతోమంది దర్శకులు ప్రయత్నాలైతే చేశారుకానీ వారికి అంతటి గొప్ప సినిమాను తీసే ధైర్యం చాలలేదు.












Click it and Unblock the Notifications