ఇండియాలో దీన్ని మించిన అట్టర్ ఫ్లాప్ సినిమా లేదు.. రాబోదు
భారతదేశంలో ఎన్నో భాషల్లో సినిమాలు నిర్మితమవుతున్నాయి. అందులో కొన్ని సూపర్ హిట్ గా నిలిస్తే మరికొన్ని ప్లాప్ అవుతాయి. సినిమా అన్న తర్వాత జయాపజయాలు సహజంగా ఉంటాయి. అయితే మనదేశంలోనే అత్యంత భారీ డిజాస్టర్ సినిమా ఒకటి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే ఈ సినిమాను మించిన ఫ్లాప్ సినిమా లేదని చెప్పొచ్చు. రూ.45 కోట్ల భారీ బడ్జెట్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తే వసూలు చేసింది కేవలం రూ.45వేలు మాత్రమే.
ఎంత ఖర్చుపెట్టి సినిమా తీసినా దానికి ప్రమోషన్లు తప్పనిసరిగా చేయాలి. ఆ ప్రమోషన్లమీద ఆధారపడైనా కలెక్షన్లు వస్తాయి. సినిమా బాగోలేకపోయినప్పటికీ కనీసం సగం డబ్బులన్నా తిరిగివస్తాయి. ప్రమోషన్లు కూడా లేకుండా తెరకెక్కిన ఈ సినిమా పేరు ది లేడీ కిల్లర్. 2023 నవంబరు మూడోతేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ నటించారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఏళ్లు దాటుకొని, అనుకున్న బడ్జెట్ లెక్కలన్నీ దాటి షూటింగ్ మొత్తం పూర్తవకుండానే విసుగుచెందిన నిర్మాతలు చివరకు సినిమాను విడుదల చేశారు.

ఫలితం తెలిసిందే.. డిజాస్టర్లకే డిజాస్టర్ గా నిలిచి రికార్డు సృష్టించింది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ సినిమాను మించిన ఫ్లాప్ సినిమా భవిష్యత్తులో కూడా రాదని గ్యారంటీగా చెప్పొచ్చు. దేశం మొత్తం మీద ఈ సినిమాకు 12 షోలు వేశారు. తొలిరోజు 293 టికెట్లు అమ్ముడుపోయి రూ.38వేలు రాగా, చివరకు రూ.45వేలు వచ్చాయి. డిజిటల్ హక్కులు కూడా ముందుగానే అమ్మకానికి పెట్టారు. డిసెంబరులో స్ట్రీమింగ్ కు చేయాలనే ఒప్పందం కుదరడంతో హడావిడిగా నవంబరులో విడుదల చేశారు. డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఇంతవరకు దీన్ని స్ట్రీమింగ్ చేయలేదు. అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు చేయమని ముందే తేల్చిచెప్పారు. ఇంత దారుణమైన ఫలితం రావడాన్ని నిర్మాతలు అలసు జీర్ణించుకోలేకపోయారు.












Click it and Unblock the Notifications