'వార్-2' రివ్యూ : అదే పెద్ద మైనస్
'వార్-2' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటించడం, అది కూడా ఒక యాక్షన్ సినిమాలో కనిపించడం అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ ఇద్దరు అగ్రశ్రేణి నటులు ఒకే స్క్రీన్‌పై ఎలా నటిస్తారు, వారి మధ్య యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయనే దానిపై దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'వార్ 2' సినిమా ఈరోజు(గురువారం) విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఒకసారి చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ చాలా రొటీన్‌గా మొదలవుతుంది. అజ్ఞాతంలో ఉన్న హృతిక్ రోషన్ ను పట్టుకోవడానికి ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ ఎన్టీఆర్ ని స్పై ఆఫీసర్ గా నియమిస్తారు. అయితే ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేదే అసలు కథ. ఇలాంటి కథాంశాలతో గతంలో 'వార్', 'పఠాన్' వంటి సినిమాలు రావడం గమనార్హం.

విశ్లేషణ:
దర్శకుడు అయాన్ ముఖర్జీ కథను రొటీన్‌గా రాసుకున్నప్పటికీ, విజువల్స్ పరంగా సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ మాత్రం సహజత్వానికి దూరంగా అనిపించాయి. మొదటి సగంలో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుడిని కనెక్ట్ చేస్తాయి, కానీ సెకండ్ హాఫ్‌లో ఇంకాస్త ప్రభావవంతంగా చూపించి ఉంటే బాగుండేది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ ట్విస్ట్,హృతిక్-ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్‌లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి.
టెక్నికల్ అంశాలు:
ఈ సినిమాకి మ్యూజిక్ పర్వాలేదనిపించినప్పటికీ, ఎమోషనల్ మరియు ఎలివేషన్ సన్నివేశాలలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా మెరుగ్గా ఉంటే సినిమా ఇంపాక్ట్ మరింత పెరిగేది. విజువల్స్ పర్వాలేదనిపించినా, కొన్ని చోట్ల గ్రాఫిక్స్ స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఎడిటింగ్‌లో అనవసరమైన సన్నివేశాలను తొలగిస్తే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది.
నటీనటుల పనితీరు:
ఎన్టీఆర్ తన పాత్రలో ఒదిగిపోయి నటించారు. పాత్ర పరిధిని దాటకుండా నటనతో ఆకట్టుకున్నారు. హృతిక్ రోషన్ కూడా తనదైన శైలిలో అదరగొట్టారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ కి మంచి అనుభూతిని ఇస్తాయి. కియారా అద్వానీ తక్కువ నిడివిలో కనిపించినప్పటికీ తన అందంతో ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్:
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటన
ఇంటర్వెల్ ట్విస్ట్
ఫస్ట్ హాఫ్
ఫైట్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
మ్యూజిక్
సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు
ఫైనల్‌గా:
మొత్తంగా చెప్పాలంటే, 'వార్ 2' యాక్షన్, ఫైట్ సీక్వెన్సులను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ కథలో కొత్తదనం ఆశించేవారికి నిరాశ కలిగించవచ్చు.
రేటింగ్: 2.5/5












Click it and Unblock the Notifications