వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విప్లవోద్యమం, సాహిత్యం: గద్దర్‌

By Pratap
|
Google Oneindia TeluguNews

Gaddar
గద్దర్‌ గురించి తెలియనివారు అరుదు. నిజానికి గద్దర్‌ గురించి చాలా మందికి ఏమీ తెలియదు. పాటలు పాడతాడని, రాస్తాడని, విప్లవ కవి, గాయకుడు, వాగ్గేయకారుడు అని అనేక ఉద్యమాల్లో పనిచేస్తాడని సమాజానికి మార్గదర్శనం చేస్తాడని మాత్రం అందరికీ తెలుసు. కానీ ఆయన జీవితం, సాహిత్యం, త్యాగం, కవిత్వం, నాలుగు థాబ్దాల కవిత్వ పరిణామాలు, వస్తువైవిధ్యం, శిల్ప వైవిధ్యం, వస్తు విస్తృతి, కార్యక్షేత్ర విస్తృతి చాలా తెలిసినట్లు అనిపిస్తుంది. కాని, చాలా మందికి ఎక్కువగా తెలియదు. గద్దర్‌, నేను సమకాలికులం. ఒకే విప్లవోద్యమంలో, భిన్న రంగాల్లో థాబ్దాలుగా కలిసి పనిచేశాము. 1980ల నుండి మేము అనేక రంగాల్లో, అనేక వేదికల మీద కలిసి ఉద్యమిస్తున్నాము. ప్రజలే మా లక్ష్యం, గమ్యం. ప్రజల చైతన్యం, జీవన ప్రమాణాలు పెరగడం, సమాజిక మార్పు మా అంతిమ లక్ష్యం. భావాల్లో వైవిధ్యం, భిన్నత్వం మా స్నేహానికి, కలిసి పనిచేయడానికి ఎన్నడూ అడ్డురాలేదు. పరస్పర విశ్వాసం చిత్తశుద్ధి పట్ల గౌరవం, భిన్న రంగాలు పరస్పర అదాన, ప్రధానాలు, పరస్పర సహకారం వల్ల కలిసి నడవడం సాధ్యపడుతున్నది.

గద్దర్‌ గురించి గతంలో కొన్ని వ్యాసాలు రాసాను. అవి ఆయా సందర్భాలకు, సమస్యలకు సంబంధించినవి. గద్దర్‌ రాసిన ''తరగని గని'' పుస్తకంపై విశ్లేషణ రాసినప్పటికి గద్దర్‌ను ఒక సమగ్రంగా పరిశీలించటం జరగలేదు. కలిసినప్పుడల్లా తక్షణ కార్యక్రమాల గురించి, ఉద్యమాల గురించి, సిద్ధాంత చర్చల గురించి మాట్లాడుకున్నామే తప్ప గద్దర్‌ సాహిత్య, సాంస్కృతిక పరిణామాలను ఒక పద్ధతిలో కుదురుగా కూర్చుని మాట్లాడుకున్నది లేదు. అయితే కలిసి దేశవ్యాప్తంగా పర్యటించే క్రమంలో కలిసి జీవించిన క్రమంలో చాలా విషయాలు తెలుసు. వాటిని ఒక వ్యాస రూపంలో పెట్టటం జరగలేదు. వ్యాస రూపంలో పెట్టే ప్రయత్నం చేసినప్పుడు గద్దర్‌ గురించి చాలా మందికి ఏమీ తెలియదు అని, అనిపించింది. నాక్కూడా గద్దర్‌ గురించి తెలిసింది తక్కువ అని వ్యాసరచనకు పూనుకున్నప్పుడే అర్థం అయ్యింది. అందుకని ఎందరికో ఫోన్‌లు చేసి అనేక విషయాలను వారి జ్ఞాపకాల నుండి రాబట్టాను. నా జ్ఞాపకాలను ఒక చోటికి చేర్చాను. గద్దర్‌ వస్తు వైవిధ్యం, శిల్ప వైవిధ్యం, కవిత్వంలోని గాఢత, పరిణామ క్రమం ఒకే వ్యాసంలో చెప్పటం సాధ్యం కాదు అని తెలిసివచ్చింది. అద్దంలో కొండలా ప్రతిఫలించాలని అనుకున్నాను. అయితే అద్దంలో కొండ పట్టదు. అప్పుడేం చేయాలి? అందుకని గద్దర్‌ సాహిత్య పరిణామంలో వస్తువులో, ఉద్యమంలో వచ్చిన పరిణామాలు ఎలా నిక్షిప్తం చేశారో సామాజిక ఉద్యమాలకు తన పాట ద్వారా కళారూపాల ద్వారా సామాజిక శాస్త్రవేత్తగా మార్గదర్శనం ఎలా అందించారో కొంత మేరకు రేఖా మాత్రంగా పరిచయం చేయడానికి పరిమితమౌతాను.

గద్దర్‌ ఒక సముద్రం:

సామాజిక ఉద్యమాలతో పాటు ఎదుగుతూ వచ్చిన గద్దర్‌ ఒక సముద్రం. సముద్రంలో ఈదడం కష్టం. గద్దర్‌ను ప్రజా యుద్ధనౌక అన్నారు. కాల పరిణామంలో యుద్ధనౌక తానే ఒక సముద్రమైంది. అలలు అలలుగా సముద్రం. ఆగిపోని అలలు. కదలకుండా వుండిపోయినట్టు కనిపించే లోతు, విస్తీర్ణం. ఆయన జీవనయానం నిరంతర చైతన్యశీలం. నేను, ఆయన, వరవరరావు, సంజీవ్‌, తదితరులం కలిసి 1985లో పలు రాష్ట్రాలు పర్యటిస్తూ ఆయా రాష్ట్రాల్లోని వేలాది కళాకారులను, రచయితలను, మేథావులను, ఉద్యమకారులను, పౌర హక్కుల నాయకులను కలుస్తూ, సభలు, సమావేశాలు, చర్చలు నిర్వహిస్తూ నెలల తరబడి వరుసగా సాగిన మా అఖిల భారత సాంస్కృతిక పర్యటన ఒక గొప్ప అనుభవం. అప్పుడు ఎన్నో చర్చలు. ఎంతో వైవిధ్యపూరితమైన ఉద్యమాల పరిశీలనకు అవకాశం ఏర్పడింది. అలాగే అనేక కళారూపాలు భిన్న అవగాహనలతో ప్రజలకు అంకితమైన పని చేస్తున్న వేలాది ఉద్యమకారులు, రచయితలు, వారి జ్ఞాపకాలు హృదయంలో పదిలంగా వున్నాయి. 'ఐదు తూటాలు తిని ఒక తూటా ఇప్పటికీ శరీరంలో నిలుపుకున్న గద్దర్‌ ఒక సజీవ అమరవీరుడు' అని ఒక మేధావి అన్న మాట సత్యదూరం కాదు.

గద్దర్‌ ఒక మహాకవి, ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఒక లెజెండ్‌:

గద్దర్‌ ఒక మహాకవి. ప్రజాకవి. ప్రజా ఉద్యమాలకు మద్దతుగా కలమెత్తి, గళమెత్తిన కవి, కళాకారుడు, వాగ్గేయకారుడు. గద్దర్‌ ఒక లెజెండ్‌. తన కాలాన్ని ప్రభావితం చేసిన మహోన్నత కళాకారుడు. 1970 నుండి నాలుగు థాబ్దాలుగా సాంస్కృతిక సాహిత్య రంగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా బలమైన ముద్రవేసి సాంస్కృతిక విప్లవాలను మలుపు తిప్పినవాడు. ఆయన ప్రసంగం మహోత్తుంగ జలపాతం.

అయితే గద్దర్‌ సాహితీవేత్తలను అంచనా వేయడానికి తూనికరాళ్ళు ప్రత్యేకంగా సూచిస్తాడు. ''నాగురించేకాదు - ఏకవినీ, కళాకారుడినీ అయినాసరే అంచనాలువేసే ఈ పద్ధతులమీద నాకు చాలా అభ్యంతరాలున్నాయి. మహాకవి, ఏకైకకవి, సువర్ణాక్షరాలతో రాయాలి అంటూ రాసేవన్నీ సైంటిఫిక్‌ విశ్లేషణలు ఎంతమాత్రం కావు. ఒక కవినిగానీ, సాహిత్యాన్నిగానీ క్రిటికల్‌గా చూస్తేతప్ప ప్రయోజనంలేదు. ఒక నిర్దిష్టమైన టైమ్‌ అండ్‌ స్పేస్‌లో జీవించినకకి, తన కాలానికి సంబంధించిన లక్షణాలను తన కవిత్వంలో సరిగ్గా ప్రతిబింబించాడా, లేదా, ఆ పరిస్థితుల్లో అతను ప్రజలవైపు నిలబడ్డాడా? పాలకులవైపా? అనే అంశాలని విమర్శకులు చెప్పగలగాలి. కొందరు ఆకాశానికెత్తితే, యింకొందరు అన్నీ లోపాలే చూపిస్తారు. రెండూ అన్యాయమనే నేననుకుంటున్నా. తప్పుల్లోనూ, గొప్పతనంలోనూకూడా నడిపించిన రాజకీయాల పాత్ర ప్రముఖమైనది. ఫలానా పార్టీ, వ్యక్తి అని నేను చెప్పదలుచుకోలేదుగానీ, ప్రజల రాజకీయాలవైపు నిలబడే కమిట్‌మెంట్‌నుండి దూరమైన కవులు, ఎంత టాలెంట్‌వున్నా చెయ్యగలిగేదేమీ లేదని నా అబిప్రాయం.'' (చూపు మాసపత్రిక ఏప్రిల్‌ 2000)

1970ల నుండి విప్లవోద్యమాల కళా సాహిత్య ప్రదర్శనలు, ప్రచారాలు వేగం పుంజుకున్నాయి. సుద్దాల హనుమంతు, షేక్‌ నాజర్‌, సుంకరల వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీకాకుళ ఉద్యమం నుండి సుబ్బారావు పాణిగ్రాహి కవిగా, కళాకారుడిగా, విప్లవ నాయకుడిగా ముందుకు వచ్చాడు. ఆ బాటలో చెరబండ రాజు, వంగపండు ప్రసాదరావు, బి.నర్సింగరావు, గద్దర్‌, భూపాల్‌ వంటి ఎందరో కవులు, కళాకారులు ముందుకు సాగారు.

ఆర్ట్‌ లవర్స్‌ అనే సంస్థ 1969లో చిన్నగా సికింద్రాబాద్‌లో బి.నర్సింగరావు నేతృత్వంలో ప్రారంభమైంది. అది చరిత్రకు ఎందరో కళాకారులను, కవులను అందించింది. గద్దర్‌, భూపాల్‌ వంటి వారిని ఆర్ట్‌లవర్స్‌ చరిత్రకు అందించి తాను చరితార్థమైంది.

నక్సల్‌బరీ శ్రీకాకుళం ఉద్యమం:

భూమి కొరకు, భుక్తి కొరకు, భారతదేశ విముక్తి కొరకు, కార్మిక, కర్షక, నూతన ప్రజాస్వామిక వ్యవస్థ కొరకు మార్క్సిస్టు, లెనినిస్ట్‌ దృక్పథంతో 1967లో నక్సల్‌బరీ ఉద్యమం బద్దలైంది. సీపీఎం కడుపు చీల్చుకొని డార్జిలింగ్‌లో, నక్సల్‌బరీలో, కలకత్తాలో, సుందరబన్స్‌లో పెట్టిన పొలికేక అది. ఆ కేక శ్రీకాకుళం దాకా విస్తరించింది. శ్రీకాకుళంలో సుబ్బారావు పాణిగ్రాహి అలా ఎదిగి వచ్చారు. ఈ క్రమంలో శ్రీకాకుళ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, హోంమంత్రి జలగం వెంగళరావు అణచివేతకు గురి చేశారు. మరొక పోరాట రంగాన్ని ప్రారంభించే ఆలోచన జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలుగా క్రమంగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌ పోరాటాలుగా, ఆ తర్వాత దండకారణ్య పోరాటాలుగా, విముక్తి ప్రాంతాలుగా ఉద్యమం ముందుకు సాగింది.

సామాన్యులను అసమాన్యులుగా ఎదిగించేవి ఉద్యమాలు:

ఉద్యమాలు సామాన్యులను అసమాన్యులుగా ఎదిగిస్తాయి. అంతదాకా నిబిడీకృతంగా వున్న అంతర్గత శక్తులు, నాయకత్వ సామర్థ్యాలు, సృజన, కళలు ఒక్కసారిగా పెల్లుబుకి ముందుకు వస్తాయి. ఉద్యమాలు వాటిని పంట కాలువలుగా పొలాలకు మళ్లించి పంటలు పండిస్తాయి. ఉద్యమం కవులను, కళాకారులను, రచయితలను, నాయకులను తయారు చేస్తుంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజల నుండే మహోన్నత నాయకులు, కళాకారులు, మేథావులు ఎదుగుతారు. అలా వేలాది మంది రచయితలు, కళాకారులు, కవులు తెలంగాణ, విప్లవోద్యమంలో ఎదిగారు. అలా ఎదిగవారు కొందరు రకరకాల కారణాలతో మాతృసంస్థకు దూరమైనప్పటికి తల్లి నుండి దూరంగా, స్వతంత్రంగా ఎదుగుతూ బతుకుతున్నప్పటికి ప్రజల కోసం ఉద్యమాల కోసం ఎక్కడో ఒక చోట ఎప్పుడోకప్పుడు అందరూ కలుసుకుంటూనే ఉన్నారు. అది ఉద్యమం నేర్పిన సంస్కారం.

విప్లవోద్యమంలో ప్రజల కళలను, కళారూపాలను స్వీకరించి తమ నైపుణ్యం, భావజాలం కలిపి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఉపయోగిస్తారు. నాటి తెలంగాణ రైతాంగ పోరాటం నుండి ఈ వారసత్వం కొనసాగుతున్నది. ప్రజల పాటలను, జానపద పాటలను వాటి బాణిలను స్వీకరిస్తూనే వాటిని మరింత పదును పెట్టి ప్రజల్లోకి తీసుకురావడంలో జననాట్య మండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రజాకళామండలి వంటి సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. జననాట్య మండలి రూపకర్తల్లో కె.జి.సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య, బి.నర్సింగరావు, గద్దర్‌, వంగపండు ప్రసాద్‌రావు, భూపాల్‌...తదితరులు ప్రముఖులు.

విరసం, జననాట్యమండలి, రాడికల్‌ సంఘాలు:

ఒకవైపు సాహిత్య రంగంలో విప్లవ రచయితల సంఘం సైద్ధాంతికంగా మధ్యతరగతి ప్రజల్లో బలమైన ప్రభావం వేస్తున్నది. మధ్య తరగతితో పాటు కార్మిక, కర్షక, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సామాజిక శ్రేణులన్నిటినీ జననాట్యమండలి బలంగా ప్రభావితం చేసింది. వందలాది పాటలతో, వేలాది ప్రదర్శనలతో, కోట్లాది ప్రజలను చైతన్యపరిచింది. రాడికల్‌, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రైతుకూలి సంఘాలు తమలో జననాట్యమండలి కళాకారులను రూపొందించుకున్నాయి. అందుకు జననాట్యమండలి ప్రత్యేకంగా శిక్షణా తరగతులను నిర్వహించింది.

జననాట్యమండలి కృషి భారతదేశంలో అసామాన్యమైనది. దానికి చుక్కానిగా గద్దర్‌, వంగపండు ఎదిగారు. దిక్సూచిగా ఉద్యమం, దాని నాయకత్వం ముందుకు సాగుతుంటే ప్రజలను పాక్షిక పోరాటాల నుండి సాయుధ దీర్ఘకాలిక పోరాటాల వైపు నడిపించే చుక్కానిగా, స్ఫూర్తిప్రదాయినిగా జననాట్యమండలి ఎదుగుతూ వచ్చింది.

జననాట్యమండలి కృషి:

జననాట్యమండలి ఎందరో కళాకారులను, కవులను తీర్చిదిద్దింది. ఆ కవులు, కళాకారులు, విప్లవ కార్యకర్తలుగా విప్లవానికి అంకితమై ఎందరో అమరులయ్యారు. జననాట్య మండలి లేని విప్లవోద్యమాన్ని ఊహించలేం. అలాంటి జననాట్యమండలి కళాకారుల్లో గద్దర్‌, వంగపండు, భూపాల్‌, దివాకర్‌, సంజీవ్‌, సుధ, శారద, స్వర్ణ, బెల్లిలలిత వంటి ఎందరో...! నలభైకి పైగా జననాట్యమండలి కళాకారుల్లో, నలభై మంది విప్లవోద్యమంలో అమరులైయ్యారు. చిన్న స్వర్ణక్క, గద్దర్‌ మేనకోడలు కూడా అమరులైనవారిలో ఉన్నారు.

గద్దర్‌ పాట రాయడం అందరూ అనుకున్నంత సులభం కాదు. ఆయా ప్రజల జీవితాలను అధ్యయనం చేయడానికి ఆ ప్రజల్లోకి వెళ్లి కొంత కాలం జీవించి వారిని, వారి సంస్కృతిని, జీవన విధానాన్ని, వారి ఆశలను, కష్టాలను, కన్నీళ్లను, సమస్యలను తెల్సుకుంటారు, నోట్సు రాసుకుంటారు. విప్లవకారులతో స్నేహితులతో చర్చిస్తారు. వారి గురించి ఎలాంటి పాటలు రాయాలో, ఎలా రాయాలో జననాట్యమండలి బృందంతో చర్చలు చేస్తారు. కొంత రాసి వినిపించి, స్పందన చూసి మార్పులు చేర్పులు చేస్తూ వస్తారు. అలా పాట ఒక సమిష్టి కృషిగా రూపొందుతుంది. అలా గద్దర్‌ పాటల్లో విప్లవోద్యమ లక్ష్యాలు, మలుపులు, వ్యూహం, ఎత్తుగడలు, విస్తరణ నీళ్లల్లో ఉప్పులా, పాలల్లో నీళ్ళలా కలిసిపోతాయి. పాట అనే రూపంలో విప్లవం అనే కలనేత అనేక రంగులు అద్దుకొని అందమైన బట్టలా ప్రజల ముందుకు వస్తుంది. అందువల్లే గద్దర్‌ పాటలకు అంత బలం, అంత ఆకర్షణ చేకూరింది.

ప్రసంగం, పాట, అభినయం అనే ప్రక్రియల్లో గద్దర్‌ రూపానికి కళాకారుడుగా, వాగ్గేయకారుడుగా కనిపిస్తారు. కానీ లోతుగా తరిచి చూసినప్పుడు ఆయన ఒక సామాజిక శాస్త్రవేత్తగా, తత్వవేత్తగా, విప్లవోద్యమ నాయకుడిగా, అలంకార శాస్త్రం లోతులు తెలిసిన సాహితీ వేత్తగా ఆయా సందర్భాల్లో ప్రజలకు, ఉద్యమాలకు మార్గదర్శనం చేసే సామాజిక వైతాళికుడిగా అనేక కోణాలు ప్రస్ఫుటమౌతాయి. ప్రజలను, వారి జీవితాలను, సంస్కృతిని, కష్టసుఖాల్ని వారిలో ఒకరిగా మారి తెలుసుకోవడం వల్ల ఇది సాధ్యం చేసుకున్నారు. స్వయంగా తాను పీడిత వర్గం, పీడిత దళిత కులం నుండి పుట్టి పెరిగి వాటన్నింటిని అనుభవ పూర్వకంగా తెలుసుకోవడం గద్దర్‌ సాహిత్యం బలంగా ఉండడానికి ప్రధాన కారణం.

శ్రీకాకుళం నుండి నెల్లూరు దాకా గల సముద్ర తీర జాలర్ల గురించి పాట రాయడానికి శ్రీకాకుళం చేరి ఒక సామాన్యుడిగా పరిచయం చేసుకుని రోజుల తరబడి జాలర్లతో పాటు బల్లకట్టుపై, చిన్న పడవలపై సముద్రాన్ని చూశారు. ఆ జీవితాలు అనుక్షణం ప్రమాదానికి లోనయ్యే తీరును గమనించారు. అలా ...
''దండాలో దండాలమ్మా గంగమ్మ....ఓహో
మీ బిడ్డలము ఆకాశాన్ని ముద్దాడుతున్న సముద్రాన్ని.... అంటూ జాలర్లపై పాట రూపొందింది.

English summary
BS Ramulu, a prominent writer, explains the evolution of Gaddar and about his contribution to the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X