వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విప్లవోద్యమం, సాహిత్యం: గద్దర్‌ పార్ట్ - 2

By Pratap
|
Google Oneindia TeluguNews

Gaddar
గద్దర్‌ మెదక్‌ జిల్లా, తూఫ్రాన్‌లో గుమ్మడి లచ్చుమమ్మ, గుమ్మడి శేషయ్య దంపతులకు 31-1-1948న జన్మించారు. గద్దర్‌కు ఒక అన్న, ముగ్గురు అక్కలు. గద్దర్‌ దళితుడిగా చిన్నప్పుడి నుండి అనేక అవమానాలను, అనుభవాలను పొందారు. గద్దర్‌కు తల్లిదండ్రులు పెట్టిన పేరు గుమ్మడి విఠల్‌రావు.

గద్దర్‌ తూఫ్రాన్‌లో 1966-67లో హెచ్‌ఎస్‌సి దాకా చదివారు. కొంత కాలం ప్రబుత్వ హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. హాస్టల్లో ఉంటూ కూలికెళ్లేవాడు. సున్నం వేయడం వంటి పనులు చేసి ఖర్చులకు సంపాదించుకునేవాడు. హాస్టల్లో ఉండడం వల్ల అంబేద్కర్‌ సంఘాలవారు పరిచయం అయ్యారు. వాళ్లు కులం గురించి, మతం గురించి, అంబేద్కర్‌ గురించి చెప్పేవాళ్లు. అలా విద్యార్థి థలోనే అంబేద్కరిజం అంటే ఏమిటో తెలిసింది. తాను కూడా అలాంటి జీవితం నుండి అనుభవాల నుండి రావడం వల్ల అంబేద్కరిజం ఎంతగానో ఆకర్షించింది.

హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ సైన్సు కాలేజీలో 1968లో పియుసి చేశారు. అప్పుడే జై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో 1969-70 ఇంజనీరింగ్‌లో చేరారు. గద్దర్‌కు అనేక ఉద్యోగాలు వచ్చాయి. గద్దర్‌ 1973లో రాసిన బ్యాంక్‌రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు పాసై 1976 అక్టోబర్‌ 25లో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్‌లోని కెనరాబ్యాంక్‌ ఈస్ట్‌ మారేడ్‌పల్లి బ్రాంచ్‌లో క్లర్క్‌ ఉద్యోగం రావడంతో పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన కార్యరూపందాల్చింది. గద్దర్‌ పెళ్లి హైదరాబాద్‌, కాచీగూడలో వుండే విమలక్కతో 9-11-1975న జరిగింది. పెళ్లయ్యాక విమలక్క కుటుంబానికి పెద్ద దిక్కైంది.

ఎమెర్జెన్సీ తరువాత కెనెరా బ్యాంక్‌లో చేరినప్పటికీ 1980లో సాంస్కృతిక ఉద్యమంలో పూర్తికాలం పనిచేయటానికి ఉద్యోగాన్ని వదిలేశారు. పేరుకే ఉద్యమంలో ఉన్నప్పటికి పూర్తికాలం కార్యకర్తగానే పనిచేశారని చెప్పవచ్చు. గట్టిగా ఒక్క ఏడాది పాటు ఉద్యోగం చేసాడో లేదో! ఎమర్జెన్సీలో డిఎస్పీఆల్‌ఫైడ్‌ గద్దర్‌ని మొదటిసారి అరెస్టు చేశారు. 42 రోజుల జైల్‌ జీవితం తర్వాత బయటకొచ్చి తిరిగి ఉద్యోగంలో కొనసాగారు.

విమలక్క సనత్‌నగర్‌లోని కరెంట్‌ మీటర్‌ ఫ్యాక్టరీలో పనిచేసేది. వెంకటాపురం నుండి సనత్‌నగర్‌ చాలా దూరం. ఉదయం ఏడింటికి ఇంట్లో నుంచి బయలుదేరితే తిరిగి ఇంటికి చేరే సరికి రాత్రి అయ్యేది. గద్దర్‌ పై ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఎక్కడికక్కడ నిర్బంధించారు. నిర్బంధంలోనూ పాటే ఆయుధంగా ముందుకు సాగారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6-4-1997న కొందరు ఆగంతకులు తుపాకి పేల్చారు. ఆరు తూటాలు గద్దర్‌ శరీరాన్ని తూట్లు పొడిచాయి. అతి కష్టంమీద డాక్టర్లు బతికించారు. ఒక తూటా ఇప్పటికీ వెన్నుపూసలో ఉండిపోయింది. గద్దర్‌, విమలక్క దంపతులకు ముగ్గురు పిల్లలు. సూర్యుడు, చంద్రుడు, వెన్నెల. వీరు తమకు తామే ఎదుగుతూ వచ్చారు. వారి ఆలనాపాలనా తల్లిదండ్రులుగా గద్దర్‌, విమలక్క చూసుకోవడం సాధ్యపడని పనివత్తిడి. వీరి పరిస్థితి గమనించి బి.నర్సింగరావు తమ్ముడు హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌వర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌ కరెస్పాండెంట్‌ అయినా వేదకుమార్‌ స్కూల్లో, హాస్టల్లో ఉచితంగా చేర్చుకొని తనవంతు సహకారం అందించారు.

చంద్రుడు 31-12-2003లో చనిపోయారు. చనిపోయే నాటికి చంద్రం ఎమ్‌.బి.బి.యస్‌ మూడో సంవత్సరం. గద్దర్‌ బెంగుళూరులో సభలు, సమావేశాలలో పాల్గొని ఇంటికి చేరే సరికి ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆస్పత్రి పాలైయ్యారు. ఆస్పత్రికి ఇంటికి తిరుగుతూ చంద్రం అకాల మరణం చెందారు. ఇలా తండ్రికోసం, తండ్రి అంకితమైన లక్ష్యాల కోసం గద్దర్‌ కుటుంబం చేయని త్యాగం లేదు. వారి జీవితాలు ఎన్నో ఒడిదుడుకులకు లోనైయ్యాయి. కొడుకు, కూతురు తలా ఒక పనిచేసుకొని బతుకుతున్నారు. తల్లిదండ్రులను సాదుకుంటున్నారు.

గద్దర్‌ తల్లి సావిత్రిబాయి ఫూలేలా గోచి చీరతో మహారాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ఉంటుంది. మా అమ్మ కూడా అలాగే ఉంటుందని గద్దర్‌ గుర్తుచేస్తుంటాడు. వృత్తులు వేరైనా మా శ్యామల కష్టాలు, విమలక్క కష్టాలు ఒక్కటే కదా అని గద్దర్‌ విప్లవకారుల కుటుంబాల కష్టాలను, కన్నీళ్లను సార్వజనీనంగా సాహిత్యీకరించారు. అలా తల్లి లచ్చుమమ్మను, విమలక్కను సార్వజనీనంచేస్తూ పాటలు రాశారు. గద్దర్‌ తన సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలు బాణి పరమైనవి, శిల్ప పరమైనవి, వస్తు పరమైనవి. మార్గదర్శకానికి సంబంధించినవి. జానపద కళారూపాలను లోతుగా అధ్యయనం చేసి అందులోని బలాన్ని గ్రహించి తన పాటలను సిద్ధాంత బలంతో జీవితం, సంస్కృతి, అట్టడుగు కులాల ప్రజల భాష నుడికారంతో వేమన, కబీరు, జాషువా వలె సులభంగా సూటిగా హృదయాలను తాకే విధంగా తీర్చి దిద్దారు.

గద్దర్‌ పాటల అందాలను, శైలీ శిల్పాన్ని ప్రతీకాత్మకతను, విప్లవ గాఢతను వివరించటానికి ఈ వ్యాసం సరిపోదు. విప్లవ భావజాలంలో, విప్లవోద్యమంలో, దళిత ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో టర్నింగ్‌ పాయింట్‌ దగ్గర గద్దర్‌ కాంట్రిబ్యూషన్‌ మార్గదర్శకంగా ఒక కవిగానే కాకుండా తత్వవేత్తగా, సామాజిక శాస్త్రవేత్తగా దారి చూపిన క్రమాన్ని చెప్పటం అవసరం.

ఉద్యమకారులుగా గద్దర్‌ అశేష ప్రజారాసులకు ఉత్తేజాన్ని అందించారు. చైతన్యం రగిలించారు. నిరాశలో నేనున్నాను అంటూ అనునయించారు. అమరులైన ఉద్యమకారుల త్యాగాన్ని కీర్తించి ఉత్తేజాన్ని నింపారు. విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, మేధావులు, కళాకారులు, విద్యావంతులు, పరిపాలకులతో సహా ఎందరో గద్దర్‌ అందించిన చైతన్యాన్ని అందుకొని ముందుకు సాగినవారే. నిరాశలో, దారితప్పినప్పుడు తమను తాము సవరించుకోటానికి గద్దర్‌ మాట, పాట గొప్ప సాధనమైంది.

గద్దర్‌ రాత్రింబగళ్ళు ఆలోచించి ముందు చూపుతో సమాజంలోని పలు శ్రేణులను కదిలించడానికి, విప్లవించడానికి పాట, మాట, ఆట ప్రక్రియలను రూపొందించి ప్రదర్శించారు. అందువల్ల విప్లవం, విప్లవకారులు చొచ్చుకుపోలని ఎన్నో రంగాలల్లో, ఎన్నో వేదికల్లో, ఎన్నో ఉద్యమాల్లో గద్దర్‌ చొచ్చుకుపోగలిగారు, దారిచూపగలిగారు. విప్లవోద్యమానికి గొప్ప మద్దతును, అశేష ప్రజారాసిని కూడ గట్టగలిగారు. గద్దర్‌ చేసిన కృషిని బేరీజు వేయడానికి విప్లవోద్యమం నిర్మాణం చేయలేని రంగాల్లో విప్లవ ఉత్తేజం ఎన్ని రెట్లు వ్యాపించిందో గమనించవచ్చు. ఉద్యమనిర్మాణాల వెలుపల ఎన్నో రెట్లు ప్రభావం వేసే క్రమానికి రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసిన కృషికి తార్కాణం.

తన పాటలతో పాటు అందరి పాటలు పాడిన గద్దర్‌:

గద్దర్‌ వందలాది పాటలు రాశాడు. ఇతరులు రాసిన పాటలను ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. తాను స్వయంగా కవి అయి వుండి ఇతరుల పాటలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే కవులు చాలా అరుదు. ప్రతి పాటా సామాజిక చైతన్యం కోసం ప్రజల్లో స్ఫూర్తి నింపడం కోసం, చైతన్యంతో ముందుకు సాగడం కోసం రాశాడు, పాడాడు.

కళారూపాలను స్వీకరించిన తీరు:

గద్దర్‌ పాడని పాటలేదు, గద్దర్‌ రాయని వస్తువులేదు అన్నంతగా రాశారు. డప్పు, కంజర, డొలక్‌, గజ్జెలు మొదలైన ప్రజలలో ప్రాచుర్యం పొందిన, ప్రజలకు అలవాటైన సంగీత వాయిద్యాలను స్వీకరించి పాటకు, ఆటకు అనువుగా మలుచుకున్నారు. వాటితో పాటు గద్దర్‌ ఒగ్గు కథ కళారూపానికి సింబల్‌గా నిలిచారు. ఒగ్గు కథ యాదవుల ఒక ప్రత్యేక కళారూపం. ఆ రూపంలో ఒక సంక్షిప్తత, ఒక సౌకర్యం. ప్రధాన కథకుడుతో పాటు ఇద్దరు వంతలు వుంటే చాలు. అందువల్ల ఈ కళారూపాన్ని జననాట్యమండలి ద్వారా గద్దర్‌ బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చారు. అది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, గత నాలుగు థాబ్దాల్లో వేలాది కళాబృందాలు ఇదే ఆహార్యాన్ని ధరిస్తూ, పాడుతూ ఒక ట్రెండ్‌ను స్థిరపరిచాయి. అలా గద్దర్‌ తెచ్చిన మార్పు మొత్తం ప్రజా కళారూపాల్లో ఒక ప్రధానమైన మార్పుకు కారణమైంది. అలా గద్దర్‌ ఒక లెజెండ్‌గా, వైతాళికుడిగా నిలిచారు.

గద్దర్‌ పాటలు జననాట్యమండలి పాటలుగా ప్రాచుర్యం పొందాయి. జననాట్యమండలి పాటల పుస్తకంలో రచయితల పేర్లు వేసేవారు కాదు. గద్దర్‌ పాడిన ప్రతి పాట గద్దర్‌ రాసిందేమోనని అనుకునేంత గొప్పగా పాడి ప్రదర్శించేవాడు గద్దర్‌. 1982లో ''గద్దర్‌ పాటలు'' అనే పుస్తకం వెలువడింది. దీనికి కె.వి.ఆర్‌, బి.నర్సింగ్‌రావు. ముందుమాట రాశారు. కె.వి.ఆర్‌ తన ముందుమాటలో ''గద్దర్‌ లివింగ్‌ లిజెండ్‌'' అని పేర్కొన్నారు.

1979 జనవరిలో విరసం సాహిత్య పాఠశాలలో జననాట్యమండలి కళారూపాల శిక్షణా తరగతులు పాఠాన్ని ''ప్రజల పాటలు - అనుభవాలు'' అనే పుస్తకంగా విప్లవ రచయితల సంఘం ప్రచురించింది. చిన్న పుస్తకంగా ప్రచురించారు. 1991లో ''ప్రతిపాటకు ఒక కథ ఉందా? ఆ ఉంది?'' అనే పేరుతో పాట వెనుక గల కథను కల్పనను నేపథ్యాన్ని వివరించారు. ఆ తర్వాత ''తరగని గని'' అనే పుస్తకం ప్రచురించారు. వెయ్యికాపీల సత్‌సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయటం కష్టమైన కాలంలో లక్షలాది జననాట్యమండలి పాటల పుస్తకాలు అమ్ముడైయ్యాయి. ఇలా గ్రామీణ యువతరం తమ చైతన్యాన్ని ఆసక్తిని పెంచుకొని విప్లవంలోకి మహాప్రవాహంగా ప్రవహించారు.

గద్దర్‌పై పెట్టిన కేసులు, నిర్భందాలు లెక్కతేలదు. నిరంతరం నిఘా. శత్రువు నిఘాను తప్పించుకుంటూ ఎన్నో మీటింగ్‌లను విజయవంతం చేసారు. నాకొకటి బాగా గుర్తు. 1985 ఏప్రిల్‌ 20వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంద్రవెల్లి సభ. చుట్టూ నిర్బంధం. గద్దర్‌ టీమ్‌ ఒక జీపులో, మేమంతా ఒక జీపులో బయలుదేరాం. మమ్మల్ని గుడిహత్నూర్‌ వద్దే నిలిపివేశారు. గద్దర్‌ ఏమయ్యాడో ఆందోళన చెందాము. ఎలాగో తప్పించుకొని మాకన్నా ముందే ఇంద్రవెల్లి స్థూపం చేరి అమరుల సభను విజయవంతం చేశారు. మేము అనగా పౌరహక్కుల సంఘం బాలగోపాల్‌, మురళీ మనోహర్‌, ఢిల్లీ ప్రొఫెసర్‌ మనోరంజన్‌ మహంతి, కాకతీయ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ సీతారామారావు, నేను ఊట్నూరు లాకప్‌లో, ఆ తర్వాత ఆదిలాబాద్‌ కోర్టు జైలు పాలయ్యాము. మా పై పెట్టిన కేసును పదకొండు వందల మంది ఢిల్లీ ప్రొఫెసర్‌లు సంతకాలతో ఉపసంహరించాలని కోరడంతో ఉపసంహరించారు. ఇలా చాలా మంది రచయితలు, మేధావులు, విప్లవకారులు పోలేని ప్రాంతాలకు, సభలకు కూడా తన దైన శైలిలో వెళ్ళి గద్దర్‌ సభలను విజయవంతం చేసేవాడు. ఉత్తేజం కలిగించేవాడు. అలా చంద్రపూర్‌, నాగపూర్‌, బలార్షా, గడ్‌చిరోలి, సిరొంచ, దండకారణ్యం అంతా పర్యటించారు.

ఈ దేశంలో వున్న వ్యవస్థ అర్థభూస్వామ్య, అర్థ వలస వ్యవస్థ అని నక్సలైట్‌ ఉద్యమకారులు భావించారు. ఈ దేశంలో కార్మికవర్గ విప్లవం తేవడానికి వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవం సాగాలని ఉద్యమించారు. ఇరుసుగా వివిధ ప్రజాసంఘాల ఉద్యమాలు సాగాలని భావించారు. అలా విద్యార్థులు, యువజనులు, రైతుకూలీలు, ఆదివాసీలు, సింగరేణి కార్మికులు, ఆర్టీసి, బీడీ కార్మికులు, ఉపాధ్యాయులు, పౌరహక్కుల ఉద్యమకారులు, విప్లవ రచయితలు, విప్లవ కళాకారులు తదితరులను సమీకరించి ఉద్యమించారు. ఆ ప్రజాసంఘాల ఉద్యమాలకు ఉత్తేజాన్ని ఇస్తూ ఎన్నో పాటలు రాశారు గద్దర్‌. ఉద్యమం నిర్మించడం కోసం ఆయా ప్రజాశ్రేణులను చేరడానికి అనేక పాటలను ప్రజలకు, ఉద్యమానికి అందించారు గద్దర్‌.

'లాల్‌ సలామ్‌... లాల్‌ సలామ్‌', పాటతో వేలాది అమరుల త్యాగాలను ఉత్తేజం కలిగించే విధంగా ప్రదర్శించారు. వ్యవసాయ విప్లవం అనే సిద్ధాంత గ్రంథాన్ని కార్యక్రమాన్ని 'భారతదేశం భాగ్యసీమరా' అనే పాట ద్వారా సులువుగా ప్రజల హృదయాల్లో హత్తుకునే విధంగా రాశారు. ఈ పాటను మహరాష్ట్రకు చెందిన అహ్వాన్‌నాట్య మంచ్‌ కవి, కళాకారుడైన విలాస్‌గోగ్రే హిందీలోకి అనువదించారు. సుప్రసిద్ధ డాక్యుమెంటరీ దర్శక, నిర్మాత ఆనంద పట్వర్థన్‌ 1985లో ఆ పాటను ఒక గంట డాక్యుమెంటరీ సినిమాగా దృశ్యీకరించారు.

ఆయన పాట వేసే ప్రభావం చెప్పడానికి వేలాది, లక్షలాది మంది విద్యార్ధులు, యువకులు, కార్మికులు, కర్షకులు విప్లవంలోకి ప్రవహించటమే సాక్ష్యం. ఆయన పాటతో స్ఫూర్తి పొందని విప్లవకారులు ఉండకపోవచ్చు.

జననాట్యమండలికి పూర్వం సాహిత్యం ఎలా ఉండేది?

జననాట్యమండలికి పూర్వం ఉద్యమ పాటల్లో మధ్యతరగతి సాహిత్యం, భాష, సంస్కృతి ప్రభావం ఎక్కువ. గ్రామీణ ప్రజలు మాట్లాడే భాషను, నుడికారాన్ని ప్రజల పాటల్లోకి తేవాలని ఉద్యమం, జననాట్యమండలి భావించింది. అలా తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రజల భాష సాహిత్య భాషగా ప్రజల్లో బలమైన ప్రభావం వేసింది. ప్రజలకు అందుబాటులో ఉన్న వాయిద్యాలతో విస్తరించింది.
గద్దర్‌ మధ్యతరగతి భాషకు ప్రజల భాషకు మధ్యగల తేడాను 'తరగని గని' పుస్తకంలో వివరంగా చర్చించాడు. సినిమాల్లోనూ, జానపద శైలి పాటలకు, ఇతర పాటలకు ఎంతో తేడా గమనించవచ్చు. సంకల్పబలంతో, నిబద్ధతతో 1970 నుండి అట్టడుగు వర్గాల ప్రజల భాష పాటల్లోకి, ప్రసంగాల్లోకి, కథల్లోకి, నవలల్లోకి క్రమంగా, ఆ తర్వాత వచన కవిత్వంలోకి విస్తరిస్తూ వచ్చింది. ఆనాడు విప్లవోద్యమం, జననాట్యమండలి ఈ పని చేస్తే 1995 నుండి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం స్ఫూర్తినిస్తూ వస్తున్నది.

గద్దర్‌ను మలచిన తొలినాళ్ళ పరిణామాలు:

గద్దర్‌ 1965ల్లో అంబేడ్కరిజం గురించి, కుటుంబ సంక్షేమం గురించి పాటలు పాడేవాడు. ప్రదర్శనలు యిచ్చేవాడు. చదువుకున్న దళితుల్లో సాధారణంగా మొదట అంబేద్కరిజమే ప్రాచుర్యంలో వుండేది. అలా అక్కయ్య ద్వారా మిత్రులద్వారా అంబేద్కరిజం నుండి ప్రారంభమైన ఒక తమ్ముడు, ఒక దళితుడు గద్దర్‌. బి.నర్సింగ్‌రావు గద్దర్‌ కలుసుకోవడం జరిగి వుండకపోతే గద్దర్‌ అంబేద్కరిజం దళిత ఉద్యమంలో కొనసాగి ఉండేవాడు.

నక్సల్బరీ, శ్రీకాకుళాలు రగిలిరగిలి ఉవ్వెత్తున లేచి ఉజ్వలంగా ప్రకాశించిన కాలంలో గద్దర్‌ అంబేద్కరిజం, కుటుంబ సంక్షేమం, తదితర సంబంధిత కళాకారుడుగా వుండేవాడు. శ్రీకాళ ఉద్యమం తీవ్ర నిర్బంధానికి, అణిచివేతకు గురై కార్యకర్తలు, నాయకత్వం పాశవిక హత్యాకాండకు బలియైంది. ఆ ఉద్యమాన్ని కొనసాగింపజేయాలని, దాని నిప్పును కాపాడుకోవాలని, పోరాటాల్ని విస్తృతీకరంచాలని, ఆ క్రమంలో శతృవు కేంద్రీకరణను తట్టుకోగలమని కొందరు ఉద్యమకారులు భావించారు. తెలంగాణాలో అలా 1968-70ల్లో నక్సల్బరీ, శ్రీకాకుళం నిప్పురవ్వలు పడి రాజుకోవడం మొదలైంది.

వర్గశతృ నిర్మూలన ప్రధాన కార్యక్రమంగా సాగిన నక్సల్బరీ, శ్రీకాకుళ రాజకీయాలు, సామాజిక రంగంలో మేధావుల, కళాకారుల, రచయితల మద్దతు పొందాల్సిన అనివార్యతను పెరుగుతున్న నిర్బంధం క్రమంలో గుర్తించాయి. నిర్బంధం అలా ప్రజల విస్తృత మద్దతు సాధించే వ్యూహాన్ని అనివార్యం చేసింది. పలు చర్చలు, యిష్టాగోష్టుల క్రమంలో ''ఆర్ట్‌ లవర్స్‌'' అనే సంస్థ విప్లవ సాంస్కృతిక సంస్థగా పరివర్తన తీసుకుంది.

నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే ఏమిటి?

నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే ఏమిటి? పూర్వం పాశ్చాత్య దేశాల్లో ఫ్యూడల్‌ వ్యవస్థలుండేవి. అవి పారిశ్రామికీకరించే పెట్టుబడిదారీ అభివృద్ధికి ఆటంకంగా మారాయి. వాటిని పెట్టుబడి దారీ విప్లవాలు కూల్చివేశాయి. ప్రథమ భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత, ఫ్రాన్సులో ప్యారిస్‌ కమ్యూన్‌ అనే కార్మిక విప్లవ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు సాగింది. దాన్ని పెట్టుబడిదారీ వర్గాలు కూల్చివేశాయి. తర్వాత దాన్నించి గుణపాఠం తీసుకుని యికనుంచి మనం భూస్వామ్య వ్యవస్థను కూల్చవచ్చు. కూల్చేస్తే మన తర్వాత కార్మికులు మనల్ని కూల్చేస్తారు. అందువల్ల రాజీ పడదాం అనుకున్నాయి. కార్మికులు అనేవర్గం పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధిలోనే ఉత్పత్తి అవుతారు. వాళ్ళకు సోషలిజం అవసరం. అది పెట్టుబడిదారీ విప్లవం తర్వాత వస్తుంది. పెట్టుబడి దారీ విప్లవం భూస్వామ్య వ్యవస్థను కూల్చివేయడం నుంచి వస్తుంది. మరి పెట్టుబడి దారులు యీ లక్ష్యాన్ని వదిలేశారు. రాజీపడ్డారు. కనక కార్మికులే యీ రెండు కర్తవ్యాలు నిర్వర్తించాలి అనుకున్నారు.

ముందే చెప్పినట్టు ఈ దేశం అర్థవలస, అర్థ భూస్వామ్య వ్యవస్థ అని దీన్ని నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా సోషలిస్టు సమాజంగా మార్చాలని అందుకు వ్యవసాయ విప్లవం ఇరుసుగా ఇతర ప్రజారాసుల పోరాటాలను ఆకులుగా ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నాము. అనగా ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు, రాజ్య స్వభావం, అర్థవలస అర్థభూస్వామ్య స్వభావాన్ని కలిగి ఉన్నాయని పూర్తి స్థాయి పెట్టుబడిదారీ సమాజం దేశంలో ఏర్పడలేదని, మౌలికంగా గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యవస్థనే కొనసాగుతుందని భావించారు. నూతన ప్రజా విప్లవం అంటే వ్యవసాయ విప్లవాన్ని సాధించి పారిశ్రామిక పెట్టుబడిదారీ సమాజంగా పరివర్తన చెందించటం. ఆ క్రమంలో సోషలిస్టు సమాజాన్ని శాంతియుత పరివర్తనతో సాధించడం. యూరప్‌ తదితర దేశాల్లో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు విప్లవం చేశారు. ఈ దేశంలో అలా జరగలేదు. అందువల్ల పెట్టుబడిదారీ, పారిశ్రామిక విప్లవం, వ్యవసాయిక విప్లవం చేయడం కూడా కార్మికవర్గ విప్లవ ప్రధాన లక్ష్యమైంది.

అందువల్ల ఈ నూతన పారిశ్రామిక, వ్యవసాయిక, పెట్టుబడిదారీ విప్లవానికి ఈసారి నాయకత్వం కార్మిక వర్గానిదే కనక సోషలిస్టు విప్లవం కోసం మరో యుద్ధం అవసరం లేకుండానే శాంతియుత పరివర్తనతో సోషలిజంలోకి అది పయనిస్తుంది. ఇదీ స్థూల దృక్పథం. అందువల్ల పెట్టుబడిదారీ విప్లవాన్ని కొంచెం పేరుమార్చి నూతన ప్రజాస్వామిక విప్లవం అన్నారు. ఇలా నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే సారంలో కార్మికవర్గ పార్టీ నాయకత్వంలో పారిశ్రామిక, పెట్టుడిదారీ విప్లవం, రూపంలో మార్క్సిస్టు విప్లవం. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలియక పారిశ్రామిక, పెట్టుబడిదారీ విప్లవ క్రమాలను వ్యతిరేకిస్తుంటారు. అందుకు దళారీ పెట్టుబడిదారీ వర్గం ప్రగతి శీల పాత్ర కోల్పోయిందని అని చెప్తారు.

English summary
BS Ramulu, a prominent writer, explains the evolution of Gaddar and about his contribution to the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X