వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విప్లవోద్యమం, సాహిత్యం: గద్దర్‌ పార్ట్ - 3

By Pratap
|
Google Oneindia TeluguNews

Gaddar
పైన పేర్కొన్న విప్లవ అవగాహన, కార్యక్రమాల పరిణామాలననుసరించి గద్దర్‌ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. పాటలు, కళారూపాలు ఆయా సామాజిక ఉద్యమాల పరిణామాలననుసరించి రూపుదిద్దుకున్నాయి. అందువలన వాటిని థల వారీగా, వస్తువు వారిగా బాణీల వారిగా, ఆయా కార్యక్షేత్రాల వారిగా, ప్రాచుర్యం వారిగా, శిల్ప ప్రాధాన్యత వారిగా ఇలా అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. దానికి ముందు సామాజిక పరిణామాల, విప్లవ పరిణామాల థలను అనుసరించి ఇలా వర్గీకరించడం అవసరం.

1.1970-76 కాలానికి సంబంధించిన పాటలు:

గద్దర్‌ ప్రారంభ థలో అంబేద్కరిజం తాలూకు దళిత దృక్పథంతో ఉన్నాడు. అది సహజం. విప్లవోద్యంలో దళితుల గురించి రాసినప్పుడు దళిత దృక్పథంతోనే జీవితాన్ని చిత్రించాడు. పరిష్కారాలకు విప్లవం అవసరమని సూచించాడు. అయితే కులాన్ని సూచించే పదాలు తొలగించాలని ఆనాటి దృక్పథంతో ఉద్యమకారులు కోరారు. అలా క్రమక్రమంగా గద్దర్‌లోని దళితవాదం, దళిత దృక్పథం సెన్సార్‌ చేయబడుతూ మార్క్సిజంలోకి పరివర్తన చెందించడం జరిగింది. ఉదాహరణకి...
''యాలరో ఈ మాదిగబతుకు
ఎంత మొత్తుకున్న దొరకదిరా మెతుకు'' అనే పాట రాసినప్పుడు ఎం.ఎల్‌ గ్రూపులలో చాలా మంది నామీద పెద్దెత్తున అటాక్‌ చేశారు-పేదోల్లు, కూలోల్లనాల్నేగానీ కులాలమీద రాస్తవా అని. ఆబ్జెక్టివ్‌ రియాలిటీగదా కులమంటే అని జవాబు చెప్పాను.'' ఇలా వర్గదృక్పథానికి మారుతున్న కాలంలో కులం పేరు వదిలేసి వృత్తిని, వర్గాన్ని సంబోధిస్తూ పాటలు రాశాడు. ఉదాహరణకి...
''పోదామురో జనసేనలోనగలిసి
ఓయన్న జీతగాడ - మాయన్న జీతగాడ
పూటగంజిలేనివాడ - కదిలిరావో కూలిదండులో గలువా''
1971లో రాసిన ఈ పాట నాటికి జనసేనలేదు. సైన్యంలేదు. అయినా కొండపల్లి సీతారామయ్య ఈ పాట పాడాల్సిందేనని కోరాడు. అలా జనసైన్యం యొక్క ఆవశ్యకతను ముందు పాటద్వారా ప్రజల మనసుల్లోకి ఎక్కించారు.

''రెక్కబొక్క నొయ్యకుండా సుక్కచెమట వడవకుండ
బొర్రబాగ పెంచినవ్‌ దొరోడో నీ పెయ్యంతా మంత్రిస్తం దొరోడో''
''ఏం బతుకులు మనయిరో అన్నల్లారా చెల్లెల్లారా''
''నిలపర బండొడో బండెంట నేనొస్త
ఆపుర రిక్షోడో రిక్షెంటా నేనొస్తా''
1972లో ప్రగతిశీల విద్యార్థుల పేరిట విద్యార్థి సంఘం ఏర్పడింది. ఆ విద్యార్థి సంఘం తర్వాత 1974 అక్టోబరులో పి.డి.యస్‌.యుగా, దాన్నించి చీలిపోయి 1975 ఫిబ్రవరిలో ఆర్‌.యస్‌.యు గా ఏర్పడ్డాయి. ప్రజల్లోకి చేరడం కోసం ఆర్‌.యస్‌.యు. విద్యార్థులు ''గ్రామాలకు తరలండి క్యాంపస్‌'' తో ముందుకుసాగారు. అందుకు పాట ఒక ఆయుధమైంది.

ఈ క్యాంపేన్‌తో పార్టీ స్వరూప స్వభావాలు గుణనీయంగా అభివృద్ధి చెందాయి. విశాల దృక్పథం అలవడింది. గద్దర్‌, జననాట్యమండలి పాటలే ప్రజల్లోకి వెళ్లడానికి మార్గం వేశాయి. ప్రతి విద్యార్థి దళంలో పాటలు పాడే వాళ్లు తప్పని సరిగా ఉండేవారు. సికింద్రాబాద్‌ వెంకటాపురంలోని గద్దర్‌ ఇంట్లో నిరంతరం విద్యార్థులకు, యువకులకు జననాట్యమండలి శిక్షణా తరగతులు సాగుతుండేవి. వేలాది మంది ఈ శిక్షణ పొంది కాలక్రమంలో విప్లవకారులుగా పరిణితి చెందారు.
''నక్సల్బరి బిడ్డలం ఒగ్గుకథ''
''యాలరో ఈ మాదిగ బతుకు''
''సుక్కా బొట్టుపెట్టుకొని చంద్రన్న''
''నేను సూరుకింద నిలబడితే చంద్రన్న''
''రిక్షాదొక్కే రహీమన్న రాళ్లుగొట్టే రామన్న
హమాలీ కొమురన్న డ్రైవర్‌ మల్లన్న''
''వచ్చెరో కరువొచ్చెరో''

గద్దర్‌ సాహిత్యాన్ని పత్రికలు పెద్దగా ప్రోత్సహించలేదు. విప్లవ సాహిత్య పత్రికలు కూడా నిరాదరణకు గురి చేశాయి. గద్దర్‌ గురించి 1972-73ల్లో వెలువడిన ''పిలుపు'' పత్రికలో కొండపల్లి సీతారామయ్య వ్యాసం రాసి ''ఆపుర రిక్షోడో....'' అనే పాటను ప్రచురించారు. కొండపల్లి సీతారామయ్య ఆ వ్యాసంలో నక్సలైట్‌ ఉద్యమ భావజాలాన్ని పాట అనే విత్తనంగా చేసి ప్రజలు అనే పొలంలో నాటిన విప్లవ సాంస్కృతిక కార్యకర్త అని ప్రశంసించారు. ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూతో కలిసి చాయ్‌ తాగేవాడని ప్రసిద్ధిపొందిన జర్నలిస్టు జి.కృష్ణ ఆంధ్రప్రభ దినపత్రికలో గద్దర్‌ గురించి వ్యాసర రాశారు. దినపత్రికలో వచ్చిన మొదటి వ్యాసం ఇదే. ఉదయం అనే ఆర్ట్‌లవర్స్‌ సంచిక 1973 గద్దర్‌పై ఆర్టిస్ట్‌ చంద్ర వ్యాసం వ్రాశారు. సుప్రభాతం వార పత్రికలో 1997-99లో కాసుల ప్రతాపరెడ్డి, గద్దర్‌ ప్రస్థానం గురించి, జీవితం గురించి, ఆనాటి ఫోటోలతో సహా కవర్‌పేజీ వ్యాసం వ్రాశారు. చూపు మాస పత్రికలో 2000 ఏప్రిల్‌ సంచికలో నేను-నాపాట గద్దర్‌ వ్యాసం ప్రచురించారు. ప్రజాసంగీతం పట్టించుకోవల్సిన సంగతులు, గద్దర్‌ సంసారం చేసేది పాటలతోనే అని చెప్పిన విమలక్క ఇంటర్వ్యూ ఆంధ్రజ్యోతి ఆదివారం 1997 ఏప్రిల్‌ సంచికలో ప్రచురించారు. తుపాకి తూటాను జయించిన పాట ఎం. లక్ష్మయ్య, ప్రపంచంలో పాల్‌రాబ్సన్‌ తరువాత గద్దరే మనకు కన్పిస్తారు అని దేవిప్రియ తదితరులు పేర్కొన్నారు. వర్గిస్‌ ''నీ చెమటినుకని చేనుందా! నువు చెయ్యని చీజుందా?!! అని గద్దర్‌ పాటను పేర్కొంటూ గద్దర్‌ పాటల పుస్తకానికి 1981 ఏప్రిల్‌లో ముందుమాట రాస్తూ అనేక కోణాల్లో గద్దర్‌ని పరిచయం చేశారు. పాటలు - ఆటపోట్లు అనే చిన్న పుస్తకాన్ని గద్దర్‌ 1995లో స్వయంగా ప్రచురించారు. పొత్తూరి వెంకటేశ్వరరావు గద్దర్‌ని యుగకర్త అని పేర్కొన్నారు. 1980లలో సుధ, కిరణ్‌, వీరన్న, రాజన్న, సత్తన్న, నారాయణ, వంగపండు, కె.సి. వంటి ఎందరో పాటలు రాశారు. మాభూమి సంధ్య కంఠం జననాట్యమండలికి ఒక ప్రత్యేకతను సంతరించిపెట్టింది

విప్లవ రచయితలు, సాహిత్య వేత్తలు పాటను, సాంస్కృతిక కళాకారులను వారి కృషిని చాలా కాలం చిన్నచూపు చూసారు. రెండవ శ్రేణి పౌరుల్లా, రచయితల్లా భావించబడ్డారు. అందులో కులం పాత్ర తక్కువేమీ కాదు. పాటల రచయితలు, కళాకారులు ప్రధానంగా దళిత బహుజన కులాల నుండి వచ్చినవారు. విప్లవ రచయితల్లో అగ్రకులాల వారి ఆధిపత్యమే కొనసాగింది. అయినప్పటికీ పాట ప్రజల నాలుకలమీదుగా లక్షలాది ప్రజలకు చేరువవుతూ ప్రజలను ఉద్యమంలోకి సమీకరిస్తూ వచ్చింది. విద్యార్ధులు గ్రామాలకు తరలండి అనే కార్యక్రమంతో తమకు పరిచయం లేని పల్లెల్లో ప్రచారం చేయడానికి పాటే ప్రధాన సాధనంగా ఉపయోగపడింది. అలా పాట ముందు నడిచింది, పాట వెంట ఉద్యమం నడిచింది. ఆ తరువాత ఉద్యమ నిర్మాణం సాగింది. ఇలా పాట పంట పొలాలను పండించింది. విప్లవం దాన్ని రాసులుగా నిర్మాణంలోకి సమీకరించింది. ఉద్యమ చైతన్యం విస్తరించిన దాన్లో పది శాతమైనా ఉద్యమం నిర్మాణంలోకి సమీకరించలేనంతగా ఉద్యమ ప్రచారం, ప్రభావం వ్యాప్తిచెందింది.

జననాట్య మండలి:

పార్టీకి గానీ, విరసం గానీ లేని ఒక సౌకర్యం జననాట్య మండలికి వుంది. విరసం ప్రదానంగా మధ్య తరగతి మేధో, సాహిత్యరంగాలకు పరిమితమైంది. దాని ఉపన్యాస ప్రక్రియ ఒక్కటే అట్టడుగు ప్రజల దాకా చేరగలిగింది. పార్టీ రహస్య నిర్మాణానికి పరిమితమైంది. జెఎన్నెం ఈ రెండు పరిమితుల్ని అధిగమించింది. ఆ క్రమంలో ప్రజల జీవితాల లోతుల్లోకి వెళ్ళడం, హృదయాలను పసిగట్టడం, వాటినించే తమ రాజకీయ, మానవీయ సంబంధాల సారాన్ని చెప్పడం మొదలయ్యాయి. ఇతర ప్రజాసంఘాల నిర్మాణం యొక్క ఆవశ్యకతని కాలక్రమంలో విప్లవ పార్టీలు గుర్తించాయి. అవి సరిగ్గా రూపుదిద్దు కోకముందే 25-6-1975న అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించబడింది. అనేకమంది చంపబడ్డారు. ఎందరో జైళ్ళపాలయ్యారు. 1977 మార్చిలో జనతాప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది. అపుడు నిర్బంధాలు తొలగిపోయాయి. స్వేచ్ఛగా ఎంతవీలైతే అంతగా ప్రజాసంఘాల నిర్మాణం సాగింది. అలా విద్యార్థి సంఘాలతోపాటు రాడికల్‌ యువజన సంఘం ఏర్పడింది.

అటుతర్వాత రైతుకూలీ సంఘం ఏర్పడింది. అటుతర్వాత గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పడ్డాయి. తర్వాత గ్రామ రక్షక దళాల నిర్మాణం కోసం ప్రయత్నం సాగింది. నిర్బంధం పెరిగే క్రమంలో ప్రతి ఏటా మూడింట ఒకవంతు కార్యకర్తలు యితర ప్రాంతాల్లో, లోతట్టు గిరిజన ప్రాంతాల్లో ఉద్యమాన్ని విస్తృతీకరించే కార్యక్రమంపై ప్రస్థానం సాగించారు. అలా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ రైతాంగ పోరాటాలు అని పిలువబడ్డ పోరాటాలు దండకారుణ్య పోరాట ప్రాంతంగా, గెరిల్లా జోన్‌ లక్ష్యంగా, సాయుధ దళాల నిర్మాణంగా దృక్పథం ఆచరణ విస్తృతీకరణ పొందాయి.
''తుపాకులకు ఎదురు నిలవరా అనే
తూటాల మాలతొడగరా''
''కల్లు ముంతో మాయమ్మ
నిన్ను మరువజాలనే''
''నిజం తెలుసుకోవరో కూలన్న
నీవు నడుపుకట్టి నడువరో మాయన్న''
''రక్తంతో నడుపుతాను రిక్షాను
నారక్తమె నా రిక్షకు పెట్రోలు''
''పిల్లో నేనెల్లిపోత
కన్నీరు పెట్టబోకు''
''మాయన్న జీతగాడ దుక్కి దున్ని'' (ఇది 30 పాటల గుత్తి)

1970 నుండి 1976 మధ్య విద్యార్థి, యువజనులను ఉద్యమాల్లోకి ఆహ్వానిస్తూ అనేక ప్రదర్శనలు ఇచ్చారు గద్దర్‌. ఎమర్జెన్సీలో మెదక్‌ జిల్లా గిరాయి పల్లెలో ఎన్‌కౌంటర్‌ పేరిట హత్య చేసిన రాడికల్‌ విద్యార్థుల గురించి ఒగ్గు కథ రాసి ప్రదర్శించారు. కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి తదితరుల నాయకత్వంలో సాగిన విప్లవోద్యమ లక్ష్యాలను ముందుకు తీసుకొనిపోతూ ప్రజల సమస్యలను పట్టించుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమాల్లోకి రావలసిందిగా ఆహ్వానిస్తూ తన కార్యక్రమాలను జననాట్యమండలి ద్వారా ముందుకు తీసుకుని వెళ్ళారు.

ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత విప్లవోద్యమ దృక్పథం:

ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత విప్లవోద్యమం వివిధ శ్రేణుల ప్రజలను పట్టించుకొని ప్రజాసంఘాలను నిర్మాణం చేయాలని భావించింది. రాడికల్‌ విద్యార్థి, యువజన సంఘాలను, రైతుకూలీ సంఘాలను, సింగరేణి కార్మిక సంఘాలను, బీడీ కార్మిక సంఘాలను విస్తృతంగా నిర్మించాలని విద్యార్థులు, యువకులు గ్రామీణ ప్రాంతాలకు తరలాలనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. కళారూపాల్లో జననాట్యమండలి గద్దర్‌ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. విద్యార్థులకు, యువకులకు పాటల శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ఆ విద్యార్థుల గురించి వాటి త్యాగాల గురించి వివరిస్తూ అనేక పాటలను రాశారు. వాటి నుంచి కొన్నింటిని ఇలా పేర్కొనవచ్చు.
''వీరులార సూరులారా విప్లవవాల లాల్‌సలామ్‌
అమరులైన ధీరులారా అందుకోండి లాల్‌సలామ్‌''
ఇలా ప్రతి థలో విప్లవ వ్యూహం ఎత్తుగడలు అవసరాలు ప్రజల సమస్యలు తీసుకొని వందలాది పాటలు ఎప్పటికప్పుడు రాసి పాడి ప్రదర్శించాడు గద్దర్‌.

2. 1977 -80 కేంద్రంలో జనతాపార్టీ అధికారంలోకి వచ్చాక:
1977లో బి.నర్సింగ్‌రావు ''మా భూమి'' సినిమా తీశారు. శంకరాభరణం, మా భూమి సినిమాలు రెండూ ఒకే కాలంలో విడుదలయ్యాయి. ఒకటి ప్రజా సాహిత్యాన్ని, ప్రజల సంగీతాన్ని ముందుకు తెచ్చింది. మరొకటి సాంప్రదాయక సంగీతాన్ని, సాహిత్యాన్ని ఎత్తిపట్టింది. మా భూమిలో నటించిన గద్దర్‌ ''బండెనక బండి గట్టి'' అనే పాటను పాడారు. చాలా మందికి సినిమా పాట ద్వారా గద్దర్‌ పరిచయం అయ్యారు. సినిమా మీడియా ప్రభావం, వ్యాప్తి అంత గొప్పది. తర్వాత రంగుల కల సినిమాలో ''భద్రం కొడుకో'', ''మదనాసుందరి'' పాటలు పాడారు. ''నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా'' నంది అవార్డు ప్రకటించారు. గద్దర్‌ నిరాకరించారు.

సినిమా మీడియాను వ్యాపార దినవార పత్రికలను విప్లవ సాహిత్య ప్రచురణ, ప్రచారం కోసం ఉపయోగించుకోకూడదని అవి పెట్టుబడి విష పత్రికలని కొందరు విప్లవ సాహితీ వేత్తలు చర్చలు చేశారు. వీటోలు, ఫత్వాలు జారీ చేశారు. దాంతో విప్లవ కళాకారులు, రచయితలు ఎన్నో అవకాశాలు కోల్పోయారు. అంతకు మించి ఎన్నో రెట్లు విప్లవ భావజాల ప్రచారం వ్యాప్తి కాకుండా నష్టం జరిగింది. అరసం, ప్రజానాట్యమండలి సంస్థల్లో 1950లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమించిన తర్వాత ఎవరి బతుకు వారు బతకమని పార్టీ చెప్పినప్పుడు ఎంతోమంది సినిమా రంగంలోకి వెళ్ళిపోయారు. వారంతా ఉద్యమానికి మిగలకుండా పోయారని అందుకని ఇప్పుడు విప్లవ సాహితీవేత్తలు, కళాకారులు ఆ మీడియాలోకి పోకూడదని ఆంక్షలు విధించారు. ఇది లెనిన్‌ అవగాహనకు భిన్నమైన ఆచరణ. అదే విషయం ఆ తర్వాత క్రమంలో ఆర్‌.నారాయణమూర్తి సినిమాను తీయటం వాటి ద్వారా అనేక పాటలు ఉద్యమాలు కళారూపాల ద్వారా రేడియోల్లో, టీవీల్లో, క్యాసెట్లలో ప్రచారం జరిగాయి. శ్రీశ్రీ ఒక సారి మాట్లాడుతూ డిఎమ్‌కె తమిళనాడులో అధికారంలోకి రావడానికి సినిమా మీడియానే ప్రధాన ప్రభావం వేసిందని చెప్పారు. ఆ మాటను కూడా పట్టించుకోలేకపోయారు.

అది అలా ఉంచుదాం. ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక వేలాది ఉద్యమకారులు జైళ్ళ నుండి విడులయ్యారు. అప్పుడు లభించిన స్వేచ్ఛలో అనేక ఉద్యమాలు ముందుకు సాగాయి. ప్రజలను సమీకరించటం కోసం గద్దర్‌ అనేక రంగాలకు సంబంధించిన పాటలు రాశారు. మచ్చుకు కొన్ని...
''వోలీ వోలీలరంగవోలి
చెమ్మకేలి
ఎవరీ పిల్లల్లమ్మ ఎన్నెలో ఎన్నల''
''సస్తే సావుజెయ్యి మనివుంటే గంజివొయి
రాన్రో కొడుకు సర్కార్‌ దవకానకు''
''ఏమికొనేటట్టులేదు ఏమితినేటట్టులేదు నాగులో నాగన్న
ధరలిట్ల పెరగబట్టె నాగులో నాగన్న''
''లాల్‌సలామ్‌ లాల్‌సలామ్‌
భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు
సాగే పోరులోన...''
''భారత దేశం భాగ్యసీమరా భావి పంటలకు లోటులేదురా
బంగరు పంటల భూములున్నవి''
''రండి రో కూలన్న సంఘం పెడదాము
సంగతేందో చూద్దాము''
''పాదాపాదాన పరిపరి దండాలు''
గ్యాంగొల్లమండి మేము బాబు
మేం గరీబోల్లమండి బాబు
రక్తంతో దారిపోసి రైలు పట్టాలేస్తాము''

3. 1981 -85 ఉద్యమం, సాహిత్యం, పాట:

1979-80లలో విప్లవోద్యమంలో లక్షలాది మంది సమీకరించబడ్డారు. ఉత్తర తెలంగాణ ఉద్యమాన్ని దండకారణ్య ఉద్యమంగా విస్తరించాలని ఉద్యమ నాయకత్వం భావించింది. ఆదిలాబాద్‌, మహారాష్ట్రలోని గఢ్‌చిరోలి తదితర ప్రాంతాల ఆదివాసీ గిరిజనులను సమీకరించాలని విప్లవ నాయకత్వం భావించింది. ఆ క్రమంలో రగల్‌ జెండా బ్యాలెతో పాటు అనేక పాటలను రాయడం జరిగింది. తరువాత నిర్భందం పెరుగుతూ రావడంతో గద్దర్‌ వాటికి సంబంధించిన పాటలు కూడా రాశారు. వాటిని ఇలా పేర్కొనవచ్చు.
''రగల్‌ జెండా బ్యాలె''
''మల్లిగాన్ని నేను దొర జీతగాన్ని నేను''
రేలరె రేలరె అడవి తల్లికి దండాలో
తల్లి అడవికి దండాలో... అడవి సల్లాగుంటె...
''నాసాకింద మీసాకింద నిన్ను జైళ్లో పెట్టినారు
నీకు నాకు తేడాలేదయో ఓ పోలీసన్న''

English summary
BS Ramulu, a prominent writer, explains the evolution of Gaddar and about his contribution to the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X