• search
• Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
For Daily Alerts

విప్లవోద్యమం, సాహిత్యం: గద్దర్‌ పార్ట్ - 4

By Pratap

Next »

« Previous

Gaddar

1985లో కారంచేడు దళితుల హత్యాకాండ - దళిత ఉద్యమం:

1985 జులైలో కారంచేడు హత్యాకాండ జరిగిన తర్వాత అందులో హతులైన దళిత వీరుల గురించి గద్దర్‌ పాటలు రాసి దళిత మహాసభ ఉద్యమంలో గొప్ప కాంట్రిబ్యూషన్‌ అందించారు. ''దళిత పులులమ్మ కారంచేడు భూసాముల కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ'' అనే పాట బాగా ప్రాచుర్యం పొందిన పాట.

అదే సమయంలో కొంచెం ముందు వెనుకగా కె.జి. సత్యమూర్తి తాను నాయకత్వం వహిస్తున్న పీపుల్స్‌వార్‌ పార్టీలో అగ్రకులాల ఆధిపత్యం బ్రాహ్మణీయ భావజాలం బలంగా కొనసాగుతూ దళితులపట్ల అణచివేతను, చిన్నచూపును కొనసాగిస్తున్నదని చర్చను ప్రారంభించాడు. సత్యమూర్తి గద్దర్‌ ఈ విషయాన్ని ఉత్తరంలో చర్చించాడు. గద్దర్‌ ఆ ఉత్తరాన్ని ఆధారం చేసుకొని పార్టీలో కులసమస్య, అంబేద్కరిజంను గురించిన చర్చను ప్రస్థావించి చర్చించాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ చర్చలో కులసమస్య చర్చను పక్కకు నెట్టి సత్యమూర్తిపై రకరకాల ఇతర కారణాలు చూపి బహిష్కరించారు. సత్యమూర్తివెంట ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటి రాలేదు. ఇతర రాష్ట్రాల కమిటీలు సత్యమూర్తిని సమర్ధించాయి.

17-7-85 నాడు జరిగిన కారంచేడు దుర్మార్గం పార్టీ అవగాహనకు కులనిర్మూలనా పోరాటాలు చేపట్టాలనే ఒక గొప్ప సంకేతాన్ని అందించింది. తర్వాత నీరుకొండ, బీహార్‌ దళితుల ఊచకోతలు, చుండూరు మారణకాండల వంటివెన్నో జరిగాయి. దళితవాదం, దళిత మహాసభ ముందుకు తెచ్చిన కుల సమస్యను అంబేద్కరిజం దృక్పథాన్ని కులసమస్య పరిష్కారానికి ఎంతో అవసరమని అనేక తాత్విక, సైద్ధాంతిక చర్చలు ముందుకు వచ్చాయి. వామపక్షవాదులు అంబేద్కర్‌ను, అంబేద్కరిజాన్ని చిన్నచూపు చూశారు. దళితులను కించపరిచినట్టుగానే అంబేద్కర్‌ను కించపరిచారు. అలా అంబేద్కరిజం మార్క్సిజం మధ్య పరస్పర సైద్ధాంతిక సహకారానికి, సయోద్యకు ప్రయత్నించిన వారిని కూడా విమర్శించారు.

అంబేద్కరిజం కేవలం అర్థశాస్రానికో, రిజర్వేషన్‌లకో, అస్తిత్వవాదానికో పరిమితం కాదు. మార్క్సిజం అర్థశాస్త్రంమీద ఆధారపడుతుంది. అంబేద్కరిజం మానవ సంబంధాలను, సామాజిక, వర్గాలను, కులాలను, ఉత్పత్తి సంబంధాలను, వాటి పరిణామాలను, మూలాలను ప్రాతిపదిక చేసుకుంటున్నాయి.

ప్రజాస్వామ్యం, బహుళపార్టీ వ్యవస్థ రాజ్యాంగ బద్ధంగా సామాజిక న్యాయం, సామాజిక మార్పు, స్వేచ్ఛా, సమానత్వం, సౌభాతృత్వం, ఆత్మగౌరవం, కరుణార్ధ, పరోపకారం, స్టేట్‌ సోషలిజం, బౌద్ధ ప్రాపంచిక దృక్పధంను ప్రాతిపదికగా చేసుకుంటుంది.

మార్క్సిజం ఉత్పత్తి సంబంధాలను, ఉత్పత్తి సాధనాలను, ఉత్పత్తి శక్తులను ప్రాతిపదికగా చేసుకొని ఉత్పత్తి పరాయీకరణ, రాజ్యం, ఏకపార్టీ ఆధిపత్య సోషలిజాన్ని ప్రాతిపదికగా చేసుకుంటుంది. అంబేద్కరిజం ప్రజాస్వామ్య వ్యవస్థలో సోషలిజాన్ని అభిలషిస్తుంది.

ఇలా అంబేద్కరిజం, మార్క్సిజంల రెంటి అర్థశాస్త్రం సామాజిక శాస్త్రం, పరిపాలనా శాస్త్రం లక్ష్యం, గమ్యం, మార్గం వేరు. వేటికవి ప్రత్యేకమైనవి. మార్క్సిజం సమగ్ర వాదమని భావిస్తూ కొందరు అంబేద్కరిజం తెచ్చిన నూతన అంశాలను అది కలుపుకోవాలని కోరడంలో వారు అమాయకత్వం, అధ్యయన లోపం కనపడుతుంది. మార్క్సిజంలో వర్గదృక్పధం ప్రధానం చేసి మాట్లాడుతుంటారు.

వర్గదృక్పధం ఎలా ఏర్పడిందో దాని గురించి మాట్లాడే చాలా మందికి తెలియదు. అందువలన మార్క్సిజం యొక్క మౌలిక ప్రాతిపదికలు వారికి అర్థం కావు. మార్క్సిజంలో ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి సంబంధాలు, శ్రమశక్తి, అదనపు మిగులు, దాని పంపిణీ, లాభోక్తులు, దాని ఆధిపత్యం, పరాయీకరణ, దోపిడి, రాజ్యం అనే మౌలికాంశాలు. వీటిలో మార్క్సిజం పరాయీకరణ, ఆధిపత్యం క్రమంలో ఉత్పత్తి సంబంధాల్లో పంపిణీననుసరించి వర్గాలు ఏర్పడతాయని భావిస్తుంది. భారతదేశంలో శూద్రులు, అతిశూద్రులు, ఆదివాసీలు, ఉత్పత్తి శక్తులు. ఉత్పత్తి సాధనాలు వారివే. ఉత్పత్తి సంబంధాలు ఎలా ఉండాలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ వాటిని సమర్థించే మనుధర్మం, బ్రాహ్మణీయ భావజాలం నిర్దేశిస్తుంది. అందువలన వర్గాలు ఎలా ఉండాలో నిర్ణయించేది కులవ్యవస్థ, వర్ణవ్యవస్థ, బ్రాహ్మణిజం. అగ్రవర్ణాలు, అగ్రకులాలు శతాబ్దాలుగా ఉత్పత్తిలో పాల్గొనకుండా ఉత్పత్తిని, అదనపు మిగులును, సామాజిక ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వచ్చారు.

కనుక కులం అనేది వర్గాలను కనిపెంచే వ్యవస్థ, సిద్ధాంతం, దృక్పధం, జీవన విధానం. ఇలా వర్గము, కులము, బ్రాహ్మనిజం అనేవి తల్లీకూతుళ్ళు. అందువల్ల ఉత్పత్తి సంబంధాలలో కులం, వర్ణం, కర్మ, పునర్‌జన్మ, మనుధర్మ సిద్ధాంతాలు నిర్వహించే పాత్ర గురించి మాట్లాడకుండా, విశ్లేషించకుండా ''కులం-వర్గం'' అనే సమాసాన్ని వాడే వారికి మార్క్సిజంలోగాని, అంబేద్కరిజంలోగానీ ఎబిసిడిలు తెలియవని చెప్పవచ్చు. ఇలా రెండు దృక్పధాల మౌలికాంశాలు తెలియకుండానే చాలా మంది బాగా తెలిసినట్లు మాట్లాడేస్తుంటారు.

ఇలా పదిరికుప్పం, నీరుకొండ, కారంచేడు, చీమకుర్తి, చుండూరు మారణ కాండల వంటివెన్నో జరిగాయి. అయితే ''జగిత్యాల జైత్రయాత్ర'', ''ఇంద్రవెల్లి'' దురంతాలు దండకారణ్య గెరిల్లా జోన్‌ లక్ష్యాన్ని ఉత్పత్తి చేసినట్టుగా ఈ కుల సమస్య తాలూకు దుర్మార్గాలేవీ విప్లవ పార్టీకి కొత్త లక్ష్యాల్ని, కార్యక్రమాల్ని ఎజెండాలోకి తీసుకురావడానికి పనికి రాకుండా పోయాయి.

అలాగే ఆధునిక సైన్స్‌ టెక్నాలజి తాలూకు మార్పులను విస్తరణను వామపక్షాలు అనుమానంగా చూస్తూ వీలైన మేరకు అడ్డగించడం వ్యతిరేకించడం చేశాయి. ఇప్పుడున్న వృత్తులు ప్రజలు కోల్పోతారని దానికి ఒక లాజిక్‌ను జతచేశారు. కాని ఒక విద్యుత్‌ను కనుక్కోవడం వల్ల ప్రపంచంలో కోట్లాది కొత్త వృత్తులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒక రేడియో, ఒక రైలు, ఒక బస్సు, బ్యాట్రి చాలక యంత్రం కనుక్కోవడం ద్వారా కోట్లాది కొత్త వృత్తులు అవకాశాలు పెరిగాయి. అలాగే సినిమా, టి.వి., రేడియో, కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సాఫ్ట్‌వేర్‌ ఆవిష్కరణలతో ప్రపంచం ఎంతగానో మారిపోయింది. ఆధునిక సైన్స్‌ టెక్నాలజి, ఆధునిక అభివృద్ధి క్రమాలు ఉత్పత్తి శక్తుల్లో, ఉత్పత్తి సాధనాల్లో, ఉత్పత్తి సంబంధాల్లో, అదనపు మిగులులో, శ్రమశక్తిలో అనేక పరిణామాలు సంభవిస్తాయి. మార్క్సిజం మౌళికంగా ఈ అంశాలమీదే నిర్మితమైంది. కాని వామపక్షాలు ఇది మరిచిపోయి వీలైనప్పుడుల్లా ఆధునిక సైన్స్‌ టెక్నాలజీని వ్యతిరేకిస్తూ వచ్చారు. 1980ల్లో కంప్యూటరైజేషన్‌ ఆలోచన వచ్చినప్పుడు బ్యాంకులు, రైల్వేలు, ఇన్స్‌రెన్స్‌ తదితర రంగాల్లో ఉద్యోగ సంఘాలత ద్వారా తీవ్రంగా వ్యతిరేకించారు. తద్వారా కంప్యూటరీకరణ రెండు థాబ్ధాలకుపైగా వాయిదా పడింది. చివరకు దాన్ని అనుసరించక తప్పలేదు. ఇంట్లో ఫ్యాన్‌, టి.వి. సొంత ఇల్లు కలిగి యుండటం కూడా ఒక నేరంగా భావించబడే స్థితికి ప్రజలు నెట్టివేయబడ్డారు. పేదరికాన్ని నిర్మూలించడం వేరు. పేదరికాన్ని ప్రేమించడం వేరు. పేద ప్రజలను ప్రేమించే పేరిట పేదరికాన్ని ప్రేమించటం ఒక అలవాటుగా మార్చారు. అలా ఉద్యమంలోకి వచ్చిన లక్షలాది మంది పేదరికాన్ని ప్రేమిస్తూ అభివృద్ధిని, సంపద కూడగట్టడాన్ని, ఆధునిక విద్య అందుకోవడాన్ని వ్యతిరేకించారు. అలా ఉద్యమ ప్రాంతాల్లో ఉద్యమ ప్రభావానికి గురైన ప్రజలు కోల్పోయింది లెక్కలకు అందదు.

గద్దర్‌ కూడా అదే భావజాలంలో కొనసాగారు. ''టైప్‌రైటర్‌ నుంచి కంప్యూటర్‌ అభివృద్ధే. కాదనను. కాని ఇవాళ కంప్యూటర్‌ను అభివృద్ధి పరచని వేలాది మంది శ్రమజీవులకు తోడ్పడడకుండా, వాళ్ళను నిరుద్యోగులుగా మార్చివేసి కొందరికి కోట్లు కూడబెట్టే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నాను. దాన్ని అసలే ఉపయోగించగూడదా అంటే, ఉపయోగించవచ్చును. ఏదైనా మనిషికి అసాధ్యమైతే, ఉదాహరణకు మనిషికి అంతుచిక్కని రోగాలను నిర్ధారణ చేసేందుకు ఉపయోగించవచ్చు. కాని గుమస్తా పనుల కోసం కంప్యూటర్‌ ఎందుకు? దానిలో పెట్టుబడిదారుల ఉద్దేశ్యం ఏమిటి? ఈ పద్ధతిని నేను వ్యతిరేకిస్తాను. అందుకే ఇవాళ్టి పరిస్థితుల్లో మన దేశంలో కంప్యూటరైజేషన్‌ను నేను వ్యతిరేకిస్తున్నాను. అత్యధిక సంఖ్యాక ప్రజలకు ప్రయోజన కరం కానిది ఏదయినా, ఎంత అభివృద్ధి అని పేరు పెట్టుకున్నా ఆయా పరిస్థితుల్లో వ్యతిరేకించవలసిందే. అంటే అభివృద్ధి అనే దాని మీద మనకు సరైన అవగాహన ఉండాలి.'' (ప్రజా సంగీతం - పట్టించుకోవలసిన సంగతులు వ్యాసం నుండి) పై అవగాహన మార్క్సిజానికి భిన్నమైనది. లెనిన్‌ అవగాహనకు భిన్నమైనది. ఉత్పత్తి సాధనాలు అనుసరించి ఉత్పత్తి సంబంధాలు రాజ్యం, అదనపు మిగులు ఏర్పడుతుంటాయి. ఉత్పత్తి సాధనాల అభివృద్ధిని విస్తరణను వ్యతిరేకిస్తే ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి సాధనాలు ఎలా ఉన్నాయో అలాగే కొనసాగుతూ వుంటాయి. ఇప్పటికి వ్యవసాయిక సమాజంలో వ్యవసాయిక గ్రామీణ కులపూరిత మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు కొనసాగుతున్నట్టుగానే ఉంటాయి.

కానీ చరిత్ర ఏమిచెబుతున్నది? ఈ సైన్స్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌, ఇంటర్నేట్‌ సృష్టించిన పరిణామాలు కోట్లాది మందికి ఉపాధి కల్పించాయి. ఎన్నో కొత్తరంగాలు ఎదుగుతూ వచ్చాయి. నేటితరం ఈ రంగాలు అభివృద్ధి చెందకపోయివుంటే ఏం పనిచేసి ఉండేవారు? ఇవి రాకముందు టీచర్‌, పోలీస్‌, రెవిన్యూ, రైల్వే, ఆర్‌టిసి, సింగరేణి వంటి శాఖల ఉద్యోగాలు తప్ప ఏం ఉన్నాయని? ఇవాళ అన్ని రంగాల్లో కొత్త అవకాశాలు పెరగడానికి జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ టెక్నాలజీ విస్తరణనే ఉపయోగపడింది. దీన్ని వామపక్షాలు ఆహ్వానించకపోవడం వల్ల దాని అనుచరులుగా నడుస్తున్నారేతప్ప సమాజాన్ని మార్గదర్శం చేసి ముందుకు నడిపే చూపును లక్ష్యాలను కోల్పోయారు. అందువల్ల వారి కార్యక్రమాలు, వ్యూహం, ఎత్తుగడలు, ఉద్యమాలు అన్ని ఇలా సమాజానికి సామాజికాభివృద్ధికి వెనుకబడిపోయి, వెనుకబడిన సమాజంలోనే జీవించడానికి నెట్టివేయడానికి పరిమితమవుతూ వస్తున్నాయి. ఇలా వామపక్ష ఉద్యమాలు దళిత సమస్య, కుల సమస్య, స్త్రీ సమస్య ఆధునిక విద్య అందుకోవాల్సిన ఆవశ్యకత, ఆధునిక సైన్స్‌ టెక్నాలజీలో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత మొదలైనవన్ని వదిలివేసి పాత ఆలోచనలకు, ఆచరణలకు కుదించుకపోతూ వెనుకబడుతూ వస్తున్నాయి.

అయితే గద్దర్‌ ప్రజల్లో కలిసి పనిచేస్తున్న క్రమంలో కళాకారుడిగా ప్రజల వెంటవుంటూ తనలోతాను అంతర్‌మదనానికి లోనయ్యారు. అన్ని రంగాల్లో అగ్రకుల నాయకత్వం కొనసాగుతున్నదని దాన్ని బందుపెట్టాలని దళితులు న్యాయకత్వ స్థాయిని సాధించాలని భావించారు. ''అదంతా మాటలతో జరిగేది కాదు దళిత మేధావులు కింది స్థాయి జనంతో పనిచేసే ప్రకమంలోనే ఈ పని చెయ్యగలుగుతారు. గ్లోబలైజేషన్‌ పెరిగే కొద్ది విజువల్‌ మీడియా అభివృద్ధిచెందుతూనే వుంటుంది. అందులో సినిమాలు చాలా ముఖ్యమైన పాత్ర... కోట్లాది రూపాయల పెట్టుబడి వందలమంది టెక్సీషియన్లూ వుండే సినిమా విప్లవపాట దెబ్బకు దాసోహమంటున్నదంటే అది నా రాజకీయాల విజయమే'' అని గద్దర్‌ టెక్నాలజీ ప్రక్రియలు సైద్ధాంతిక భావాజాలానికి ప్రభావితమయ్యే క్రమాన్ని తనకు తానే చెప్పారు. అనగా అంతకు ముందున్న అభిప్రాయాలు పొరపాటు అని తేలిపోయింది.

Next »

« Previous

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BS Ramulu, a prominent writer, explains the evolution of Gaddar and about his contribution to the society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more