• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్విక్ బాక్సింగ్: ఓల్డ్ డెవిల్స్- న్యూ విలన్స్

By Pratap
|

విలన్‌లంటే ఎవరు? ఎక్కడుంటారు? విలన్‌లంటే యహ్హహ్హ అని నవ్వేవాళ్లు, మీసాల్నూ పిల్లుల్నూ దువ్వే వాళ్లు, హీరోయిన్లని యేడిపించే వాళ్లు, హీరోల తల్లుల్ని కట్టేసే వాళ్లూ అయితే కావచ్చు. ఇంతేకాక యింకెన్నో బీభత్సాలు, ఛండాలప్పనులు దరిద్రపు గొట్టు ఆలోచన్లు చేసే వాళ్లు అయితే అవచ్చు. ఇలాంటి విలన్లు ఎక్కడుంటారు? అనగానగా కథల్లో వుంటారు. కథలు చదివే టైమెక్కడుంది అని ఫైరవ్వద్దు, అస్సలు చదవద్దు. పనిలేని వాళ్లు పగళ్లూ.. రాత్రిళ్లూ, పనివున్న వాళ్లు రాత్రిళ్లు మాత్రమే చూసేడ్చే సీరియళ్లల్లో వుంటారు చూడండి.

మహారాజా! మీ వాడికి చదువు చెప్పడం మా వల్ల కాదు అన్నాడు పంతులు భయం బయంగా.. నిజంగా భయపడుతూ.

ఏం? ఎందుకు? హుంకారించాడు.. చదువుకోవడం లేని వాడి తండ్రి.

Quick Boxing: Old devils, new villains

కాళ్ల మీద పడుతుంది కదాని కడుపు చించుకోవడం లేదు కానీ, రాజాధి రాజా మీ ముద్దు బిడ్డ ఒకటే పనిగా గ్రూప్ సాంగ్స్, భజన పాటలు పాడుతూ, మిగతా వాళ్ల చేత పాడిస్తూ.. డ్యాన్సులు ఆడిస్తూ, స్కూల్‌ని నాశనం చేస్తున్నాడు అన్నాడు పంతులు.

ఐసీ! అలాగా వీడి సంగతి నేన్చూస్తా. మీరు వెళ్లచ్చు అన్నాడు తండ్రి. పరారయ్యేడు పంతులు.

ఏరా! ఒళ్లు ఎలావుంది? ఆ సాంగ్సూ, ఆ భజన్సూ ఏమిట్రా? వురిమాడు తండ్రి. ఆ తండ్రి, తండ్రే కాదు బాగా పాపులరయిన ఒక విలన్ కూడా.

డాడ్! నాకు ఒన్ ఎండ్ ఓన్లీ గాడయిన నా గాడ్‌ని ప్రార్థిస్తున్నా. మీరూ ప్రార్థించండి అన్నాడు సన్.

షటప్! ఆ గాడ్ సంగతి నా ముందు ఎత్తవద్దని ఎన్ని సార్లు చెప్పాను?

గుర్తు లేదు డాడ్! నా మాట వినండి. ఆ గాడ్ ఒక్కడే ఈ గ్లోబ్‌కి దేముడు.

ఒన్ ఎండ్ ఓన్లీ దేముడు. ఆయనే ఈ లోకానికి పవర్ స్టార్, సూపర్ స్టార్, రియల్ స్టార్, మెగాస్టార్ కూడా!

ఎవడ్రా అక్కడ? వీణ్ని లాక్కెళ్లి కొండల మించి కిందకి తోసేయండి.

మళ్లీ వచ్చావా.. చావ లేదురా నువ్వు అన్నాడు తండ్రి.

విలన్‌లు యేంచేసినా హీరోలు చావరు తండ్రీ! మా హీరో పవర్ స్టారే నన్ను కిందపడకుండా పట్టుకున్నాడు.

ఎవడ్రా అక్కడ? వీణ్ని లాక్కెళ్లి డిస్పోజబుల్ గ్లాసు నిండా విషం తాగించి చంపెయ్యండి.

మళ్లీ వచ్చావా.. చావలేదురా నువ్వు అన్నాడు తండ్రి.

హీరోలకి చావులేదు తండ్రీ.. మా హీరో సూపర్ స్టారే నన్ను సేవ్ చేశాడు.

ఎవడ్రా అక్కడ వీణ్ని లాక్కెళ్లి పాములతో కరిపించండి.

మళ్లీ వచ్చావా.. చావలేదురా నువ్వు అన్నాడు తండ్రి.

హీరోలకి చావురాదు తండ్రీ.. మా హీరో రియల్ స్టారే నన్ను రిస్కులోంచి బయట పడేశాడు.

ఎవడ్రా అక్కడ? వీణ్ని లాక్కెళ్లి ఏనుగులతో తొక్కించండి.

మళ్లీ వచ్చావా.. చావలేదురా నువ్వు అన్నాడు తండ్రి.

విలన్లు యేంచేసినా హీరోలు చావరు తండ్రీ. మా హీరో మెగాస్టారే నన్ను ఏనుగు లెగ్ కింద నుంచి సేఫ్‌గా పక్కకు తెచ్చాడు.

కొండల మీంచి తోసెయ్యడం, విషం తాగించడం, పాముతో కరిపించడం, ఏనుగుల్తో తొక్కించడం అనే విలనిజమ్ ఈ నాటిది కాదు. ఆ విలన్ ఎవరో చెప్పాల్సింది లేదు.

ఎల్ఈడీల్లో, ఎల్‌సిడీల్లో, ప్లాస్మాల్లో విలన్లు కొత్తగా కనిపిస్తారు కానీ, వాళ్ల బుర్రల్లో ఆలోచన్లు పాతవేనని చూసే వాళ్లు బుర్ర కొంచెం గోక్కుంటే అర్థం అవకపోదు. విలన్ ఎవరినయినా చంపాలనుకుంటే కొండ మీదకి తీసుకువెళ్లి తోసెయ్యడం, వంటింట్లో పని మనిషి చేత పాల గ్లాసులో సీసాడు విషం పోయించడం, పాముల వాడి చేత గదిలోకి పామును వదిలేయించడం, ఏనుగులు జూలో సెటిలయినయి కనుక ఏనుగుల్లాంటి లారీలతో తొక్కించడం యిదే ఈ నాటికీ విలనిజమే.

ఏ సీరియలైతేనేం.. ఏ విలనయితేనేం మన పాత కథలో విలన్‌ని కాపీ కొట్టక తప్పదు కదా! లేడీ విలన్ అయితే ఛానళ్ల రేటింగ్ పెరుగును కదా!

- చింతపట్ల సుదర్శన్

English summary

 An eminent columnist Chitanpatla Sudarshan in column quick Boxing has written about old devils and new villians.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X