నేడే వరూధిని ఏకాదశి- విష్ణు సహస్రనామాలను పఠించినా చాలు
హిందూ సంప్రదాయంలో, విష్ణువును ఆరాధించడానికి ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. 24 ఏకాదశులలో వరుథినీ ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వైష్ణవ సంప్రదాయాలను అనుసరించే వారు, విష్ణు భక్తులు ఈ ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తూ, భక్తి శ్రద్ధలతో శ్రీమన్నాయణుడిని పూజిస్తారు. ఫలితంగా ఆ దేవదేవుడి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు. శేషశయనుడి కృపకు పాత్రులవుతామని భావిస్తారు.
సర్వ పాపహరణం..
జీవితంలో సర్వపాపాలూ తొలగిపోతాయని, దోష నివారణ జరుగుతుందని, అన్ని ప్రతికూల శక్తులు నాశనమౌతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. వరుథినీ ఏకాదశి నాడు భక్తులు కఠిన ఉపవాసం ఆచరించి, విష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు. ఈ పవిత్రమైన రోజున వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపవాసం, స్వీయ నియంత్రణ, ఆధ్యాత్మిక శుద్ధికి ఈ తేదీ ఎంతో ప్రశస్తమైనదిగా భావిస్తారు.

విష్ణు సహస్రనామాలను పఠించడం..
ధ్యానం చేయడానికి, విష్ణువుకు ప్రార్థనలు చేయడానికి, విష్ణు సహస్రనామానాలను పఠించడానికి ఇది ఎంతో శక్తివంతమైన రోజు. ఏకాదశి వ్రతం శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఈ రోజు కేవలం భోజనం మానడం మాత్రమే కాదు, అనేక విషయాల్లో సమతుల్యతను కొనసాగించడం ముఖ్యం. అంటే ఇంద్రియాలపై నియంత్రణ సాధించడం అనే పాఠాన్ని నేర్పుతుందీ ఉపవాసం. గత కర్మలు, పాపాలు, పాపకర్మ భారాలను తొలగించేంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు.
శుభ ముహూర్తాలు ఇవే..
వరుథినీ ఏకాదశి తేదీ ఈ అర్ధరాత్రి 1:06 నిమిషాలకు ఆరంభమైంది. మంగళవారం అర్ధరాత్రి 1:08 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఏకాదశి అమృత ఘడియలు ఈ తెల్లవారు జామున ప్రారంభం అయ్యాయి. శుభ ముహూర్త సమయం ఈ ఉదయం 9:10 నుండి 10:46 నిమిషాల వరకు ఉంటుంది. మంగళవారం తెల్లవారు జామున 6:54 నుండి 8:31 వరకు పారణ సమయం ఉంటుంది. అంటే ఉపవాస దీక్షను విరమించే సమయం ఇది. మంగళవారం తెల్లవారు జామున 6:54 నిమిషాలకు పారణ హరివాసర సమయం ఉంటుంది.
పూజా విధానం ఇలా..
వరుథినీ ఏకాదశి వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని, ముఖ్యంగా పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. పవిత్ర స్నానం ఆచరించిన అనంతరం, పూజా స్థలంలో విష్ణువు, కృష్ణుడు లేదా బాల గోపాలుని విగ్రహాన్ని లేదా పటాన్ని ప్రతిష్టించి, అభిషేకం చేయాలి. విగ్రహాలను అందమైన వస్త్రాలు, పూలమాలలతో అలంకరించాలి. విగ్రహానికి లేదా చిత్రపటానికి తిలకం దిద్ది, నెయ్యి దీపం వెలిగించాలి. విష్ణు మంత్రాలను పఠిస్తూ భగవంతుడిని ఆవాహన చేయాలి. సాయంత్రం కూడా విష్ణువుకు ప్రార్థనలు చేసి, హారతి ఇవ్వాలి.
9 వత్తుల దీపం..
ఏకాదశి రాత్రి ఇంటిలోని ప్రార్థనా మందిరంలో శ్రీనారాయణుడి ముందు 9 వత్తుల దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం రాత్రంతా వెలిగేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థికాభివృద్ధి, లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, సంపద ఇంట్లో స్థిరంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. చివరగా మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి, పారణ ముహూర్త సమయంలో ఉపవాసాన్ని ముగించాలి.












Click it and Unblock the Notifications