వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలే పోలీసు ఆపై పోటా

By Staff
|
Google Oneindia TeluguNews

కేవలం ప్రచార హోరు ఉంటే చాలు. ఎన్ని తప్పులు చేసినా ఆ హోరులో కలిసి కనుమరుగవుతాయని విశ్వసించే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నాయకత్వం ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సాహసం చేసి వైద్యవిద్యను ప్రైవేట్‌పరం చేయాలని సంకల్పించింది. తాజాగా ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వు (జి.వో. ఎంఎస్‌. నెం.90) ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలన్నీ డెవలప్‌మెంట్‌ సొసైటీల పరం అవుతాయి. ఆ సొసైటీలు యూజర్‌ చార్జీల పేరుతో ప్రజల నుంచి సొమ్ము పిండుతాయి. అంటే గత 53 యేళ్లుగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత వైద్య చికిత్సకు తెరపడిందన్నమాటే. ఆ ఉచిత చికిత్స నాణ్యత మాటెలా ఉన్నా ఏ రోజుకారోజు సంపాదించి బతికే సామాన్యులు లక్షలు, కోట్ల సంఖ్యలో ఉన్న ఈ రాష్ట్రంలో పేదవారికి కనీస వైద్యసౌకర్యాలు ఉండవు. ఇది కాక ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇవ్వడం, ఆ కాలేజీలలో సీట్ల సంఖ్యను పెంచడం, సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ స్కీమ్‌ల ద్వారా కొంత శాతం సీట్లు భర్తీ చేసుకునే వీలును ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు కల్పించడం వగైరాలన్నీ మన ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసింది.

వీటన్నిటి మీదా రాష్ట్రంలోని పది వైద్య కళాశాలలకు చెందిన సుమారు 11,000 మంది జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగారు. వారి సమ్మె 25 రోజులు దాటి అరెస్టుల పర్వానికి చేరినా ప్రభుత్వం మొండివైఖరితోనే వ్యవహరించడం గమనార్హం.

ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలలో వైద్య విద్య స్థాయి ఎలా వుంటుందో పొరుగు రాష్ట్రం కర్ణాటకను చూసి మనం తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో చాలామంది డాక్టర్లు తమ డిగ్రీల పక్కన యూనివర్శిటీ పేర్లు కూడా బ్రాకెట్లలో వేయడం ప్రారంభించారు. బహుశా తమను ఎక్కడ కర్ణాటక డాక్టర్లని ప్రజలు అనుకుంటారోనని వారు అలా చేస్తూ ఉండవచ్చు. డబ్బిచ్చి పొరుగు రాష్ట్రాలలో సీట్లు కొనుక్కొని డాక్టర్లై రాష్ట్రంలో పెద్ద పెద్ద భవంతులు అద్దెకు తీసుకొని ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ పెట్టే డాక్టర్లు ఎందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారో మనకు అనుభవమే. అది చాలదన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 17 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ కాలేజీలలో విద్యాబోధన ఎంతెంత మాత్రంగా వుంటుందో ఇటీవల బహిర్గతమైన స్కామ్‌ వెల్లడి చేస్తుంది. హైదరాబాద్‌ నగరంలోని ఒక ప్రైవేట్‌ వైద్య కళాశాల తనిఖీకి వచ్చిన అధికారుల కళ్లు కప్పేందుకు ఏకంగా సినిమా సెట్టింగే వేసింది! నకిలీ డాక్టర్లను, నర్సులను ఆఖరికి పేషంట్లను కూడా డబ్బిచ్చి రోజు కూలీకి తీసుకొచ్చారు. దీని మీద ప్రభుత్వం ఏమీ మాట్లడకపోవడం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వం మెడికోల సమ్మెను తీవ్రంగా గర్హిస్తూ వస్తోంది. మేము ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇస్తే వాళ్లకు (మెడికోలకు) ఏమిటట నొప్పి అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. వైద్యశాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. రాష్ట్రంలో వైద్యుల కొరత ఉందని, జిల్లాలలో చాలా డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన గణాంక వివరాలు అందిస్తూ అన్నారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్ల సంఘం గణాంకాలు తప్పని చెబుతోంది. నిరుద్యోగులైన డాక్టర్లు చాలా మంది రాష్ట్రంలో ఉండగా పోస్టులు భర్తీ చేయకపోవటం ప్రభుత్వం తప్పేనని సంఘం విమర్శ. కాగా ప్రభుత్వం కాస్త దిగివచ్చి ప్రైవేట్‌ కాలేజీలలో సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ స్కీమ్‌ కింద ప్రైవేట్‌ యాజమాన్యాలు భర్తీ చేసుకునే సీట్ల సంఖ్యను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. అయితే ఈ సీట్ల సంఖ్య 1 శాతం కూడా ఉండకూడదని జూనియర్‌ డాక్టర్లు అంటున్నారు. ఒక ఎద్దుకు రెండు వైపులా అట్టలు కట్టి నేనూ 30 లక్షలు కట్టగలను. నాకూ మెడికల్‌ సీటివ్వండి అనే నినాదాన్ని రాసి యూనివర్శిటీ ప్రాంగణంలో తిప్పారు. ఈ ప్రచారం ఎంతో సముచితంగా ఉంది.

కాగా సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లతో సంప్రదింపులు జరిపి సమస్యను ఒక కొలిక్కి తెచ్చేందుకు బదులు రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను ఛేదించడానికి దమనచర్యలు చేపట్టింది. జూనియర్‌ డాక్టర్లకు ప్రభుత్వం నుంచి హెచ్చరికలు పెరిగాయి. వాళ్ల సమ్మెను ప్రభుత్వం అణచివేయగలదు, ప్రజాభిప్రాయం తమకు అనుకూలంగా ఉన్నదని ప్రచారం చేసుకోగలదు. కానీ అసలు ప్రజాభిప్రాయాన్ని మాత్రం మార్చలేదు. బహుశా అది ముందస్తు ఎన్నికల్లో ప్రతిఫలించవచ్చు.
-కె. నవీన్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X