వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారు కొలికి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌), కాంగ్రెస్‌లకు మధ్య సయోధ్య కుదిరినట్లే కుదిరి ఎందుకు బెడిసికొడుతోంది? టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు కాంగ్రెస్‌ పట్ల కొన్నిసార్లు మెతకవైఖరిని, మరికొన్ని సార్లు కఠినవైఖరి ఎందుకు అవలంభిస్తూ ప్రకటనలు చేస్తున్నారు? ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వివాదం ఏమిటి? ఇది పార్టీల మధ్య వివాదమేనా, కనిపించని కారణాలేమైనా ఉన్నాయా?

చంద్రశేఖర్‌ రావు మాటలు కాంగ్రెస్‌పై అప్పుడప్పుడు నిప్పుపై ఉప్పు పడినట్లు చిటపటలాడడానికి కనిపించని కారణాలే ఎక్కువంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖరారు చేసుకునే విషయంలో సందిగ్ధతను ఎదుర్కుంటున్నారు. ఈ సందిగ్ధత పార్టీలో వ్యక్తమవుతున్న అభిప్రాయాల కారణంగా చోటు చేసుకున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును రాష్ట్రంలో ఓడించడానికి కాంగ్రెస్‌తో చెలిమి తప్పదనే విషయం ఆయనకు తెలుసు. అందుకే ఆయన కాంగ్రెస్‌తో స్నేహానికి ముందుకు వచ్చారు. ఇదే భావనతో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కూడా టిఆర్‌ఎస్‌తో చెలిమినే కోరుతున్నారు. పైగా టిఆర్‌ఎస్‌ పట్ల తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరమ్‌ (సిఎఫ్‌టి) నాయకులు చాలా మెతకవైఖరి అవలంభిస్తున్నారు. కెసిఆర్‌ మాటలకు వారు రెచ్చిపోకుండా సంయమనంతో సమాధానాలు ఇస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజాహిత బస్సు యాత్రను ప్రజలే అడ్డుకుంటారని కెసిఆర్‌ ఘాటైన ప్రకటన చేశారు. నిజానికి కాంగ్రెస్‌ అందిస్తున్న స్నేహహస్తం ఆ విధమైన ప్రకటన చేయడానికి కెసిఆర్‌ను ఉసిగొల్పడం వెనక పెద్ద కథే ఉందంటున్నారు. కాంగ్రెస్‌ను విశ్వసించడానికి వీలు లేదనే వాదన టిఆర్‌ఎస్‌లోని ఒక వర్గం నుంచే కాకుండా తెలంగాణ మేధావుల్లోని ఒక వర్గం నుంచి కూడా బలంగా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణకు కాంగ్రెస్‌ అంతర్గత శత్రువు అని, తెలుగుదేశం బాహ్య శత్రువని కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్న వర్గం వాదిస్తోంది. అంతర్గత శత్రువును ఎదుర్కోవడం కన్నా బాహ్య శత్రువును ఎదుర్కోవడం సులభమని, తెలుగుదేశం పార్టీని ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌తో జత కట్టడం సరికాదని అంటున్నారు. అయితే కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకోవడానికి కెసిఆర్‌కు పూర్తి సంసిద్ధంగా లేరు. ఎన్నికలకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ సాధనకు ముడిపెట్టి కెసిఆర్‌ చేసిన తప్పు ఫలితాన్ని ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోతే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎక్కువ సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. తెలంగాణలో గెలిచిన సీట్ల ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కెసిఆర్‌ రాజకీయ జీవితం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది. తెలంగాణ పట్ల ఆయన నిజాయితీ తీవ్ర విమర్శలకు, అనుమానాలకు గురువుతుంది. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ పెట్టి ప్రతిపక్షాల ఓట్లను చీల్చారనే అపవాదు ఆయన భరించాల్సి వస్తుంది. ఇదే గనుక జరిగితే టిఆర్‌ఎస్‌ భవితవ్యమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సాగుతున్న ప్రజాస్వామిక రాజకీయ ఉద్యమం నీరుగారిపోతుంది. ఇప్పటికే కెసిఆర్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏజెంటు అనే అనుమానాలను చవి చూస్తున్నారు.

మొత్తం మీద చంద్రశేఖర్‌ రావు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. కాంగ్రెస్‌తో పొత్తు ఇదివరకే దాదాపుగా ఖాయమైనప్పటికీ ఆయన ఇంకా నిర్ణయం జరగలేదని అంటూ వస్తున్నారు. ఈ విషయంలో టిఆర్‌ఎస్‌తో పొత్తు కోసం తెలంగాణ కాంగ్రెస్‌ ఫోరమ్‌ నాయకులు తీవ్రంగా కృషి చేయడమే కాకుండా కాంగ్రెస్‌లో అంతర్గత పోరాటం కూడా చేస్తున్నారు. టిఆర్‌ఎస్‌తో పొత్తును చెడగొట్టాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే అనుమానం వారికి ఉంది. ఆ అనుమానంతోనే వారు రాజశేఖర్‌ రెడ్డిపై బహిరంగ విమర్శలకు కూడా పూనుకుంటున్నారు. కాంగ్రెస్‌ను వదులుకునే విషయంలో తప్ప తెలంగాణ అంశాల విషయంలో సిఎఫ్‌టి నేతలు ఇప్పటి వరకు సరైన మార్గంలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరాల్సిందేనని, తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును డిమాండ్‌ చేస్తున్నామని, అందుకు కట్టుబడి ఉన్నామని సిఎఫ్‌టి నాయకులు తెలంగాణలో ప్రజాహిత బస్సు యాత్ర ప్రారంభం కావడానికి ముందు రోజు ప్రకటించారు. పిసిసి నేతల నుంచి టిఆర్‌ఎస్‌పై ఈగ వాలినివ్వకుండా వారు జాగ్రత్త పడుతున్నారు.

ఈ స్థితిలో చంద్రశేఖర్‌ రావు కత్తి మీద సాము చేస్తున్నారు. అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం కూడా దగ్గరపడుతోంది. అయితే ఇది కేవలం కెసిఆర్‌ సమస్యనో, కాంగ్రెస్‌ సమస్యనో కాదు. మొత్తం తెలంగాణ ప్రజల సమస్య. మరోసారి మోసపోమనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో నాటుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈ రెండు పార్టీలు వేసే అడుగు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకుంటే అనుభవించేది ఆ పార్టీలు కాదు, తెలంగాణ ప్రజలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X