వజ్రాలగని ఆంధ్రావని
హైదరాబాద్‌ః అంగళ్ళ రతనాలు అమ్మినారట అచట..... అంటూ ఆంధ్రదేశ సౌభాగ్య సంపద గురించి ఘంటసాల గొంతునుంచి జాలువారే పాటవిని పులకరించను తెలుగువారు వుండరు. ఇది కేవలం కవి కల్పితం కాదు అక్షర సత్యం అంటున్నారు జియాలజిస్టులు. భారతదేశానికి ఘనకీర్తి తెచ్చిపెట్టిన అద్భుతమైన వజ్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచే ముఖ్యంగా రాయలసీమ గనుల నుంచి వెలికితీసినవే అని పరిశోధకులు ఘంటాపధంగా చెబుతున్నారు.
గోల్కొండ రాజ్యంలో భాగమైన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా గనుల నుంచి పలు ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలను తవ్వితీశారు. ప్రపంచ ఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం, గ్రేట్ మొఘల్, పిట్, ఓర్లాఫ్, హోప్, నిజామ్, అక్బర్ షా, దరియా - ఎ - నూర్ తదితర వజ్రాలను ఈ గనుల నుంచే వెలికితీశారని పరిశోధకులు చెబుతున్నారు. 16 నుంచి 19వ శతాబ్దం వరకు జరిపిన తవ్వకాల్లో ఈ అమూల్యమైన వజ్రాలు బయటపడ్డాయి. అయితే అత్యంత విలువైన ఈ వజ్రాలన్నీ ఇప్పుడు పరుల సొమ్ము అయ్యాయి. కోహినూరు వజ్రం బ్రిటన్ రాణి కిరీటంలో చేరింది. మొఘల్ వజ్రం జాడే తెలియడం లేదు.
పిట్ వజ్రం పారిస్ లోని అపోలో గ్యాలరీలో వుంది. ఓర్లాఫ్ రష్యాలో, హోప్ అమెరికాలో వున్నాయి. అమూల్యమైన భారతీయ వజ్రసంపద ఇలా పరాయి దేశాలపాలు కావడం నిజంగా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ లోని ఈ నాలుగు జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్ లోని పన్నా ప్రాంతం అమూల్యమైన వజ్రాలకు నిలయంగా వున్నదని పరిశోధకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొల్లూరు, గొల్లపల్లి, బనగానపల్లి తదితర గ్రామాల్లో వజ్రాల గనులుండేవని ప్రతీతి. దశాబ్దాల కాలంగా వజ్రాలవేటను నిలిపివేసిన ప్రభుత్వం ఇటీవలే మళ్ళీ ఆ అంశంపై కన్నేసింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు... కృష్ణా జిల్లాలోని గనుల్లో తవ్వకాలు జరిపే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఎనిమిది అంతర్జాతీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది.
అమూల్యమైన వజ్రాల సంపదను తవ్వితీయాలనేది సత్సంకల్పమే. అయితే గతంలో మాదిరిగా రాజుల సొమ్ము రాళ్ళ పాలయినట్లు వజ్రాలు పరాయి వాళ్ళ చేతుల్లోకు పోకుండా చూసుకోవడం కూడా ప్రభుత్వాల కర్తవ్యం.












Click it and Unblock the Notifications
