వాళ్లు నిజంగా దేవుళ్లే!!!
వాళ్ల స్పర్శ్ నిజంగా దేవుని స్పర్శగా చెప్పవచ్చు. వైద్యో నారాయణో హరి అని పెద్దలు ఊరికే అనలేదని బెంగుళూరుకు చెందిన స్పర్శ్ ఆసుపత్రి డాక్టర్లు నిరూపించారు. తెలియకుండా కిడ్నీలు అమ్ముకోవడం, చనిపోయినా బ్రతికున్నాడనే భ్రమ కలిగించి డబ్బులు లాగే డాక్టర్లూ ఉన్న నేటి కాలంలో స్పర్శ్ డాక్టర్లూ తాము అలాంటి వాళ్లం కాదని నిరూపించారు. తాము తలుచుకుంటే ఎలాంటి ఆపరేషన్ అయినా చేయగలమని నిరూపించారు. రెండేళ్ల చిన్నారి లక్ష్మికి కొత్త జీవితాన్ని అందించారు.
ఆక్టోపస్ లా ఉన్నశరీరంతో పుట్టిన లక్ష్మి పుట్టగానే చనిపోవాల్సింది కానీ వైద్యానికే ఛాలెంజ్ విసిరేలా బ్రతికింది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. నిజానికి లక్ష్మిని చూసిన వారు ధైర్యం చేయలేరు. కానీ స్పర్శ్ డాక్టర్లు మాత్రం ఆ ధైర్యం చేశారు. విజయం సాధించారు. అసలే అమ్మాయి. అడ్డదిడ్డమైన శరీర భాగాలతో పుట్టిన లక్ష్మికి జీవితంలో కొత్తదనాన్ని అందించారు. లేకుంటే ఆమె జీవితాన్ని ఎలా కొనసాగించేదో. తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
తానొకటి తలిస్తే దేవుడొకటి తలిచాడట. దేవుడు ఏం తలిచినా స్పర్శ్ డాక్టర్లు మాత్రం దేవుడు లక్ష్మికి పెట్టిన శాపాన్ని తొలగించారు. కలియుగ దైవాల్లా నిలిచారు. లక్ష్మి తల్లిదండ్రుల పుట్టెడు శోకానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. వారు రోజు తలుచుకునేలా కాదు కొలుచుకునేలా నిలిచారు. 27 గంటల్లోనే విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేసిన ఆ డాక్టర్లందరినీ అభినందిద్దాం. ఎందుకంటే వారు ఆ ఆపరేషన్ కోసం పైసా తీసుకోవడంలేదు. ఫ్రీగా చేశారు మరి.
పక్కవాడు ఏమైనా పరవాలేదుకానీ మన లగ్జరీకి అడ్డొస్తే అడ్డంగా నరికేసే ఈ రోజుల్లో ఇలాంటి డాక్టర్లు కూడా ఉన్నారంటే నమ్మశక్యం కావడంలేదు. ఇల్లు, కారు, దర్జా కావాలని కోరుకునే ఈ రోజుల్లో వారు ఛాలెంజ్ గా తీసుకుని విజయవంతంగా ఆపరేషన్ చేశారంటే నిజంగా హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము. ఎనిమిది కోట్ల ఖర్చు అవుతుందనగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలలు అతుక్కొని పుట్టిన వీణ-వాణిల విషయంలో చేతుల్లెశారు. వారికి ఆపరేషన్ తాము చేస్తామని ముంబైకి చెందిన బ్రీచ్ కాండీ డాక్టర్లు ముందుకు రావడం గొప్ప విషయం. వారు డబ్బు గురించి ఆలోచించడంలేదు. ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో అనే ఆ డాక్టర్లు మధనపడుతున్నారు. బెంగుళూర్ కు చెందిన స్పర్శ్-ద టచ్ ఆఫ్ లైఫ్ డాక్టర్ల మాదిరిగానే ముంబైకి చెందిన బ్రీచ్ కాండీ డాక్టర్ల వీణ-వాణిల ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ దేవుడిని కాదని డాక్టర్లను కోరుకుందాం.












Click it and Unblock the Notifications
