వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్

మణికట్టు మాయాజాలంతో క్రీడాభిమానులకు పసందైన బ్యాటింగ్ ను చూపగల క్రీడాకళాకారుడు లక్ష్మణ్. ఈ విషయంలో అతనికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ ఆదర్శం. నవంబర్ 1వ తేదీని రాష్ట్రావతరణ కోసమే కాదు, వివియస్ లక్ష్మణ్ జన్మించినందుకు గుర్తుపెట్టుకోవాల్సినంత కీర్తిని ఆంధ్రప్రదేశ్ కు అందించాడు. 1974 నవంబర్ 1వ తేదీన పుట్టిన లక్ష్మణ్ వివాదరహితుడిగా తన క్రికెట్ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తనను జట్టు నుంచి తొలిగించినప్పుడు గానీ తనను జట్టుకు ఎంపిక చేసే విషయంలో వివక్షకు గురి చేసినప్పటికీ అతను నోరు జారలేదు. మృదుస్వభావిగా ఆయనకు పేరుంది.
స్ట్రోక్ ప్లేలో కొన్ని సార్లు మాస్టర్ బ్లాస్టర్ కన్నా అద్భుతమనిపిస్తాడు. 2003-04 ఇండియా పర్యటన తర్వాత లక్ష్మణ్ కు ఎలా బౌలింగ్ చేయాలో అర్థం కావడం లేదని ఆస్ట్రేలియన్లు మొత్తుకున్నారు. ఇప్పటికీ వారికి అర్థమైనట్లు లేదు. కోల్ కత్తా మ్యాచులో అతను 2001లో ఆస్ట్రేలియన్లపై 281 పరుగులు చేయడమే కాకుండా ద్రావిడ్ తో కలిసి 300 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
భారత జట్టు నాయకత్వ బాధ్యతలు చేతికి అందుతాయని అందరూ అనుకుంటున్న సమయంలో లక్ష్మణ్ జట్టులో స్థానానికే నోచుకోని పరిస్థితి ఏర్పడింది. క్రికెట్ రాజకీయాల్లో అతనికి జట్టు కెప్టెన్సీ దక్కకపోవడమే కాకుండా జట్టులో అతని స్థానమే అనుమానాస్పదంగా మారింది. అప్పుడు కెప్టెన్ గా ఉన్న సౌరబ్ గంగూలీ ఆతని బ్యాటింగ్ ఆర్డర్ ను ఎప్పటికప్పుడు మారుస్తూ తీవ్రంగా దెబ్బ తీసే ప్రయత్నం చేశాడనే విమర్శలున్నాయి. అయినా లక్ష్మణ్ ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు. మళ్లీ జట్టులోకి వచ్చాడు. తిరిగి సత్తా ఏమిటో, తాను జట్టు ఎటువంటి విపత్కర పరిస్థితిలో కాపాడగలడో నిరూపించాడు. ఎంతైనా హైదరాబాదీ అయినందుకు తెలుగు ప్రజలు గర్వించాల్సిందే.












Click it and Unblock the Notifications