చిరంజీవికి ఎవరూ సాటి రారా?

చిరంజీవి ఎంతో కష్టపడి తెలుగు సినీరంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అందుకే, చిరంజీవి కళాకారుడు కాదు, కళా కార్మికుడని ఒకానొక సందర్భంగా స్వర్గీయ రావు గోపాలరావు వ్యాఖ్యానించారు. ఆ ఉన్నత స్థానం ఆయనకు ఒక్కసారిగా రాలేదు. మొదట్లో చిరంజీవి చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించాడు. ఆ తర్వాతనే ఆయన తిరుగులేని కథానాయకుడిగా ఎదిగారు. బాలకృష్ణకు కూడా మాస్ ఇమేజ్ ఉంది. చిరంజీవికి బాలకృష్ణను పోటీగా భావిస్తారు. కానీ, చిరంజీవి స్థానం ఆయనకు దక్కలేదనే చెప్పాలి. బాలకృష్ణ సినిమాలు కొన్ని బాక్సాఫీసును బద్దలు కొట్టిన సందర్భాలున్నాయి. కానీ, ఆయన స్థానం నిలకడగా ఎప్పుడూ లేదు. సమరసింహారెడ్డి, నర్సింహనాయుడి తర్వాత ఆయనకు సింహా వరకు పెద్దగా హిట్లు లేవు. బాలకృష్ణ నటనకు అవకాశం ఉండే పాత్రల కన్నా మాస్ అపీలు ఉండే పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకోవడం, కథకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం అందుకు కారణమని విశ్లేషకులు చెబుతారు.
తన కుమారుడు రామ్ చరణ్ తేజ వచ్చారు కాబట్టి తన స్థానాన్ని అతను భర్తీ చేస్తాడని చిరంజీవి చెప్పారు. కానీ ఆ మాటలు తేలిపోయాయి. మగధీర పెద్దగా హిట్ అయినప్పటికీ ఆ తర్వాతి సినిమాలు ఆయనకు అపజయాన్నే కట్టబెట్టాయి. మగధీర కూడా చాలా వరకు సాంకేతిక కారణాల వల్లనే విజయం సాధించిందని అంటారు. ఆయన మేనల్లుడు అల్లు అర్జున్ కూడా ఉన్నత స్థాయిని అందుకోలేకపోయారు. హీరో కృష్ణ కుమారుడు మహేష్ బాబుకు పోకిరి ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమా. ఇక పవన్ కళ్యాణ్ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ పెద్దగా సినిమాలు విజయం సాధించలేదు. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన కళ్యాణ్ రామ్, తారకరత్న తమ సత్తా చాటలేకపోయారు. వీరందరిలో కాస్తా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్‌నే. బృందావనం సినిమా ద్వారా కాస్తా డిఫరెంట్‌గా వెళ్లి తన స్థానాన్ని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నించారు. ప్రభాస్ గానీ గోపిచంద్ గానీ నిలదొక్కుకునేందుకే అపసోపాలు పడుతున్నారు.
దాదాపుగా పైన చెప్పిన హీరోలందరికీ మాస్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులున్నారు. అభిమానుల మధ్య పోటీ ఉంది. కానీ, నిలకడగా వారి సినిమాలు రాణించిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఒక్కో సినిమాకు నెలల తరబడి సమయం కూడా తీసుకుంటున్నారు. కానీ పెద్దగా రాణించడం లేదు. అందుకు ప్రధాన కారణం, వారు కథకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని పక్కన పెట్టేసి, మూస పాత్రలతో మాస్ ఇమేజ్ కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నారు. విభిన్నమైన పాత్రలు పోషించడానికి వారు వెనకాడుతున్నారు. వీరంతా తమ వైఖరిని మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే కాస్తా వ్యాపారపరంగా నమ్మకమైన హీరోలుగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది.