టాలీవుడ్ 'చలో విశాఖపట్నం'

తన శేష జీవితాన్ని విశాఖపట్నంలోనే గడుపుతానని, ఇది అత్యంత సుందరమైన నగరమని మెగాస్టార్ చిరంజీవి ఒకానొక సందర్భంలో అన్నారు. చిరంజీవి మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న సినీ ప్రముఖులు ఆ దిశగా దృష్టి సారించారు. హైదరాబాదులో జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మురళీ మోహన్ ఇటీవల విశాఖపట్నంలో కార్ల షోరూంను ప్రారంభించారు. ఎదుగుతున్న నగరంగా విశాఖపట్నం పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా, విశాఖపట్నానికి సముద్ర తీరం, అరుకులోయ, భిమిలీ వంటి ప్రకృతిసిద్ధమైన సుందరమైన ప్రదేశాలు ఉండడం కూడా సినీ రంగాన్ని ఆకర్షిస్తున్న అంశాలు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని, దీనివల్ల తమకు ఇబ్బందులు తప్పవని తెలుగు సినీ రంగ ప్రముఖులు అనుకుంటున్నట్లు సమాచారం. దీంతో ముందుగానే జాగ్రత్త పడడం అవసరమని గుర్తించి విశాఖపట్నంలో పెద్ద యెత్తున భూములు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుందని సమాచారం. హైదరాబాదులోని భూముల ధరలు తగ్గుముఖం పట్టాయి, లావాదేవీలు దాదాపుగా స్తంభించిపోయాయి. ఈ స్థితిలో విశాఖపట్నంలో ఊపందుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, మురళీ మోహన్ వంటి పలువురు సినీ ప్రముఖులు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి పెట్టుకున్నట్లు చెబుతున్నారు. విశాఖపట్నం నుంచి భిమిలీ వరకు ఇప్పటికే భూములు ప్రముఖుల సొంతమైనట్లు తెలుస్తోంది.