• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూన్‌కల్లా పోలవరం పూర్తవుతుందా? మూడున్నరేళ్లు సాధించిందేమిటి?

By Swetha Basvababu
|

హైదరాబాద్/ అమరావతి‌: ఆంధ్రులకు జీవనాడి 'పోలవరం ప్రాజెక్టు' అన్న నానుడిని సొమ్ము చేసుకునేందుకే ఇటు ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం.. అటు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ప్రయత్నిస్తున్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తొలుత పట్టిసీమ, తర్వాత పురుషోత్తమపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలంటూ హడావుడి చేసిన చంద్రబాబు, ఆయన సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును మూడున్నరేళ్లుగా ఎందుకు పట్టించుకోలేదన్నవిషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఎప్పటికప్పుడు ఆపద మొక్కుల రాజకీయాలు చేయడమే రాజకీయ నేతలకు అందునా చంద్రబాబు నాయుడు వంటి వారికి అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడున్నరేళ్లుగా ప్రేక్షక పాత్ర వహించి.. తాజాగా కాఫర్ డ్యామ్ నిర్మాణం కోసం పరుగులు తీయాల్సిన అవసరమేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

 2008లో తెలంగాణకు అనుకూలంగా ఇలా లేఖ

2008లో తెలంగాణకు అనుకూలంగా ఇలా లేఖ

అయినా 1995 - 2004 మధ్య అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా 2004లో ఘోర పరాజయాన్ని చవి చూసింది తెలుగుదేశం పార్టీ. దీనికి తెలంగాణ ఉద్యమం కూడా కారణమే. దీన్ని అధిగమించేందుకు.. తిరిగి అధికార పగ్గాలు చేపట్టేందుకు.. 2008లో తెలంగాణకు అనుకూలమని అప్పటి కేంద్రమంత్రి - ప్రస్తుత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ ఉప సంఘానికి లేఖ రాసిన గొప్పదనం టీడీపీ అధినేత చంద్రబాబుది. 2009 డిసెంబర్‌లో తెలంగాణ కోసం నిరవధిక దీక్ష చేపట్టిన ప్రస్తుత తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుతో దీక్ష విరమింప జేయడానికి సన్నాహకంగా.. 2009 డిసెంబర్ ఏడో తేదీన అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కొణిజేటి రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మూడు ప్రాంతాల నుంచి హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడితే ఆమోదించడానికి మద్దతునిస్తామని హామీలిచ్చారు. దీని ఆధారంగానే డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని నాటి హోంమంత్రి పి చిదంబరం ప్రకటించారు. ఆ వెంటనే మాట మార్చేశారు తెలుగుదేశాధీశుడు. రెండు కళ్ల సిద్ధాంతం తెర ముందుకు తెచ్చి.. తెర వెనుక నుంచి సీమాంధ్ర ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు.

అన్ని పార్టీలకూ సీమాంధ్ర పోరులో భాగస్వామ్యం ఇలా

అన్ని పార్టీలకూ సీమాంధ్ర పోరులో భాగస్వామ్యం ఇలా

సమైక్యాంధ్ర పేరుతో సీమాంధ్ర జిల్లాలకు పరిమితమైన ఉమ్మడి రాష్ట్ర కొనసాగింపు ఉద్యమానికి అండదండలు కల్పించారు. ఇందులో నాటి అధికార కాంగ్రెస్ పార్టీలోని సీమాంధ్ర నేతలు జత కలిసారనుకోండి అది వేరే సంగతి. ఈ డ్రామాల మాటెలా ఉన్నా కాలం ఆగదుగా.. అలా సాగిపోయింది. 2012 చివర్లో అఖిలపక్షం పెట్టి తెలంగాణ సంగతి తేల్చాలన్నారు. అదే పని కేంద్రం తేల్చింది. టీడీపీ అక్కడా రెండు నాల్కల ధోరణి ప్రదర్శించినా ఏదో ఒకటి తేల్చాలన్న వ్యూహం ప్రదర్శించిందన్న విమర్శలు ఉన్నాయి. చివరకు 2013 జూలై నెలాఖరులో అధికార యూపీఏ కూటమి సమన్వయ కమిటీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తెలంగాణ ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నాయి. దీనికి అనుగుణంగా కేంద్ర క్యాబినెట్ ముసాయిదా తీర్మానం తయారుచేసి.. రాష్ట్రపతి ద్వారా ఉమ్మడి ఏపీ శాసనసభా స్పీకర్ కు అందజేసింది.

 అనాలోచిత విభజన చేస్తున్నారన్న పల్లవి అందుకున్న చంద్రబాబు

అనాలోచిత విభజన చేస్తున్నారన్న పల్లవి అందుకున్న చంద్రబాబు

2013లో జాతీయ స్థాయిలో చోటామోటా రాజకీయ నేతలందరితో సంప్రదింపులు జరిపి తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలన్న వ్యూహాన్ని రచించిన ఘనత చంద్రబాబుదే. అనాలోచితంగా విభజిస్తున్నారన్న పల్లవి అందుకున్నారు. ఇప్పుడూ అదే పల్లవి వినిపిస్తున్నారు అది వేరే సంగతి. తెలంగాణ ఏర్పాటు కోసం నాడు కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘పోలవరం' ప్రాజెక్టుకు జాతీయ హోదాలో తామే నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా చేర్చింది. తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని తెర వెనుక వ్యూహాల అమలుతో.. పవన్ కల్యాణ్ ఉద్వేగభరిత ప్రసంగాల దన్నుతో యువతను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మూడోసారైనా చరిత్రలో నిలిచిపోయే రీతిలో వ్యవహరించాల్సింది.

 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాకే పోలవరం శంకుస్థాపన

2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాకే పోలవరం శంకుస్థాపన

1995 నుంచి తొమ్మిదిన్నరేళ్లపాటు తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు 1996లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపితే ఆమోదిస్తామని నాటి ప్రధాని హెచ్ డీ దేవెగౌడ సూచించినా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. కానీ 2003లో పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చుట్టేసిన జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో లెఫ్ట్, టీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఆ వెంటనే ఒక విజన్‌తో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అఫ్ కోర్స్. అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన స్వార్థ ప్రయోజనాలకు పెద్ద పీట వేశారని ప్రత్యర్థులు విమర్శిస్తారు. కానీ టంగుటూరి అంజయ్య తర్వాత మరే ముఖ్యమంత్రి సాహసించని రీతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి.. అన్ని చర్చించిన మీదటే ‘పోలవరం' ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. తొలిదఫా ప్రభుత్వ హయాంలో వైఎస్‌ హయాంలో ముందు సత్యం అధినేత రామలింగరాజుకు చెందిన మేటాస్‌కు కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ఆ సంస్థ కష్టాలపాలు కావడంతో అప్పటి తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన కంపెనీకి అప్పగించారు. ఆ సంస్థ కూడా పనులు చేయలేకపోతున్నదని గ్రహించి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నాగేశ్వరరావును తప్పుకోమన్నారు. ఆయన తప్పుకున్నారు. కొత్త కాంట్రక్టర్‌ను నియమించే లోపుగానే వైఎస్‌ హఠాన్మరణం సంభవించింది. తర్వాత సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు నాటి గుంటూరు, ఈనాటి నర్సరావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సారథ్యంలోని ట్రాన్స్ టాయ్ సంస్థకు అప్పగించారు.

 ఏడాది నుంచి పోలవరంపై బాబు హడావుడి ఇలా

ఏడాది నుంచి పోలవరంపై బాబు హడావుడి ఇలా

2014లో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పోలవరం ఊసే ఎత్తని చంద్రబాబు.. దాదాపుగా ఏడాది కాలంగా అడపాదడపా ఆ ప్రాజెక్టు నిర్మాణం ప్రగతిపై సమీక్షలు చేపట్టారు. తాజాగా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి.. 2018 జూన్ నాటికి పూర్తి చేసి, వచ్చే ఖరీప్ సీజన్‌లో గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయాలని సంకల్పించారు చంద్రబాబు. ఇందుకోసం కొత్త కాంట్రాక్ట్ సంస్థలకు అదనపు పనులు అప్పగించేందుకు టెండర్లను ఆహ్వానించడంతో అసలు కథ మొదలైంది. కాఫర్ డ్యామ్, స్పిల్ వే పనుల నిర్మాణం నిలిపేయాలని గత నెల 27న నాటి కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ రాసిన లేఖపై ఏపీ సీఎం చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కేంద్రం తీసుకుంటామంటే నమస్కారం పెట్టి అప్పగిస్తామని వెటకారం కూడా చేసేశారు. ఆ వెంటనే సర్దుకుని సంయమనం పాటించాలని టీడీపీ నేతలకు, రాష్ట్ర మంత్రులకు సూచించారు. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిది. అటువంటప్పుడు 2014లో కేంద్రం నుంచి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుని.. ఇప్పుడు అడ్డం తిరుగడం వెనుక పరమార్థమేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 ఏపీ అధికారులకు ఇలా కేంద్రం గైడ్‌లైన్స్

ఏపీ అధికారులకు ఇలా కేంద్రం గైడ్‌లైన్స్

పోలవరం కాఫర్ డ్యామ్ నిర్మాణానికి పిలిచిన టెండర్లు నిలిపేయాలని.. కేంద్రం నుంచి లేఖ రాగానే మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం సంప్రదించారు. ఆ పై జాతీయ జల విద్యుత్ కార్పొరేషన్, కేంద్ర జల వనరుల శాఖ అధికారులు, నిపుణులు దఫదఫాలుగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పరిస్థితిని మదించారు. 50 ఏళ్లుగా గోదావరి నదికి వరదలెప్పుడు వస్తాయి? ఎప్పుడు పనులు చేపట్టేందుకు వీలవుతుందో సాంకేతిక అంశాలు, రికార్డులను తిరగేసి తమకు నివేదిక పంపితే కాఫర్ డ్యామ్ నిర్మాణం.. రాక్ ఫిల్ రిజర్వాయర్ నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వాధికారులకు స్పష్టం చేసి వెళ్లారు కేంద్ర బ్రుందం. అటునుంచి కేంద్ర బ్రుందం వస్తున్నదన్న వార్త రాగానే అధికార టీడీపీ అనుకూల మీడియా ‘ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు వండి వార్చడం'లో నిమగ్నమైంది.

 వాస్తవిక వైఖరితో కేంద్రం ఆచితూచి చర్యలు

వాస్తవిక వైఖరితో కేంద్రం ఆచితూచి చర్యలు

పోలవరం ప్రాజెక్టులో భాగంగా కాఫర్‌ డ్యాం నిర్మాణం తప్పనిసరి అనడానికి నిపుణులు చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి. ‘ప్రధాన ప్రాజెక్టు నిర్మాణంతోనే కాఫర్‌ డ్యాం కలసి ఉండేలా డిజైన్లను రూపొందిస్తే.. ప్రధాన ఆనకట్టకు మట్టి పరీక్ష చేసి.. ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. పైగా.. గోదావరి జలాలు లేనప్పుడు ప్రధాన కట్టడం నిర్మిస్తూ.. జలాలు వచ్చాక ఆపేసి.. మళ్లీ నీటి మట్టం తగ్గాక నిర్మాణ పనులు చేపడితే.. కాంక్రీటు సెటిల్‌ కాదు. అంతా లేయర్లుగా తయారవుతుంది. అది డ్యాం భద్రతకే ముప్పుగా పరిణమిస్తుంది. అదీగాక ప్రధాన కట్టడంతో కలిపి కాఫర్‌ డ్యాంను నిర్మిస్తే.. ప్రధాన కట్టడం ఎత్తు ఎక్కువగానూ.. కాఫర్‌ డ్యాం ఎత్తు తక్కువగానూ ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణంలో పొదుపు చర్యలు అనుసరిస్తే.. నాణ్యత తగ్గిపోతుంది. నాణ్యతలో రాజీపడితే ప్రమాదం' అని నిపుణులు తెలిపారు. ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు పరిశీలించిన తర్వాత కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచడం అవసరమా? కాదా? అన్న సందేహాన్ని కేంద్రం ఉపసంహరించుకున్నట్లు తెలుస్తున్నది. తక్షణం కేంద్రం అనుమతులు ఇస్తేనే పనులు చేపట్టి, ముందుకు వెళ్లడానికి వీలవుతుందని ఏపీ అధికారులు వాదిస్తున్నట్లు సమాచారం.

 త్వరలో కేంద్రానికి నివేదిక పంపనున్న ఏపీ అధికారులు

త్వరలో కేంద్రానికి నివేదిక పంపనున్న ఏపీ అధికారులు

శని, ఆదివారాల్లో విడతల వారీగా సమీక్షలు జరిపిన ఏపీ నీటి పారుదల అధికారులు సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తున్నది. చిల్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు, యంత్రాల సమీకరణ, పెరిగిన కాంక్రీటు పనుల వ్యయం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నూతన టెండర్ల ప్రక్రియకు ప్రత్యామ్నాయాలను సూచించారు. ఈపీసీ ప్రాజెక్టులో కొత్తగా టెండర్లకు వెళ్లడమే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. దీనిపై ఎన్‌హెచ్‌పిసి కమిటీ మూడు రోజుల్లో నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు ఇవ్వనుంది. ఇక చివరిగా సోమవారం పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సందర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రాజెక్టు ఎంత మేరకు పురోగతి సాధించిందో వాస్తవ చిత్రం ప్రజల ముందు ఉంచితే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 గుజరాత్‌లో నర్మదా ప్రాజెక్టు పూర్తి చేసిన అనుభవం మోదీదీ..

గుజరాత్‌లో నర్మదా ప్రాజెక్టు పూర్తి చేసిన అనుభవం మోదీదీ..

2014 నుంచి ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నా.. హడావుడి చేసేసి.. కేంద్రంపైనో.. విపక్షంపైనో నెపం మోపి.. అన్ని అనుకూలిస్తే.. నీరు విడుదల చేసి.. ఆ పై ప్రచారంతో ఓట్లు దండుకోవాలని చూస్తే.. ఏపీ ప్రజలు క్షమిస్తారని భావిస్తే సందేహమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచడానికి అదనంగా రూ.500 కోట్లు అవసరం. అసలు ఇప్పటివరకు కేంద్రం కేటాయించిన నిధులపై వివరాలు ఇవ్వకుండా.. దాటవేత వ్యూహంతో ప్రజల ముందు ఒకలా.. వెనుక మరొకలా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందునా ప్రధాని నరేంద్రమోదీ.. తన సొంత రాష్ట్రంలోనే దేశంలోనే అతిపెద్ద నర్మదా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన అనుభవం కలిగి ఉన్నారు. ఆ విషయాలన్నీ విస్మరించి.. ‘మాయా ప్రచారం'తో మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని.. కానీ అది ఆంద్రప్రదేశ్ వాసులకు పూడ్చలేని నష్టాన్ని మిగులుస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There are some doubts that 'is Chandrababu Government' interested to completed Polavaram Project. Chandrababu mum in 1996 Devegowda Government centre but he gives so many publicity on this Project. Actually Polavaram Project layed foundation by YS Raja Shekar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more