వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తోపుడు బండిపై పుస్తకాలు: అవిశ్రాంత పథికుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

దశరథ్ మాంఝీ...! బీహార్ లోని ఒక మారుమూల పల్లెలో నివసించే సామాన్య పౌరుడు,, కొన్ని సంవత్సరాల కింద ఓ కలకన్నాడు విపరీతమైన భాధలోంచీ, భయంకరమైన కన్నీటినుంచీ పుట్టిన కల అది.. కొండని తొలవటం, కొండమధ్యనుంచి రోడ్డు వేయ్యాలన్నది అతని కోరిక. అతని సంకల్పం వెనుక ఒక పెను ధుఖం ఉంది, తీరని వేదనా ఉంది అయితే ఇప్పుడు తను చేయాలనుకున్న పని వల్ల అతని ధుఖ:మూ, వేదనా రెండూ తీరవు... కేవలం తనచుట్టూ ఉన్న వారికి కూడా ఆ కష్టం రాకూడదనుకున్నాడు.

సహాయం కోసం చూడలేదు, సాక్షాత్తూ ఒక కొండతో తలపడటం ఎంతటి సాహసం అని కూడా ఆలోచించలేదతను. చేతికందిన పలుగూ పారా తీసుకొని ఒక్కడే తన ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు జనం నవ్వారు.... అతన్ని గేలి చేసారు. ఇదంతా అయ్యే పనేనా అన్నవాళ్ళూ. దారిన పోతూ అతను చేస్తున్న పనిని చూసి అతని ముందే నవ్వి పోయినవాళ్ళూ ఉన్నారు...

మాంఝీ తన ప్రయత్నాన్ని ఆపలేదు 25 సంవత్సరాలు తన జీవితంలోని ముఖ్యమైన సమయాన్ని మొత్తం ఆ ప్రయత్నంలోనే గడిపాడు... కానీ అనుకున్నది సాధించాడు. ఒకప్పుడూతన్ని చూసి నవ్విన వాళ్ళే జేజేలుకొట్టారు, మాంఝీ ఒక చరిత్ర సృష్టించాడంటూ అతన్ని పొగిడారు. అయితే మాంఝీ మాత్రం తాను మొదలుపెట్టినప్పుడు ఎలా అయితే ఎవ్వరినీ పట్టించుకోలేదో అలాగే తనకొసం పొగడ్తల్తో వచ్చిన జనాన్ని కూడా పట్టించుకోలేదు... తాను చేసిన పని మాత్రమే అతన్ని సంతోష పెట్టగలిగంది.

అలా సాదిక్ అలీ చేశాడు..

అలా సాదిక్ అలీ చేశాడు..

"సంకల్పం" ఒక మనిషిని చరిత్రలో భాగం చేస్తుంది... ఒకే ఒక్క ఆలోచన అతని చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త మార్పు తెస్తుంది.. కావాల్సిందల్లా ఆ సంకల్పాన్ని భరించగలిగే ఒక దేహం మాత్రమే.... చరిత్ర అలాంటి మనుషుల కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది.. అట్లా కొన్ని సంవత్సరాల తర్వాత.... షేక్ సాధిక్ అలీ అనే మరో మనిషిని ఇంకో సంకల్పం పూనింది. చరిత్ర నిరంతరాన్వేషి మార్పుతెచ్చేవాడికోసం వెతుకుతూనే ఉంటుంది తనకోసం ఇంకో మనిషిని ఎంచుకుంది.....

మామూలుగా అయితే తోపుడు బండి..

మామూలుగా అయితే తోపుడు బండి..

తోపుడుబండి.... మామూలుగా అయితే అరటి పళ్ళని మోస్తూనో, పాతబట్టలని, ప్లాస్టీక్ సామాన్లని అమ్ముతూనో కనిపించే నాలుగు చక్రాల బండి. దానిమీద కవిత్వాన్ని అమ్ముతా అన్నాడు. పుస్తకాలని వేసుకొని వీధుల్లో తిరుగుతా అన్నాడు. చుట్టు ఉన్న మనుషుల్లో ఎక్కువ శాతం మనం ఊహించగలిగే రియాక్షనే ఇచ్చారు కొందరు చాటుగా నవ్వుకుంటే ఇంకొందరు మొహమ్మీదే నవ్వారు. ఈ వయసులో నీకవసరమా ఇవన్నీ? అన్నవాళ్ళూ, ఇదేదో కొత్త బిజినెస్ ప్లాన్...! అంటూ రాళ్ళు వేసే ప్రయత్నం చేసినవాళ్ళూ ఉన్నారు... అయితే అప్పుడు మాంఝీ ఏం చేసాడో ఇప్పుడు సాధిక్ చేసిన పనీ అదే "ఒక్క నవ్వు నవ్వేసి తనపని తాను మొదలు పెట్టేసాడు"

తోపుడు బండి అలా మొదలైంది...

తోపుడు బండి అలా మొదలైంది...

2015 ఫిబ్రవరి 22 న తోపుడు బండి మొదలైనప్పుడు సాధిక్ ఏం అనుకున్నాడో అతనొక్కడికే తెలుసు... ఎందుకంటే..! అక్కడికి వచ్చినవాళ్ళలో కూడా ఇది సాధ్యమయ్యే పనేనా అన్న చిన్న అనుమానం లేకపోలేదు.

పిచ్చి పట్టినవాడిలో ఇలా..

పిచ్చి పట్టినవాడిలో ఇలా..

దాదాపు కొన్ని నెలలపాటు హైదరాబాద్ రోడ్లన్నీ పిచ్చి పట్టినట్టు తిరిగాడు, కనిపించిన ప్రతీ మనిషికీ పుస్తకాలని చూపించే ప్రయత్నం చేసాడు. మొదట్లో కొంత వింతగా అనిపించిన ఈ ప్రయోగం జనాల్లో నెమ్మదిగా కొంత ఆసక్తిని రేకెత్తించటం మొదలు

ఇలా అస్తిత్వాన్ని సంపాదించుకుంది...

ఇలా అస్తిత్వాన్ని సంపాదించుకుంది...

పెట్టింది నెమ్మదిగ తోపుడు బండి తనకంటూ ఒక అస్తిత్వాన్ని సంపాదించుకుంది. పుస్తకాలు వేస్తే ఇప్పుడు జనం చదువుతున్నారా?? అన్న అనుమానం ఉన్న యువకవులు కూడా పుస్తకాలు పంచటమే కాదు ఇప్పుడు అమ్మగలం అన్న నమ్మకానికి వచ్చేసారు, పుస్తకాలకీ కవిత్వానికీ ఉన్న "గిరాకీ" అర్థమయ్యింది. ఇప్పటివాళ్ళకి కవిత్వం ఎక్కడ ఎక్కుతుందండీ..! అంటూ ఆశ్చర్యపోయిన వేళ్ళు అలా ముక్కుమీదే ఉండిపోయాయ్... కొన్ని వందల కవిత్వ పుస్తకాలని ఈజీగా అమ్మి పారేసాడు. అందులో యువకవులు రాసిన పుస్తకాల శాతం తక్కువేం కాదు, కొన్నవాళ్ళలో యువత శాతమూ "చాలాఎక్కువ"కు ఏమాత్రం తగ్గలేదు. పుస్తకం రాయటమే కాదు పుస్తకాన్ని అమ్మటం కూడా ఒక ఆర్ట్ అన్న మాట సైలెంట్ గా చెప్పి తాను కామ్అయిపోయాడు.. ఇక మొదలైంది సాహితీకారుల రాక.., కవులూ, రచయితలూ, జర్నలిస్టులూ ఒక్కొక్కరూ తోపుడుబండి బాటపట్టారు. కానీ ఆసరికి తోపుడు బండి దారి మారిపోయింది...

చేరాల్సిన చోటికి పుస్తకాలు..

చేరాల్సిన చోటికి పుస్తకాలు..

రచయితలంతా తనదగ్గరికి వస్తూంటే అసలు సాహిత్యం చేరాల్సిన చోటుని వెతుక్కుంటూ సాగిపోవటానికి నిర్ణయించుకుంది... అవును..! ఇప్పుడు తోపుడుబండి తన నిర్ణయాలు తానే తీసుకోవటం మొదలు పెట్టింది.. సాధిక్ తోపుడు బండినిమోసే ఒక కూలీ మాత్రమే. ఈ సారి ఇక తోపుడు బండి ఆగలేదు...సాధిక్ ఆపలేదు "తోపుడు బండి పబ్లికేషన్స్" మొదలయ్యింది. కవిత్వంతో పాటు మిగిలిన సాహిత్యమూ బండెక్కి కూచుంది.ఇప్పుడు ఇంకో గ్రంథాలయోధ్యమం మొదలయ్యింది.100 రోజుల్లో 1000 కిలోమీటర్ల ప్రయాణానికి తోపుడు బండి సిద్దమైంది మరిన్ని కొత్త పుస్తకాలతో సింగారించుకుంది.ప్రతీ పల్లె లోనూ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయటం కోసం,ప్రజల్లో పఠనాభిలాష పెంచటం కోసం తోపుడు బండి ప్రస్థానం మొదలయ్యింది.సాధిక్ మరోసారి బండి తోసుకుంటూ రోడ్డెక్కాడు.. జనవరి 24 2016 హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డునుంచీ మొదలవబోయే యాత్రకోసం ఈసారి పత్రికా సంపాదకులూ, కవులూ, పాఠకులూ వచ్చారు.. అవును..! ఇప్పుడు తోపుడుబండి ఒక సాధారణ చక్రాల బండికాదు ఇప్పుడది తనకుతానే ఒక బ్రాండ్... ఆ బ్రాండ్ అంబాసిడర్ సాధిక్ అలీ కాదు... "తోపుడుబండి సాధిక్ అలి"..

కొన్ని వందల గ్రామాలకు తోపుడు బండి

కొన్ని వందల గ్రామాలకు తోపుడు బండి

హైదరాబాద్ నుంచి మొదలై ఆరు జిల్లాల్లో..కొన్నివందల గ్రామాలని పలకరించింది సందర్శించిన ప్రతీగ్రామం లోనూ గ్రంథాలయం పెట్టాలి అన్న ఆలోచనే (100 గ్రంథాలయాలు అన్న లక్ష్యం ఎప్పుడో తన పరిధిని దాటిపోయింది) 100 రోజుల్లో కొన్ని వందల గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ వరంగల్ నడిబొడ్డుకి చేరే సమయానికి 1000 కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా దాటేసింది తోపుడుబండి... తోపుడు బండి, పుస్తకాలూ, 1000 కిలోమీటర్లూ వంద రోజుల్లో ప్రతీ గ్రామాన్నీ సందర్శిస్తూ వెళ్ళాలి... కాలినడకన ప్రయాణం 40 డిగ్రీల పైనే ఉన్న ఎండ, సాధ్యమా...? సాధిక్ అలీ కి తనకి తాను ప్రశ్నించుకోవటం ఇష్టం, ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ వెళ్ళటం అంతకన్నా ఇష్టం... 1000 కిలోమీటర్ల యాత్ర సాధ్యమా అన్న ప్రశకి సమాధానం కోసం బయలేరిన అతను చివరికి వరంగల్ నడిబొడ్డున నిలబడి సమాధానాన్ని పట్టుకున్నాడు... "సాధ్యమే...!" అంటూ అరిచాడు.., దిక్కులు పగిలి పోయేలా.... అరిచాడు "ఔనూ..! సాధ్యమే... మనిషన్న వాడు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే.." హైదరాబాద్ ఉప్పల్ నుంచీ రంగా రెడ్డి, మెదక్,నల్గొండ జిల్లాలమీదుగా ఒక్కొక్క ఊరిలో అక్షరాలు చల్లుకుంటూ, పుస్తకాలు మొలిపించుకుంటూ... నడిచాడు అతని సమాధానం కోసం సాగిన యాత్ర కొన్ని వందల ప్రశ్నలకు సమాధానాలనిచ్చింది.... మరిన్ని లక్ష్యాలను కూడా...

బస్తీల్లోకి తోపుడు బండి..

బస్తీల్లోకి తోపుడు బండి..

వరంగల్ అర్బన్ బస్తీల్లో పిల్లకి పుస్తకాలు అందిచటం అంతకన్న ముఖ్యంగా ఆ బస్తీల వైపు అధికారుల దృష్టిపడేలా చేయటం కొత్త లక్ష్యం. అయితే ఈసారి పుస్తకాలు సాహితీ ప్రియులకోసం అమ్మటం కాదు బాల సాహిత్యాన్ని, వాళ్ళకి అవసరమైన పుస్తకాలనీ "ఉచితంగా" అందించటం. గతం లో లాగా రచయితలు ఇచ్చిన పుస్తకాలని అమ్మిపెట్టటం కాదు దానికోసం ఇప్పుడు ప్రత్యేకంగా శ్రమించాల్సిన పని లేదు... పుస్తకాలమీద తెలుగు చదివే వారి దృష్టి పడింది దానికి సాక్ష్యం హైదరాబాద్ బుక్ ఫెస్టివల్. తోపుడు బండిని సందర్శించటానికి వచ్చిన ప్రముఖులూ, గవర్నర్, కలెక్టర్ స్థాయి వ్యక్తులూ తోపుడు బండిలో పుస్తకాలని కొనటం ఇక తర్వాత చేయాల్సిన పనిని చెప్పాయి. ఈ సారి రచయితల పుస్తకాలని జనం లోకి తీసుకు వెళ్ళటం కాదు. స్వయంగా పుస్తకాలను కొని, లేదా తమ సేకరణలో భాగంగా ఉన్న పుస్తకాలని డొనేషన్ గాతీసుకొని పిల్లలకి ఉచితంగా అందించాలి, శారీరక మానసిక శ్రమలకు తోడు ఆర్థికంగా కూడా మరో భారం. అయినా వెనక్కి తగ్గలేదు డొనేషన్గా వచ్చిన పుస్తకాలు గ్రంథాలయాల కోసం, వాటిలో పిల్లలకి అర్థమయ్యే పుస్తకాలని, తాను కొనుగోలు చేసిన పుస్తకాలనీ వేసుకొని మళ్ళీ ఒక సారి వరంగల్ వీధులు మొత్తం చుట్టబెట్టారు...

ఓ చిన్న టీమ్ ఏర్పడింది..

ఓ చిన్న టీమ్ ఏర్పడింది..

అయితే ఈసారి కొందరు యువకులతో చిన్న టీం ఏర్పడింది. ఇది కొంత వెసులుబాటు..., బస్తీల్లో పుస్తకాల పంపినీ మొదలయ్యింది. పిల్లలు..పిల్లలు..పిల్లలు... చిరునవ్వులూ, పసిచేతుల స్పర్శలూ అనే బాల్యం వెనుక ఉన్న మరో నిజం బయటకు వచ్చింది. ఇప్పటికీ చాలామంది పిల్లలకి సరైన విధ్యా, చాలినంత పౌష్టికారం లేదు, కనీసం తమ తరగతి గదిలో ఉండాల్సిన పుస్తకాలు కూడా పూర్తిస్థాయిలో వారిదగ్గర ఇంకాలేవు. చేయగలిగినంత వరకూ చేయాలి... బాలసాహిత్యం తో పాటు కొన్నిసార్లు నోటుపుస్తకాలూ, పెన్నులూ తోపుడు బండెక్కాయి.. పిల్లలచేతుల్లోకి వెళ్ళాయి.. కొద్దిసేపైనా ఈ ప్రపంచానికి వాళ్ళ నవ్వులని చూపించగలిగాయి. అప్పుడే ఇంకో నిర్ణయం... నాకు మరికొన్ని నవ్వులు కావాలి...వందలూ వేలల్లో కాదు లక్షల్లో పిల్లల చిరునవ్వులు కావాలి...

ఇలా నిర్ణయమైపోయింది..

ఇలా నిర్ణయమైపోయింది..

తర్వాతి లక్ష్యం ఈ 30 రోజుల యాత్రలో నిర్ణయమైపోయింది.. కొన్నాళ్ళ విరామం కాస్త రీచార్జ్ కోసం హిమాలయ యాత్రకి వెళ్ళాడు. చెట్లూ, పుట్టాలూ, కొండలూ లోయల్లో అడవితల్లికి అక్షర తోరణం ప్రణాలిక సిద్దమయ్యింది... తిరిగి వచ్చిన దగ్గరినుంచీ

తపస్సులా ప్రారంభించాడు..

తపస్సులా ప్రారంభించాడు..


ఒక తపస్సులా తన పనిని మొదలు పెట్టేస్సాడు. ఎంచుకున్న ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా., ఇల్లందులో డిసెంబర్ 7 ఉదయం 10.30 గంటలకు తోపుడుబండి 'అడవితల్లికి అక్షరతోరణం' యాత్ర ప్రారంభం అయ్యింది. ఒకేరోజు ఒకేచోట నాలుగు వేలకు పైగా స్కూల్ పిల్లలను సమావేశపర్చింది.ఒక్కొక్కరికి ఒక్కో పుస్తకం ఇచ్చింది. పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమను పెంచింది.మాతృభాషపై మమకారాన్ని నూరిపోసింది. ఒక అద్భుతమైన ఊహకు అందమైన రూపాన్ని ఇచ్చింది. ఎక్కడో మారుమూల అడవుల మధ్యలో ఉన్న ఇల్లందు అనే పట్టణంలో ఒక స్వప్నానికి ప్రాణం పోసింది. పుస్తకాలు పిల్లల చేతుల్లో.. నవ్వులు వాళ్ళ మొహాల్లో.... ఆనందం తోపుడు బండిలో... పుస్తకాల బరువుదించుకొని వేలకొద్దీ పిల్లల నవ్వులని నింపుకున్న తోపుడుబండి మళ్ళీ కదిలింది... జిల్లా వ్యాప్తంగా తోపుడుబండి ఆగమనం గురించిన వార్త విస్తృతంగా వ్యాపించింది. టీచర్లు,పిల్లల మధ్య వుండే నెట్ వర్క్ నిజంగా ఒక అద్భుతమే. మరుసటి రోజు నుంచి మన్యంలోని వివిధ గ్రామాల నుంచి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. వ్యక్తిగతంగా పలువురు కలిసి వారి గ్రామాల పరిస్థితులు వివరిస్తూ తమ గ్రామాలకు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఈలోగా.... తోపుడుబండి రాజీవ్ నగర్ ,పోలంపల్లి,వేపలగడ్డ,కట్టుగూడెం, రేపల్లె వాడ నిజాంపేట,ముకుందాపూర్,ఒడ్డుగూడెం,వేములవాడ,చిన్నంగల తండా, ఒంటి గుడిసె (నెహ్రు నగర్)చల్ల సముద్రం, కొమ్ముగూడెం,లచ్చ గూడెం గ్రామాలను సుడిగాలిలా చుట్టేసింది. వేలాదిమంది మంది పిల్లల్ని కలవటం,వాళ్లకు పుస్తకాలను ఇవ్వటం,వెళ్ళిన ప్రతీ స్కూల్ లో లైబ్రరీ ఏర్పాటయ్యింది. లచ్చ గూడెంలో వెయ్యి పుస్తకాలతో గ్రామీణ గ్రంధాలయం మొదలవటం ఆ గ్రామ ప్రజల చిరకాల కోరిక తీరింది.

ఇలా మూలమూలకూ తెలిసిపోతుంది...

ఇలా మూలమూలకూ తెలిసిపోతుంది...


ఏరోజు కారోజు తోపుడుబండి ప్రస్తానం గురించి మన్యం మూలమూలకీ తెలిసిపోతుంది. మొదట 40 రోజుల యాత్రగా ప్రారంబించబడ్డ ఈ యాత్ర ప్రస్తుతానికి 100 రోజులకి పొడిగించబడింది.. ఇంకా..ఇంకా... ఎన్నిరోజులపాటు సాగుతుందో తోపుడుబండికి తప్ప మరెవ్వరికీ తెలియదు. నిజానికి తోపుడుబండిని తీసుకువెళ్తున్న సాధిక్ కి కూడా... నిజానికి ఎవరు ఎవరిని తీసుకుపోతున్నారు? తోపుడుబండి సాధిక్ నా లేక సాధిక్ తోపుడుబండినా? సాధిక్ చెప్పడు తోపుడుబండి చెప్పలేదు... ఇద్దరికీ ముందుకు సాగటం మాత్రమే తెలుసు... నిజానికి ఇప్పుడు వెళ్ళబోతున్న ప్రాంతాలు మరీ ఇంటీరిరియర్ గా ఉన్నాయి. ఇప్పటివరకూ ఏ స్వచ్చందసంస్థా ఈ ప్రాంతాలలోకి వెళ్ళలేదు... ఇప్పటివరకూ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాలవైపు దృష్టిసారించనూ లేదు... ఏమో..! ఇప్పుడు తోపుడుబండి అందరి దారీ ఇటే మార్చేందుకు బాటని వేసేపనిలో ఉందేమో....

భగీరథుడు ఆలా తపస్సు..

భగీరథుడు ఆలా తపస్సు..

భగీరథుడు 64 వేలమంది సగరకుమారులని బతికించటాకి ఘోర తపస్సు చేసి గంగని భూమిమీదకు దింపాడంటుంది పురాణం, లేదు.. స్వశక్తితో హిమాలయ సానువులనుంచీ కాలువ తవ్వి ఆ యఙ్ఞంలో లక్షలాదిమందిని చేర్చి శ్రమతో గంగానదిని మైదానాల్లోకి పారించాడంటుంది మేదావుల వాదన...

నిజమే...! శ్రమ ఎవరిదైతేనేం, ఎలా అయితేనేం.. గంగ భూమిని తాకింది... కొండలనీ, అడవులనీ దాటి ప్రవహించింది... రాళ్ళని తాకి గాయపడింది, కొండలమీదినించి దూకి ఆ వేదననీ భరించింది.. కానీ తన పరుగు ఆగలేదు... లక్ష్యం

మారలేదు... కోట్లాది జనాల భాదలనీ, మలినాన్నీ తుడిచిపెట్టి నిరంతరంగ సాగిపోతూనే ఉంటుంది... అయితే తాను తాకిన ప్రతీ రాయినీ, దూకిన ప్రతీలోయనీ సస్యశ్యామలం చేసిన భూములనీ...తనలో శుభ్రపడ్డ మనుషులనీ అది గుర్తుపెట్టుకోదు. నిరంతర స్రవంతి అలా సాగిపోతుంది కానీ తాను తాకిన ప్రతీ వస్తువూ గంగకి నమస్కరిస్తుంది... తన చుట్టూ ఉన్న నాగరికతని సంస్కరిస్తుంది... ఇప్పుడు తోపుడుబండీ అంతే. పుస్తకం ఇచ్చిన ప్రతీ పిల్లవాడూ తనకు గుర్తుండడు... కానీ ఆ పిల్లవాడికి ఒక్క పుస్తకం తన చేతుల్లో ఉంచిన తోపుడు బండి గుర్తుంటుంది...

ప్రతి పిల్లాడు ఇలా అయిపోతాడు..

ప్రతి పిల్లాడు ఇలా అయిపోతాడు..


ఇప్పుడు పుస్తకం అందుకున్న ప్రతీ పిల్లవాడి కలా ఒకటే తానే ఒక తోపుడు బండి అయిపోతాడు... పుస్తకాల ద్వారా తాను సంపాదించబోయే ప్రతీ ఙ్ఞానాన్నీ తన చుట్టూ ఉండే సమాజం కోసం వాడతాడు... అయితే ఆ పిల్లలతోబాటు అదేకలని కంటున్నాడు
సాధిక్.. ఏమో ఏదోఒకనాటికి ఈ పిల్లల కల నెరవేరొచ్చు... సాధిక్ అనుకున్న పని పూర్తి అవ్వొచ్చు అయితే అప్పుడు సాధిక్ మాత్రం ఆ పిల్లల దగ్గర ఉండకపోవచ్చు... ఎందుకంటే అతనికి కలలు కనటం ఇష్టం.. ఆ కలని పదిమందితో పంచుకోవటం ఇష్టం...
తోపుడుబండిని తోస్తూ అలా నడుస్తూ వెళ్ళిపోవటం ఇష్టం... అవును..! అతనూ ఒకనాడు వెళ్ళిపోతాడు మనలాగే, కానీ తోపుడుబండి మనదగ్గరకు అతని కలని మోసుకుంటూ వస్తూనే ఉంటుంది.....

ఏదైనా చేయాలని ఎవరైనా

ఏదైనా చేయాలని ఎవరైనా

మనలో కొందరం వెళ్ళాలని ఉన్నా సాధిక్ తోపాటు వెళ్లలేకపోవచ్చు, తోపుడుబండితో కలిసి నడవాలనున్నా అది సాధ్యం కాకపోయే పరిస్తితుల్లో ఉండక పోవచ్చు, కానీ....! మీరు ఏదైనా చేయాలనుకుంటే... ఈ అక్షర ఉధ్యమంతో చేయి కలపాలనుకుంటే.., సాధిక్ కి ఒక్క కాల్ చేయండి... మీదగ్గర ఉన్న పుస్తకాలు, మీరు ఇవ్వదలిచిన పుస్తకాలు అతని చేతుల్లో పెట్టండి... మీ పుస్తకం అడవిలోకి వెళుతుంది..ఇప్పటివరకూ మీరు చూడని ఒక గిరిజన చిన్నారి చేతిలో మిమ్మల్ని పెడుతుంది... ఆ పసి చేతుల స్పర్శ మిమ్మల్ని తాకుతుంది. మీ సందేశాన్ని అడవిలో వినిపించే ఒక పావురంలా తోపుడుబండి మీరిచ్చిన పుస్తకాన్ని మోసుకు పోతుంది...
ఒక్క ఆలోచన మిమ్మల్ని ఈ అక్షర ఉధ్యమంలో భాగస్వామిని చేరుస్తుంది.. మీరుచేయాల్సిందల్లా ఒకే ఒక్క పని.... 9346108090 ఈ నంబర్కి కాల్ చేయండి. సమయమేదైనా.... మీ కాల్ రిసీవ్ చేసుకోబడుతుంది.. "ఆ చెప్పండి భయ్యా" అన్న ఒక గొంతు వినిపిస్తుంది. ఎంత మాట్లాడినా విసుగు ఉండదు.. మీరు ఇచ్చేది పాతపుస్తకమైనా తిరస్కరణ ఉండదు.. మీరిచ్చే పుస్తకం కోసం తోపుడుబండిలో స్థలం ఎప్పుడూ ఉంటుంది....

(తోపుడు బండి సాధిక్ అలీ "అడవితల్లికి అక్షరతోరణం" యాత్ర సందర్భంగా)

English summary
Sadiq Ali with books on push Cart (topudu Bandi) has begun his Akshara Toranam Yatra in Tribal areas of Telangana to supply books to the children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X