ముగ్గురు హీరోలు: రాజకీయాలు

ఈ ఇద్దరు హీరోల తర్వాత మాస్ ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు హీరోలు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు. చిరంజీవి, బాలకృష్ణల రాజకీయ పాత్రలతో వారి ముగ్గురు రాజకీయ పాత్రలపై విపరీతమైన ప్రచారం జరుగుతున్నది. సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు కొన్ని మంచి హిట్లు లభించాయి. స్వర్గీయ ఎన్టీఆర్ వాచకాన్ని, ముఖకవళికలను కలిగి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్ బాబుకు యువతలో ఎనలేని క్రేజ్ ఉంది. ఈ ముగ్గురు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించదలుచుకుంటే మూడు పార్టీలకు ప్రచారం చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లోకి దిగితే సినిమా కెరీర్ వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంది. వీరు ముగ్గురు రాజకీయాలనో, సినిమాలనో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సిన ఆగత్యంలో పడ్డారు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికి తన రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించారు. యువతను ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా కూడగట్టేందుకు ఆయన రంగంలోకి దిగారు. రోడ్ షోలు నిర్వహిస్తూ అన్నయ్య చిరంజీవి కోసం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. అన్నయ్య అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోతాయని చెబుతున్నారు. ఆ రాజకీయాల్లో పీకల దాకా మునిగిపోవడంతో ఆయన హీరోగా నటిస్తున్న పులి సినిమా నిర్మాణం కుంటుపడింది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ ఎన్నికలు పూర్తయ్యే దాకా కూడా ఆ సినిమాకు మోక్షం లభించే అవకాశం లేదని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని గద్దెనెక్కించాల్సిన ప్రధాన కర్తవ్యం ఆయన భుజస్కంధాల మీద కూడా పడింది. దీంతో ఆయన రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తూ పులి సినిమా నిర్మాణాన్ని పక్కన పెడుతున్నారు.
ఇక, జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే - తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర నిర్వహించాలనే ఆసక్తి ఆయనకు మెండుగానే ఉంది. కానీ, నందమూరి వంశంలోని రాజకీయాలు ఆయనను వెనక్కి తగ్గేలా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణ్ రామ్, తారకరత్నలు ఆయనకు రాజకీయాల్లో పోటీగా మారిపోయారు. గన్నవరం సీటు విషయంలో కళ్యాణ్ రామ్ తో ఆయనకు విభేదాలు పొడసూపినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ఆయన సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆయన ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సినిమాను పూర్తి చేయడానికే ఆయన ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటే సినిమా కెరీర్ పై ప్రభావం పడుతుందని, తాను సినిమాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నానని ఎన్టీఆర్ తన మామ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు చెప్పారు. అయితే, తనకు తగిన ప్రాధాన్యం లభిస్తే తెలుగుదేశం పార్టీకి పెద్ద యెత్తున ప్రచారం చేయడానికి వెనకంజ వేయబోరని అంటున్నారు. ఏమైనా రాజకీయాల్లో నెంబర్ వన్ కావడానికి ఆయనకు అనేక అడ్డంకులున్నాయి. ఈ అడ్డంకులను సినిమాల్లో తన స్థానాన్ని పూర్తిగా ఖరారు చేసుకోవడం ద్వారా తొలగించుకునే అవకాశం లేకపోలేదు.
ఇకపోతే, మహేష్ బాబు - ఈయనకు రాజకీయాల పట్ల పెద్ద ఆసక్తి ఉన్నట్లు కనిపించదు. కానీ, తండ్రి సూపర్ స్తార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. కాంగ్రెసు పార్టీకి ప్రచారం చేయడానికి సిద్ధపడుతున్నారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కాంగ్రెస్ కు మద్దతుగా ఇప్పటికే కృష్ణ, మహేష్ సేన సభ్యత్వ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సేన కాంగ్రెసు కోసం పనిచేస్తుంది. అవసరమైతే మహేష్ ను కూడా ప్రచారానికి దించుతామని ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. అయితే మహేష్ పెద్దగా ఆసక్తి చూపడం లేదనే మాట వినిపిస్తున్నది. మహేష్ సినిమా కెరీర్ కే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెసు నుంచి మహేష్ పై తీవ్రమైన ఒత్తిడి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాడు.
మొత్తం మీద, ముగ్గురు యువ హీరోలను కూడా రాష్ట్ర రాజకీయాలు తాకుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో ఈ యువ హీరోలను కూడా రాజకీయం పలుకరిస్తున్నది.












Click it and Unblock the Notifications
