సోనియా మోసం చేశారా?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అసాధ్యమనే భావనతో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు తెలంగాణ అంశాన్ని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక (సిఎంపి)లో చేర్చినప్పుడు గానీ రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించినప్పుడు గానీ వారు పెద్దగా పట్టించుకోలేదు. పైగా చాలా తేలిగ్గా తీసుకున్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ చెబుతూ పబ్బం గడుపుకునే ఎత్తుగడనే సాగుతూ ఉంటుందని వారు భావించారు. ఇదే నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రతిపాదిస్తే బలపరుస్తామని చెప్పారు. యుపిఎ ప్రభుత్వం ప్రకటన చేసేసరికి దిక్కు తోచక అసలు రంగు బయట పెట్టుకున్నారు. తమ అవకాశవాద రాజకీయాల ముసుగును తొలగించుకున్నారు.
కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోదనే అతి విశ్వాసానికి కారణం లేకపోలేదు. ఓట్ల కోసం చెప్పే మాటలు అమలు కావనేది వారి అతి ధీమా. నిజానికి, తెలంగాణవాదులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమవుతుందని అనుకోలేదు. వీరు కూడా ఇదే అభిప్రాయంతో ఉండడానికి కారణం పైదే. కానీ, ఇటీవలి కాలంలో కాంగ్రెసు సంస్కృతి మారిందనే విషయం ఎవరి అంచనాకు అందడం లేదు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, రాహుల్ గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెసు సంస్కృతిలో చాలా తేడా వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పదే పదే అంటూ వస్తున్న విశ్వసనీయత సాధించడమనేది కాంగ్రెసు అధిష్టాన వర్గంలో చోటు చేసుకుంది. తాము అన్యాయానికి గురవుతున్నవారి తరఫున ఉంటామని చెప్పడానికే కాదు, అందుకు తగిన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం ముందుకు వస్తోంది. ఇందులో రాహుల్ గాంధీ పాత్ర చాలా ఉంది.
విశ్వసనీయత సాధించుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా పార్టీని పటిష్టం చేయాలనేది రాహుల్ గాంధీ ఉద్దేశం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటేనే ఆ విశ్వసనీయత చేకూరుతుంది. పైగా కాంగ్రెసు జాతీయ నాయకత్వం పలు విషయాల్లో గతంలో చేసిన తప్పుల దిద్దుబాటుకు దిగింది. సిక్కుల ఊచకోతకు విచారం వ్యక్తం చేయడం, బాబ్రీ మసీదు కూల్చివేతలో తమ మాజీ ప్రధాని పివి నరసింహారావు ఉదాసీనతను తప్పు పట్టడం వంటివి ఇందుకు ఉదాహరణలు. తమ పార్టీలో ఈ మార్పును గమనించని కోస్తాంధ్ర, రాయలసీమ నేతలు నిజంగానే తెలంగాణ విషయంలో మోసపోయారు.












Click it and Unblock the Notifications