వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ను పట్టుకోవడమెలా?

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
మహాకూటమిలో భాగస్వామిగా ఉంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కట్టి పడేసి ఉంచడం తెలుగుదేశం పార్టీకి కష్టంగానే ఉంది. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఎప్పుడైనా తోక జాడించవచ్చుననే ఆందోళన తెలుగుదేశం పార్టీలో గుబులు రేపుతోంది. అధికారం చేపట్టడానికి స్పష్టమైన మెజారిటీ రాదని భావిస్తున్న సమయంలో కెసిఆర్ తీరు తెలుగుదేశం పార్టీకి, వామపక్షాలకు మింగుడు పడడం లేదు. తెలంగాణ కోసం ఏ పార్టీతోనైనా కలవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కెసిఆర్ చేసిన ప్రకటనతో రాజకీయ సమీకరణాల మార్పునకు పాదులు వేసింది.

మహాకూటమికి 170 దాకా శాసనసభ సీట్లు వస్తాయని సోమవారం సాయంత్రం సమావేశమైన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో అంచనా వేసింది. ఈ అంచనా ప్రకారం చూసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం లేదు. తెరాసకు 25 నుంచి 30 శాసనసభా స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు 15 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు అంచనా. తెరాసకు కనీసం 25 సీట్లు వస్తాయని అంచనా వేసినా తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన 148 సీట్లు వచ్చే అవకాశాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఎక్కువలో ఎక్కువగా 130 సీట్ల వద్ద ఆగిపోవచ్చు. ఈ స్థితిలో వామపక్షాలకు 18 నుంచి 20 సీట్ల దాకా వస్తే ఢోకా ఉండకపోవచ్చు. లేకపోతే తెరాస మద్దతు తెలుగుదేశం పార్టీకి అనివార్యమవుతుంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి మరో ప్రమాదం కూడా ఉంది. అవే లెక్కలు నిజమైతే కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలకు కలిపి 124 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా తెరాస అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. జాతీయ స్థాయిలో అవగాహన పేర తెరాస కాంగ్రెసు గూటికి చేరితే చంద్రబాబుకు కష్టాలు ఎదురు కావచ్చు. ఈ ఆందోళన కూడా చంద్రబాబుకు ఉందని అంటున్నారు.

తృతీయ కూటమిలో కెసిఆర్ కచ్చితంగా ఉంటారని చెప్పడానికి కూడా వీలు లేని వాతావరణం ఉంది. తెలంగాణకు అనుకూలంగా తృతీయ కూటమి కచ్చితంగా ముందుకు రావడం అనుమానమే. తెలంగాణకు అనుకూలంగా ఇప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకోని సిపిఎం ఆ కూటమికి నాయకత్వం వహిస్తోంది. బిజెపిని, కాంగ్రెసును అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా సిపిఎం పావులు కదుపుతోంది. దానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక అంశంగా కూడా కనిపించకపోవచ్చు. దీంతో కెసిఆర్ మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోక తప్పదు. అందుకే తెలంగాణకు మద్దతు కూడగట్టడానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ, బిజెపి నేత ఎల్ కె అద్వానీతోనూ మాట్లాడడానికి ఆయన ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. కారణాలు తెలియదు కాదు, ఆయన ఢిల్లీ పర్యటన ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.

తెలంగాణ ఏర్పాటుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. అయితే, ఆ మాటకు తెలుగుదేశం పార్టీ ఏ మేరకు కట్టుబడి ఉంటుందనేది కచ్చితంగా చెప్పలేం. తెలంగాణ వ్యతిరేకత విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి చంద్రబాబు ఏమీ తీసిపోరు. అనివార్యమైన పరిస్థితిలోనే, అధికారం కోసమే చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ స్థితిలో అధికారం చేజిక్కించుకున్న తర్వాత రకరకాల కారణాలతో తెలంగాణ అంశాన్ని దాటవేసే అవకాశాలు కూడా లేకపోలేదు. తృతీయ కూటమితో కెసిఆర్ ఉంటే జరిగే ప్రమాదం అదే. అందువల్ల కేంద్రంలో అవసరమైతే తెలంగాణకు అనుకూలంగా పనికి వచ్చే కూటమిలోకి చేరుకోవడమే కెసిఆర్ ముందున్న ఆలోచనగా భావించవచ్చు. ఈ స్థితిలో కెసిఆర్ పూర్తి హామీ ఇవ్వడానికి సిపిఎంను కూడా తెలంగాణకు అనుకూలంగా కదిలించాల్సిన అవసరం బహుశా చంద్రబాబు చేతిలోనే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X