• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎవరీ 'గాలీ'?

By Pratap
|

Gali Janardhan Reddy
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడాపై జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలో, కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పపై తిరుగుబాటు జరిగిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వానికి వైయస్ జగన్ పక్కలో బల్లెంలా మారిన పరిస్థితిలో ఓబుళాపురం గనుల వ్యవహారంపై దుమారం చెలరేగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం సహా ప్రతిపక్షాలు ఓబుళాపురం గనుల అక్రమాలపై తీవ్ర స్థాయిలో గళమెత్తుతున్నాయి. ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బులతో మైనింగ్ మాఫియా రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మధు కొడా ఏ పార్టీకీ చెందనివాడు కాబట్టి ప్రభుత్వం చర్యలకు దిగిందని, గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ ప్రధాన పార్టీలకు చెందిన వారు కాబట్టి కాంగ్రెసు ప్రభుత్వాలు చర్యలకు దిగడం లేదని, గనుల అక్రమాలపై బిజెపి గొంతెత్తడం లేదని అనుకుంటున్నారు.

కర్నాటక రాజకీయాలనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా కుదిపే స్థాయికి చేరుకుని, అటు బిజెపి కేంద్ర నాయకత్వాని, ఇటు కాంగ్రెసు నాయకత్వాన్ని ఎదిరించే స్థాయికి ఆ మాఫియా ఎదిగిందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇంతగా ప్రభావితం చేస్తున్న గాలి జనార్దన్ రెడ్డి ఎవరు, ఎలా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.

బిజెపి కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదగడానికి గాలి జనార్దన్ రెడ్డి సోదరుల ప్రయత్నం చాలా ఉంది. కరుణాకర, సోమశేఖర, జనార్దన్ రెడ్డి సోదరులే కాకుండా వారికి అత్యంత నమ్మిన బంటు అయిన శ్రీరాములు బిజెపిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అందుకే ఆ నలుగురిలో సోమశేఖరకు తప్ప మిగతా ముగ్గురికి యెడ్యూరప్ప మంత్రివర్గంలో స్థానం లభించింది. కర్నాటక శాసనసభ ఎన్నికల్లో 110 సీట్లు సాధించిన బిజెపికి మరో ఆరుగురు స్వతంత్రుల మద్దతు కూడగట్టిన ఘనత కూడా గాలి జనార్దన్ రెడ్డిదే.

గాలి సోదరుల ప్రాబల్యం బళ్లారికి మాత్రమే కాకుండా దేవంగిరే, గడగ్, హవేరీలకు కూడా పాకింది. ఈ జిల్లాల్లో బిజెపి 27 సీట్లకు పోటీ చేయగా 23 సీట్లు గెలిచింది. ఇందులో ఐదు సీట్లు రెడ్డి కుటుంబ సభ్యులు గెలుచుకున్నారు. వారి కుటుంబ సన్నిహితులు బి. నాగేంద్ర, టిహెచ్ సురేష్ బాబు కూడా గెలిచారు. గాలి సోదరులకు అత్యంత సన్నిహితుడైన శ్రీరాములు కూడా గెలిచారు. పోలీసు కానిస్టేబుల్ కుమారులైన గాలి సోదరులు కర్నాటక రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. వారు తొలుత ఎన్నోబుల్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ను గాలి సోదరులు ప్రారంభించారు. అది 200 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో ఇరుక్కుంది. దాంతో దాన్ని మూసేసినట్లు చెబుతారు. ఈ సమయంలో శ్రీరాముల స్థానిక రాజకీయాల్లో ముందుకు వచ్చారు. 1999 లోకసభ ఎన్నికల్లో తామేమిటో గాలి సోదరులు ప్రదర్శించుకున్నారు. బళ్లారి సీటులో సోనియా గాంధీపై బిజెపి సుష్మా స్వరాజ్ ను పోటీకి దించింది. ఈ సమయంలో సుష్మా స్వరాజ్ కు వారు విశ్వాస పాత్రులుగా మారారు.

కాంగ్రెసుకు కంచుకోట అయిన బళ్లారిలో బిజెపి ప్రాబల్యం కోసం గాలి సోదరులు నిరంతరం శ్రమించారు. 2001లో జరిగిన బళ్లారి నగర పాలక సంస్థ ఎన్నికల్లో తమ ఉనికిని చాటారు. ఈ ఊపు కొనసాగుతూ వచ్చింది. 2004 ఎన్నికల్లో మూడు శాసనసభా స్థానాలు గెలుచుకున్నారు. ఆ తర్వాత 1952 నుంచి కాంగ్రెసుకు కంచుకోటగా ఉన్న బళ్లారి లోకసభ ఎన్నికల్లో గాలి కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత క్రమంగా తమ పట్టును సాగిస్తూ ఇటీవలి ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. చివరకు ఆ ప్రభుత్వాన్నే శాసించే స్థాయికి చేరుకున్నారు. ఇదంతా ఓబుళాపురం మైనింగ్ వల్లనే సాధ్యమైందనే ప్రతిపక్షాల విమర్శ. దాని ద్వారా సంపాదించిన అక్రమార్జన ద్వారా రాజకీయాలను గాలి సోదరులు శాసిస్తున్నారనేది వారి అభిప్రాయం. రాజకీయాల్లో పట్టు సంపాదించడం ద్వారా అధికార యంత్రాంగాన్ని తమ చెప్పుచేతుల్లోకి తెచ్చుకుని తమ కార్యకలాపాలను యధేచ్చగా సాగించారనేది వారి ప్రధాన అభ్యంతరం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X