డర్టీ పొలిటిక్స్

రాజశేఖర రెడ్డి ఆలోచనలు ఎరిగిన నేత జగన్ అని, తన తండ్రి వదిలిపెట్టిన ఎజెండాను జగన్ మాత్రమే పూర్తి చేయగలడని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తమ స్థానాలను కాపాడుకోవడానికే రాజశేఖర రెడ్డి విధేయులు ఈ విధమైన ప్రచారాన్ని చేస్తూ ఒత్తిడి రాజకీయాలకు తెర తీశారని విశ్లేషకుల భావన. భట్టి విక్రమార్క మాత్రమే కాకుండా పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి వంటి వారు కూడా వైయస్ రాజశేఖర రెడ్డి భౌతిక కాయం అక్కడ ఉండగానే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ మాట్లాడారు. ఈ స్థితిలో సోనియా గాంధీ సలహాదారు అహ్మద్ పటేల్ ఓ ప్రకటన చేయాల్సి వచ్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి ప్రకటించిన సంతాప దినాలు ముగిసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి గురించి ఆలోచిస్తామని ఆయన చెప్పారు. నిజానికి యాక్టింగ్ ముఖ్యమంత్రిగా జగన్ నే నియమించాలని కోరుతూ వారు గవర్నర్ ను కోరాలని అనుకున్నారు. అయితే వారు సంతకాలు సేకరించి గవర్నర్ ను కలిసే సరికే రోశయ్య ప్రమాణ స్వీకారం చేశారు.
తమ అభిమాన నేత వైయస్ భౌతిక కాయాన్ని చూడడానికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద వేలాది మంది అభిమానులు ఆతురతగా ఎదురు చూస్తున్న సమయంలోనే మంత్రులు, 22 మంది పార్లమెంటు సభ్యులు, పలువురు కాంగ్రెసు శాసనసభ్యులు వైయస్ జగన్ ముఖ్యమంత్రి నినాదాన్ని వినిపించారు. గురువారం సాయంత్రం వారంతా కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిశారు. అంతేకాకుండా రోశయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొద్ది నిమిషాలకే 122 మంది కాంగ్రెస్ సభ్యుల సంతకాలతో గవర్నర్ ఎన్డీ తివారీకి ఒక వినతిపత్రం సమర్పించారు. రోశయ్యనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారని, నాయకత్వ సమస్యను అధిష్ఠాన వర్గం త్వరలో పరిష్కరిస్తుందని వీరప్ప మొయిలీ వైయస్ అనుచరులకు చెప్పినట్లు సమాచారం.
ఈ స్థితిలో జగన్ పేరును పరిగణనలోకి తీసుకుంటామని పార్టీ అధిష్ఠానవర్గం చెప్పినట్లు కూడా వార్తలు ప్రసారమయ్యే దాకా పరిస్థితి వెళ్లింది. అయితే కాంగ్రెసు అధిష్ఠాన వర్గం రోశయ్య పేరుతో పాటు కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, పల్లంరాజు, ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజానికి, డి. శ్రీనివాస్, వి హనుమంతరావు, కె. కేశవరావు వంటి వాళ్ల పేర్లు కూడా ముఖ్యమంత్రి పదవికి వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications