బాలయ్య వచ్చేస్తున్నట్లేనా?

సింహ విజయంతో బాలకృష్ణలో ఉత్సాహం ఇనుమడించింది. పైగా, బాలయ్యకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. వీటిలో దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు బాలయ్యతో నిర్మించే తన 150వ చిత్రం మరీ ప్రత్యేకం కానుంది. స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టడానికి ముందు దాసరి నారాయణరావు ఆయనకు బొబ్బులిపులి సినిమా ద్వారా పెద్ద హిట్ ను ఇచ్చారు. బాలయ్య విషయంలో కూడా ఆ సెంటిమెంటు పని చేస్తున్నట్లు ఉంది. దాసరి నారాయణ రావు నిర్మించే చిత్రం ద్వారా సినిమాల్లో అతి పెద్ద హిట్ కొట్టి రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రావాలని ఆయన ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, బాలయ్య వస్తే చంద్రబాబు పక్కకు వెళ్లిపోతారా అనేది ప్రశ్న. అయితే, ఈ ప్రశ్నకు కూడా సమాధానం లభించబోతోంది. చంద్రబాబు సమ్మతితోనే బాలయ్య తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని చేపట్టబోతారనేది తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రకాశ్ రెడ్డి టీవీ చానెల్ కార్యక్రమంలో చెప్పారు. వచ్చే ఎన్నికల లోగా రాష్ట్రం విడిపోతుందని భావిస్తున్నఆయన బాలయ్య వస్తే చంద్రబాబు తప్పుకోవాల్సి వస్తుందనే మాటలో నిజం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా రూపుదిద్దుకుంటుందని, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని, బాలయ్య రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని తీసుకుంటారని ఆయన అంటున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు హయాంలోనే తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఇప్పుడు అది కార్యరూపం ధరిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, బాలయ్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తన చేతిలోకి తీసుకోవడానికి రంగం సిద్ధమవుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications