బాబు వర్సెస్ వైయస్ జగన్

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో వివిధ రూపాల్లో వైయస్ జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. వారికి రామోజీ రావు నేతృత్వంలోని ఈనాడు దినపత్రిక అండగా నిలుస్తోంది. వైయస్ జగన్ వివిధ అనుమతుల విషయంలో వైయస్ పాలనలో అధికారాన్ని వాడుకున్నారో, ఎలా ఆస్తులు వెనకేసుకున్నారో తెలుపుతూ ఈనాడు దినపత్రిక వరుస వార్తాకథనాలను ప్రచురిస్తోంది. అటు చంద్రబాబును, ఇటు రామోజీని తప్పు పడుతూ, వారిపై దుమ్మెత్తి పోస్తూ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక కౌంటర్ కథనాలను ప్రచురిస్తోంది.
ప్రస్తుతం సాగుతున్న చంద్రబాబు, జగన్ పోరులో సంపాదనల గొడవనే ప్రధానంగా ఉంది. ప్రజాసమస్యలకు ఎక్కడా చోటు లభించడం లేదు. ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల నాటికి వైయస్ జగన్ తమకు ప్రధాన ప్రత్యర్థి అవుతుందని భావించడం వల్లనే చంద్రబాబు తన డైరెక్షన్ మార్చినట్లు భావిస్తున్నారు. ఈ మారిన డైరెక్షన్ మేరకు వైయస్ జగన్ ను టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు. అయితే వీరిద్దరికి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కొరకరాని కొయ్యగా మారారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టడం వైయస్ జగన్ కు అంత సులభమయ్యే అవకాశాలు లేవు. అదే సమయంలో తెలంగాణలో పర్యటించడం చంద్రబాబుకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. వీరిద్దరి ఉమ్మడి శత్రువు కూడా కెసిఆర్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications