జగన్ ను వైయస్ తో పోల్చవచ్చా?

YS Jagan
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పుల్లో కాళ్లు పెట్టాలని అనుకుంటున్నారు. అందు కోసమే ఆయన రాజకీయాలు నడుపుతున్నారు. రాజశేఖర రెడ్డి నిత్య అసమ్మతి నేతగా పేరు సంపాదించుకుని సుదీర్ష కాలం తర్వాత అధికార నేతగా అవతరించారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో ఆయన ప్రతి ముఖ్యమంత్రి మీద వైయస్ రాజశేఖర రెడ్డి తన అసమ్మతిని వ్యక్తం చేస్తూనే వచ్చారు. విజయభాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఆయన తన స్వరాన్ని మార్చుకోలేదు, అసమ్మతి రాజకీయాలకు స్వస్తి చెప్పలేదు. దానివల్లనే ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కలేదు. అయినా ఆయన తన ధోరణి మార్చుకోలేదు. అయితే, అసమ్మతి రాజకీయాలు నడుపుతూ రాష్ట్ర నాయకత్వానికి కొరకరాని కొయ్యగా తయారైనప్పటికీ అధిష్టానం మీద తన వ్యతిరేకతను, నిరసనను ప్రదర్సించలేదు. అధిష్టానంలో ఆయనకు ఒక వర్గం అండదండలు ఉంటూ వచ్చాయి. దానికితోడు, కాంగ్రెసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళనలు చేపట్టారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేపట్టిన ఆందోళనలే కాంగ్రెసుకు ప్రాణం పోశాయి.

ఎన్టీ రామారావు హంద్రీ నీవా తదితర రాయలసీమ ప్రాజెక్టులను చేపట్టినప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పోరాటాలు నడిచాయి. ఆ ప్రాజెక్టులకు నికర జలాలు కావాలంటూ పెద్ద యెత్తున ఆందోళనలు జరిగాయి. రాయలసీమ శాసనసభ్యులు, నాయకులు ఈ పోరాటంలో రాజశేఖర రెడ్డి వెంట పెద్ద యెత్తున కదిలి వచ్చారు. రాయలసీమ ప్రాజెక్టులను కృష్ణా మిగులు జలాల మీద ఆధారపడి నిర్మిస్తున్నారని, అందువల్ల రాయలసీమకు జలాల గ్యారంటీ ఉండదని, నికర జలాలు కేటాయించాల్సిందేనంటూ ఆయన ఆ పోరాటానికి పదును పెట్టారు. ఆ సమయంలో తెలంగాణ నాయకుల నుంచి ఆయనకు వ్యతిరేకత ఎదురు కాలేదు. కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రం ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి పదవిపై తాను కన్నేసినట్లు వైయస్ ఏ రోజు కూడా కనిపించలేదు. తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్నట్లు కనీసం సూచన కూడా చేయలేదు. అలా ఇతరులు అనుమానించే అవకాశం కూడా రాకుండా చూసుకున్నారు.

ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉండడమే కాకుండా జగన్ ఎత్తుగడలు కూడా సరిగా ఉన్నట్లు లేదు. జగన్ ప్రారంభమే చాలా తప్పుడు పద్ధతిలో జరిగింది. తండ్రి మరణించిన వెంటనే ముఖ్యమంత్రిని తానే కావాలనే ఆశను జగన్ నోరు తెరిచి అడగలేదు. కానీ ఆ ఆశ ఉన్నట్లు మాత్రం బయటపడ్డారు. ముఖ్యమంత్రిని కావాలని ఉందని నోరు తెరిచి అడిగానా అని జగన్ ముఖ్యమంత్రి రోశయ్యను ప్రశ్నించారు గానీ ఆ విషయంలో బయట పడకుండా మాత్రం ఉండలేకపోయారు. జగన్ అసమ్మతి రాజకీయాలు కూడా సరైన దిశలో లేవు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర నాయకులపై జగన్ అసమ్మతి రాజకీయాలు నడుపుతున్నట్లు చూపించాలనే ప్రయత్నాలు కూడా అంతగా ఫలించడం లేదు. తాను మాట్లాడుతున్న సందర్భంలో సోనియా, మన్మోహన్ ల పేర్లను ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి రావడానికి అంతా తన తండ్రి వైయస్ చలువేనని చాటుతున్నారు. ఇది అధిష్టానాన్ని ధిక్కరించే ధోరణిగానే, ఏక పక్ష వ్యవహారంగానే కనిపిస్తోంది. ఇది జగన్ ను అధిష్టానం సహించే వైఖరి కాదు. తర్వాత వైయస్ లా సుదీర్ఘ కాలం నిరీక్షించే ఓపిక జగన్ కు లేనట్లు అనిపిస్తోంది. అందువల్లనే ఆయన విపరీతంగా తొందరపడుతున్నారు. దాని వల్ల తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. దానికితోడు, కాంగ్రెసు అధినాయకత్వం మునుపటిలా లేదు. అసమ్మతి రాజకీయాలు నడిచినప్పుడు అధిష్టానం గతంలో తరుచుగా ముఖ్యమంత్రులను మారుస్తూ వచ్చేది. ఆ సంప్రదాన్ని సోనియా గాంధీ బద్దలు కొట్టారు. అసమ్మతి రాజకీయాలకు తలొగ్గడానికి బదులు దాన్ని అణచివేసే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది కూడా జగన్ కు మైనస్ పాయింట్ అవుతుంది.

ఇకపోతే, జగన్ తెలంగాణలోని పార్టీ నాయకుల నుంచి చాలా తక్కువ మద్దతు లభిస్తోంది. కొండా సురేఖ, బాజీ గోవర్దన్ లాంటి ఒకరిద్దరు నాయకుల నుంచి తప్ప ఆయనకు క్రియాశీలక మద్దతు లభించడం లేదు. గతంలో వైయస్ కు పక్కా అనుచరులుగా ఉన్నవాళ్లు కూడా తమ వైఖరిని మార్చుకుని, అధిష్టానం మార్గం పడుతున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కూడా ఓ కారణం. జగన్ పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా స్పందించడంతో తెలంగాణ నాయకులు ఆయనకు మద్దతు పలికి తెలంగాణ ప్రజలను దూరం చేసుకోవడానికి వారు సిద్ధంగా లేరు. వీరు ఇలా ఉంటే తెలంగాణ సీనియర్ నాయకులు జగన్ పై తీవ్రంగా విమర్శనా దాడులు చేస్తున్నారు. ఈ స్థితిలో వైయస్ లా ఏదో ఒకనాడు జగన్ కాంగ్రెసు పార్టీలో ఉంటూ అధికారం చేజిక్కించుకోగలరని చెప్పడానికి కూడా వీలు లేకుండా పోయింది. వేరే పార్టీ పెట్టి గెలుస్తారా అనేది కూడా సందేహమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+