భూమికి దూరమవుతున్న చంద్రుడు! 60 కోట్ల ఏళ్ల తర్వాత..
రాత్రి వేళ ఆకాశంలో ఎంతో అందంగా, దగ్గరగా కనిపించే చందమామ.. నిజానికి మనకు క్రమక్రమంగా దూరమైపోతున్నాడని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఏటా మన గోళ్లు ఎంత వేగంగా పెరుగుతాయో, అంతే వేగంగా చందమామ భూగోళానికి దూరంగా జరిగిపోతున్నాడు.
ఏడాదికి సగటున 3.83 సెంటీమీటర్ల చొప్పున చందమామ భూమికి దూరంగా జరుగుతున్నట్లు అంతరిక్ష పరిశోధకులు అత్యంత కచ్చితత్వంతో లెక్కించారు. కోట్ల సంవత్సరాల క్రమంలో సాగుతున్న ఈ అంతరిక్ష వింత వల్ల భవిష్యత్తులో భూగోళంపై ఊహించని మార్పులు సంభవించనున్నాయి.

లేజర్ సాంకేతికతతో పక్కా కొలతలు
చంద్రుడు మనకు దూరమవుతున్నాడనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఏదో ఊహించి చెప్పడం లేదు. 1969 నుంచి 1971 మధ్య జరిగిన అపోలో ప్రయోగాల సమయంలో శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలంపై ప్రత్యేకమైన మిర్రర్ రేంజింగ్ ప్యానెల్స్ అమర్చారు. భూమిపై ఉన్న శక్తివంతమైన లేజర్ టెలిస్కోప్‌ల ద్వారా ఆ అద్దాలపైకి కాంతి కిరణాలను పంపి, అవి తిరిగి భూమికి చేరడానికి పట్టే సమయాన్ని పికోసెకన్లలో గణించి దూరంలో వస్తున్న మార్పులను పక్కాగా కనిపెట్టారు. మనుషుల ఆయుర్ధాయం లెక్కన చూస్తే ఈ మార్పు పెద్దగా కనిపించకపోవచ్చు గానీ, ఖగోళ కాలమానం ప్రకారం ఇది భూమిపై తీవ్ర ప్రభావమే చూపుతుంది.
అసలు చంద్రుడు ఎందుకు దూరమవుతున్నాడు?
భూమి తన అక్షం చుట్టూ తిరిగే వేగానికి, చంద్రుడు భూమి చుట్టూ తిరిగే వేగానికి మధ్య ఉన్న వ్యత్యాసమే దీనికి ప్రధాన కారణం. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడితే, చంద్రుడు భూమిని చుట్టి రావడానికి 27.3 రోజులు పడుతుంది. ఈ క్రమంలో భూమిపై ఉన్న సముద్రాల్లో చంద్రుడి గురుత్వాకర్షణ వల్ల కెరటాలు వస్తాయి. భూమి వేగంగా తిరగడం వల్ల ఈ అలల ఉప్పెన చంద్రుడిని ముందుకు లాగినట్లు అయి, చంద్రుడికి కొంత శక్తి లభిస్తుంది. ఈ అదనపు శక్తి వల్ల చంద్రుడు భూమి గురుత్వాకర్షణ నుంచి కొద్దికొద్దిగా బయటకు తప్పుకుంటూ పై కక్ష్యలోకి జరుగుతున్నాడు.
భూమిపై పడే ప్రతికూల ప్రభావాలు ఇవే!
చంద్రుడు దూరమవ్వడం వల్ల రాబోయే కోట్ల సంవత్సరాలలో భూమిపై మూడు ప్రధాన మార్పులు వస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు..
పెరగనున్న రోజు
చంద్రుడు దూరమవుతున్న కొద్దీ భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం తగ్గుతుంది. ఫలితంగా భూమిపై రోజు సమయం పెరుగుతుంది. వంద కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై ఒక రోజు నిడివి కేవలం 19 గంటలు మాత్రమే ఉండేది. భవిష్యత్తులో ఇది 24 గంటల కంటే మరింత పెరగనుంది.
కనుమరుగు కానున్న గ్రహణాలు
ప్రస్తుతం సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో ఒకే పరిమాణంలో కనిపిస్తుండటం వల్లనే మనకు సంపూర్ణ సూర్యగ్రహణాలు సాధ్యమవుతున్నాయి. కానీ చంద్రుడు దూరమయ్యే కొద్దీ పరిమాణంలో చిన్నగా కనిపిస్తాడు. మరో 60 కోట్ల సంవత్సరాల తర్వాత భూమిపై సంపూర్ణ సూర్యగ్రహణం అనేదే కనిపించదు.
క్షీణించనున్న సముద్రపు అలలు
భూమికి చంద్రుడికి మధ్య దూరం పెరిగే కొద్దీ ఆకర్షణ శక్తి తగ్గి సముద్రాల్లో వచ్చే అలల తీవ్రత బాగా తగ్గిపోతుంది సముద్ర తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలు, జలచరాల పునరుత్పత్తి చక్రం దెబ్బతినే ప్రమాదం ఉంది.
భూమి రూపుదిద్దుకున్న నాటి నుంచి మొదలైన ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కోట్లాది సంవత్సరాల కాలక్రమంలో ఈ మార్పులు భూగ్రహపు పర్యావరణాన్ని, కాలాన్ని గణనీయంగా మార్చివేస్తాయని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications