Jananayagan Review:విజయ్ ఆఖరి సినిమా దెబ్బేశాడే..!
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జననాయగన్' (తెలుగులో జననాయకుడు) నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. హెచ్-వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం ఓ సినిమాగా మాత్రమే కాకుండా విజయ్ సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ.. విజయ్ పొలిటికల్ కెరీర్ కు స్వాగతం పలుకుతున్న ఓ పెద్ద ఫ్యాన్ ఫెస్టివల్ లా ఉంది. అయితే సినిమా టైటిల్స్ పడేటప్పుడే విజయ్ పేరు ముందు 'గౌరవ ముఖ్యమంత్రి గారు నటించిన' అని టైటిల్ రావడంతో అభిమానులు థియేటర్లలో కేకలు వేస్తున్నారు. దళపతి విజయ్ ఇమేజ్ కు, ఆయన పొలిటికల్ ఎంట్రీకి తగ్గట్టుగా తెరకెక్కిన ఈ పొలిటికల్ మాస్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
స్టోరీ
ఈ సినిమా స్టోరీ మధురై జైలుతో ప్రారంభం అవుతుంది. వెట్రి(దళపతి విజయ్) ఓ నేరం కింద అక్కడ ఖైదీగా ఉంటాడు. ఆయనను జైలుకు పంపింది మరెవరో కాదు.. ఆయన సొంత తల్లి(రేవతి). అయితే జైలులో ఉన్నా కూడా వెట్రి సాధారణ ఖైదీ కాదు.. ఆయన డైలాగులు, తోటి ఖైదీలపై ఆయనకున్న పవర్ వేరేస్థాయిలో ఉంటాయి. వెట్రిని హత్య చేసేందుకు 20 సార్లు ప్రయత్నాలు జరిగినా తప్పించుకుంటాడు. జైలు అధికారి(నిజాల్గల్ రవి) చెప్పే "దళపతి మన రక్షణలో లేడు, మనమే ఆయన రక్షణలో ఉన్నాం" అనే ఒక్క డైలాగ్ విజయ్ కేరక్టర్ ఎలివేషన్ ను మరో స్థాయికి తీసుకెళ్తుంది.

తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లిని చివరిసారిగా చూసేందుకు జైలు వార్డెన్ శ్రీకాంత్(గౌతమ్ వాసుదేవ్ మీనన్) సాయంతో వెట్రి బయటకు వస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 15న వచ్చే సాధారణ క్షమాభిక్ష ద్వారా జైలు నుంచి విడుదల అవుతాడు. ఈ క్రమంలో జైలు వార్డెన్ శ్రీకాంత్ కూతురు విజ్జి(మమితా బైజు)తో వెట్రికి ఓ బలమైన సెంటిమెంట్ బంధం ఏర్పడుతుంది. మరోవైపు ఓ ప్రమాదంలో జైలు వార్డెన్ శ్రీకాంత్ చనిపోవడంతో విజ్జి బాధ్యతను వెట్రి తీసుకుంటాడు. విజ్జిని తన తండ్రి ఆర్మీ ఆఫీసర్ ను చేయాలని కలలు కంటాడు. ఆమె తండ్రి కల ప్రకారం విజ్జిని ఆర్మీ ఆఫీసర్ గా చేయాలని వెట్రి లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ ప్రయాణంలో టీవీ ఛానెల్ జర్నలిస్ట్ కాయల్(పూజా హెగ్డే) వీరి జీవితంలోకి వస్తుంది.
మరోవైపు ఆఫ్రికాలోని స్వాస్నియా అనే కల్పిత దేశాన్ని అంతం చేస్తూ.. అంతర్జాతీయంగా నేరాలు చేసే విలన్ జాన్ హిమ్లర్(బాబీ డియోల్) ఎంట్రీ ఇస్తాడు. రాజకీయ నాయకులందరినీ తన గుప్పెట్లో ఉంచుకునే హిమ్లర్.. దేశంలో అలజడి సృష్టించేందుకు ఆయుధాల నౌకను పంపుతాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఊహించని ట్విస్ట్ స్టోరీని మలుపు తిప్పుతుంది. అప్పటివరకు కేవలం విజ్జిని కాపాడుకునేందుకు పోరాడిన వెట్రి.. ప్రజలందరినీ రక్షించేందుకు ఎలా రంగంలోకి దిగాడు.. విలన్ పన్నాగాలను ఎలా తిప్పికొట్టాడనేదే మిగతా కథ.
పిచ్చెక్కెంచిన మాస్ ఎలివేషన్స్
ఈ చిత్రం తెలుగు హిట్ సినిమా 'భగవంత్ కేసరి' లైన్ ఆధారంగా తెరకెక్కినప్పటికీ.. దళపతి విజయ్ ఇమేజ్, ఆయన రియల్ లైఫ్ పొలిటికల్ ఎంట్రీకి అనుగుణంగా దర్శకుడు హెచ్.వినోద్ స్టోరీలో చాలా మార్పులు చేశారు. రెండో భాగంలో సామాజిక అన్యాయాలు, అవినీతి, మహిళా సాధికారత, రాజకీయ వ్యవస్థపై వెట్రి చేసే పోరాటం ప్రధానంగా సాగుతుంది. విజయ్ రియల్ లైఫ్ స్పీచ్ లలోని పంచ్ డైలాగ్స్ థియేటర్లలో విజల్స్ వేయించాయి. విజయ్ డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్సులు అభిమానులకు పూనకాలు తెప్పించాలా ఉన్నాయి.
సాంకేతికత
జననాయగన్ సినిమా పూర్తి స్థాయిలో దళపతి విజయ్ వన్ మ్యాన్ షో. ఈ సినిమాను ఆయన తన భుజాలపైకి ఎత్తుకుని మోసారు. విలన్ గా బాబీ డియోల్ విజయ్ కు సరైన పోటీ ఇచ్చారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కంటే మమతా బైజుకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించగా.. ఆమె విజ్జిగా ఎంతో చక్కగా నటించింది. ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, నరేన్, సునీల్, మదన్ గౌరి వంటి స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ.. కొంతమంది పాత్రలు కేవలం పరిమితంగానే మిగిలిపోయాయి. కొన్ని ఊహించని క్యామియోలు అభిమానులు మంచి సర్ ప్రైజ్ ను ఇస్తాయి.
ఈ సినిమాకు అనిరుధ్ చందర్ మ్యూజిక్ ఓ అతిపెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. పాటలు ఇప్పటికే హాట్ కాగా.. క్లైమాక్స్, యాక్షన్ సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేస్తుంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉంటే బాగుండేది. ముఖ్యంగా 3 గంటలకు పైగా ఉన్న నిడివి అక్కడక్కడా కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది.
ఫైనల్‌గా..
స్టోరీ కంటే రాజకీయ సందేశంపై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల కొన్ని సన్నివేశాలు కథనానికి దూరమైనట్లుగా అనిపించినా విజయ్ అభిమానులకు మాత్రం ఇది పర్ఫెక్ట్ వీడ్కోలు చిత్రం. ఈ సినిమా విజయ్ లుక్ అదిరిపోయింది. విజయ్ చివరి సినిమాగా వచ్చి.. టైటిల్ కార్డులోని ఆయన రాజకీయ ప్రయాణానికి నాంది పలికిన 'జననాయగన్'థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించే అసలైన మాస్ జాతర.
రేటింగ్: 2.5/5.












Click it and Unblock the Notifications