అవినీతి ముత్యం రూ.200 కోట్లు.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 14రోజుల రిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో భారీ అవినీతి తిమింగలాలు బయటపడుతున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వంలో వైట్ కలర్ జాబ్ చేస్తున్న అధికారుల అవినీతి బండారాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా తెలంగాణా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ టీజీ రెడ్కో డిప్యూటీ జనరల్ మేనేజర్ ముత్యం వెంకట రమణను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధింపు
దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయనను చంచల్ గూడా జైలుకు తరలించింది. ఇప్పటివరకు ఏసీబీ చరిత్రలో పట్టుబడిన అవినీతి తిమింగలాలలో ఈయన ఒకరు. ఇటీవల కాలంలో ఇంత భారీ మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన అధికారిని ఏసీబీ పట్టుకోవటం ఇదే మొదటిసారి.

ముత్యం ఆస్తుల విలువ రూ. 200 కోట్లు
ఇంతకు ముందు ఆర్ అండ్ బీ ఈ ఎన్ సి మోహన్ నాయక్ కేసు రికార్డ్ సృష్టించగా, ముత్యం వెంకటరమణ ఆ రికార్డ్ ను బద్దలు కొట్టి దాదాపు 200 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. ఆయన ఆస్తులలో ఎక్కువ భాగం స్థిరాస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 200 కోట్లకు మించి ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
గతంలోనూ ఏసీబీకి పట్టుబడిన ముత్యం
ముత్యం వెంకటరమణకు ఏసీబీ రైడ్ ఇది తొలిసారి కాదు. 2019లో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డాడు. ఆ కేసు ఇంకా కోర్టులో విచారణ లోనే ఉంది. అయినా ఎలాంటి భయం లేకుండా ముత్యం వెంకటరమణ మరిన్ని ఆస్తుల సమకూర్చుకున్నట్టు, ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోని బుధవారం ఏసీబీ బృందాలు ఆయన ఇంటితోపాటు, ఆయన ఆస్తులు, బంధువుల ఇళ్ళలో సోదాలు నిర్వహించి కీలక సమాచారాన్ని సేకరించారు.
ఆస్తులు, బినామీలు, బ్యాంకు లావాదేవీలపై పరిశీలన
దర్యాప్తులో ఆయన ఆస్తులు, బినామీలు, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. గతంలో ఏసీబీ అధికారుల దాడులలో పట్టుబడిన వారు కూడా మళ్ళీ మళ్ళీ అవినీతికి పాల్పడటం ప్రస్తుతం తెలంగాణాలో ఆందోళన కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications