వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్లర వెనక ఎవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad Clashes
హైదరాబాద్ పాతబస్తీ అల్లర్ల వెనక కుట్ర దాగి ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. కాంగ్రెసులోని ఒక వర్గం అల్లర్ల వెనక ముఖ్యమంత్రి రోశయ్యను దించే కుట్ర దాగి ఉందని విమర్సిస్తుండగా, తెలంగాణ వ్యతిరేకులు ఈ అల్లర్ల వెనక ఉన్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆరోపిస్తోంది. రోశయ్యను దించడానికి చేసిన కుట్రలో భాగంగానే హైదరాబాదులో అల్లర్లను సృష్టించారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ, సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు ఆరోపించారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెసు నాయకులు కుట్ర ఉందని వాదిస్తున్నారు. 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి హైదరాబాదు పాతబస్తీలో అల్లర్లను సృష్టించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. హైదరాబాదు అల్లర్ల వల్ల అప్పుడు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

అనూహ్యంగా ముఖ్యమంత్రి కె. రోశయ్య అధికారంలో స్థిరపడి పాలన గాడిలో పడే పరిస్థితి వచ్చింది. చాలా మంది కాంగ్రెసు శాసనసభ్యులు, మంత్రులు రోశయ్యకు అనుకూలంగా మారారు. అధికారాన్ని రోశయ్య స్థిరపరుచుకుంటూ తన సత్తాను చాటడానికి సిద్ధపడ్డారు. మెల్లగా పావులు కదుపుతూ తనదైన జట్టును అటు అధికార యంత్రాంగంలోనూ, ఇటు మంత్రివర్గంలోనూ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. రోశయ్యలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అధికారం ఖాయమైపోయిందన్న ధీమా కూడా పెరిగింది. ఇటీవల ఆయన వ్యవహార శైలి ఈ విషయాన్ని పట్టిస్తుంది. కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో రోశయ్య స్థిరపడితే తమకు కష్టమని భావించిన వర్గాలు హైదరాబాదులో అల్లర్లను సృష్టించారని అంటున్నారు. ఇటువంటి వాదన వచ్చేసరికి వైయస్ జగన్ పేరు ముందుకు రావడం సహజమే. రోశయ్యతో వైయస్ జగన్ వైరం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటి వరకు రోశయ్యతో వైయస్ జగన్ భేటీ కాలేదు. పైగా, ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ తాపత్రయ పడుతూనే ఉన్నారు. హైదరాబాద్ అల్లర్ల వెనక కుట్ర ఉందని నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ కూడా అన్నారు.

కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి సీమాంధ్ర నాయకులు హైదరాబాదులో అల్లర్లు సృష్టించారని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. హైదరాబాదులో అల్లర్ల సృష్టికి సీమాంధ్ర నాయకులు ప్రయత్నిస్తున్నారని తెరాస చాలా కాలంగా ఆరోపిస్తూ ఉంది. కుట్ర కథనాల వెనక సత్యం ఏవరికీ తెలియదు గానీ మొత్తం మీద కుట్ర ఉందనే ప్రచారాన్ని నమ్మడానికి ఏ విధమైన ఆధారాలు అవసరం లేకుండా పోయాయి. గత అనుభవాలు ఈ ప్రచారాన్ని నమ్మడానికి కారణమవుతున్నాయి. తాజా పరిణామాలు కూడా అందుకు దోహదపడుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X