• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సమైక్యవాదం బలహీనం?

By Pratap
|

JC Diwakar Reddy
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అభిప్రాయాలు వెల్లడించాల్సిన గడువు దగ్గర పడుతున్న కొద్దీ సమైక్యవాదం బలహీన పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సమైక్య నినాదంలో పస కూడా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మెల్లమెల్లగా సమైక్యవాదం నుంచి సీమాంధ్ర నాయకులు వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా కాంగ్రెసు నాయకులే ఉండడం గమనార్హం. కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటన వల్ల ఉత్పన్నమైన పరిస్థితిని ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది. ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులు ఇప్పటికీ సమైక్య నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. అయితే ఉద్యమాల విషయానికి వచ్చే సరికి పార్టీలకు అతీతంగా నిలిచే పరిస్థితి లేదు. చిదంబరం ప్రకటన తర్వాత సీమాంధ్ర నాయకులు పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యారు. శాసనసభ్యులు రాజీనామాలు సమర్పించారు. ఆందోళనలు చేపట్టారు. ఎస్వీ, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో ఉద్యమాలు చేశారు. అయితే అప్పటి ఊపు మళ్లీ వచ్చే సూచనలు కనిపించడం లేదు.

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర విడిపోతే మంచిదేనని ప్రకటించి సమైక్యవాదాన్ని చాలా వరకు దెబ్బ తీశారు. ఎంతగా వ్యతిరేకత ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. సమైక్యంగా ఎందుకు ఉండాలో చెప్పాలని ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులను అడిగారు. కాంగ్రెసు అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ మొదటి నుంచి రాష్ట్ర విభజనకు అనుకూలంగానే ఉన్నారు. అయితే, సమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతి వల్ల కొంత కాలం ఆయన పెద్దగా గొంతు విప్పలేకపోయారు. ఇప్పుడు మళ్లీ తన గొంతు విప్పారు. తాజాగా, రాయలసీమకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రకటన మరోసారి సంచలనానికి కారణమైంది. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమను తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన ఒక సూచన చేశారు. కర్నూలు కాంగ్రెసు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమైక్యవాదంపై గట్టిగా నిలబడకుండా ప్రత్యామ్నాయాల వైపు సీమాంధ్ర నాయకులు కొంత మంది దృష్టి పెట్టారు. ఈ ప్రత్యామ్నాయాలు వచ్చాయంటేనే సమైక్యవాదం బలహీనపడుతోందనడానికి నిదర్శనమని తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండ రామ్ వంటి వారు వ్యాఖ్యానిస్తున్నారు.

జై ఆంధ్ర నినాదం ఎత్తుకున్న కాంగ్రెసు నాయకుడు వసంత నాగేశ్వర రావు తన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తగిన వాతావరణాన్ని కల్పించుకోలేకపోయారు. సమైక్యవాదుల ధాటికి ఆయన ముందుకు సాగలేకపోయారు. ఇప్పుడు ఆయన మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే, కత్తి పద్మారావు వంటి దళిత నాయకులు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన దళిత సంఘం ఒకటి ఇటీవల సమావేశం నిర్వహించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటన చేసింది. సీమాంధ్రలోని ముఖ్యంగా కోస్తాంధ్రలోని దళితులు సమైక్యవాదానికి బలాన్ని అందించడం లేదు. హైదరాబాదులోని పరిశ్రమలు స్థాపించుకున్న సీమాంధ్ర నాయకులు మాత్రమే తమ వ్యాపార ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారని వారంటున్నారు. ఈ స్థితిలో సమైక్యవాదం పునాది గట్టి పడడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X