జగన్ తెలంగాణలో పర్యటిస్తారా?

కాగా, రాష్ట్ర నాయకత్వం నెరుపుతున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రత్యేకంగా తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. జగన్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు కూడా అనుకోవచ్చు. సీమాంధ్రలో పట్టును సాధించడానికి వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా నుంచి పర్యటన ప్రారంభిస్తారని భావిస్తున్నప్పటికీ పూర్తి వివరాలు అందడం లేదు. అయితే, తెలంగాణలో జగన్ పర్యటించగలుగుతారా, ఆయన పర్యటన తెలంగాణలో ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరులు, వైయస్ జగన్ అభిమానులు దండిగానే ఉన్నారు. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీమాంధ్ర నాయకులే కాదు, తెలంగాణకు చెందిన నాయకులు కూడా తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛగా పర్యటించే పరిస్థితులు లేవు. తెలంగాణలో పర్యటించాలంటే భారీ భద్రతా ఏర్పాట్లు అవసరం. జగన్ లాంటి నాయకుడికి ఇది మరింత అవసరం. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకత ఎదురవుతోంది. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు రాజకీయ నాయకులను తెలంగాణలో అడ్డుకుంటున్నారు. వైయస్ జగన్ పర్యటనను తెలంగాణవాదులు అడ్డుకోరనే గ్యారంటీ ఏమీ లేదు. పార్లమెంటు సమైక్య నినాదం ఇచ్చిన జగన్ పై తెలంగాణలో ఆగ్రహం ఎక్కువే ఉంది. కొండా సురేఖ వంటి కాంగ్రెసు శాసనసభ్యులు సమర్థించడాన్ని తెలంగాణ విద్యార్థులు, తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తెలంగాణ పర్యటన సందర్భంగా జగన్ కు తెలంగాణ నాయకుల నుంచి ఏ మేరకు సహకారం అందుతుందనేది కూడా సందేహంగానే ఉంది. మంత్రి పదవులపై ఆశలు కూడా జగన్ పర్యటనకు ఆటంకంగా మారవచ్చు. జగన్ పై అభిమానం కన్నా వ్యతిరేకతే ఎక్కువగా ఉంది. పైగా క్యాడర్ ను, జూనియర్లను ప్రభావితం చేసే సీనియర్ నాయకులు చాలా మంది జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ అల్లర్లు కూడా సమస్యగా మారాయి. అందువల్ల జగన్ ఓదార్పు యాత్ర ఏ మేరకు ముందు పడుతుందనేది సందేహంగానే ఉంది.












Click it and Unblock the Notifications