వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వార్ ఎవరిపై?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సంబంధించి ఓ విషయంలో పార్టీ అధిష్టానం విజయం సాధించింది. వైయస్ జగన్ సమరాన్ని కాంగ్రెసు అధిష్టానం మలుపు తిప్పింది. తమపై ధిక్కారంగా మొదలైన వైయస్ జగన్ వ్యవహారాన్ని రాష్ట్ర పార్టీ అంతర్గత వ్యవహారంగా మలచడంలో విజయం సాధించినట్లే. దాన్ని కూడా ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, వైయస్ జగన్ కు మధ్య విభేదాలుగా, కుమ్ములాటలుగా మార్చేసింది. అ రకంగా వైయస్ జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే ఆరాటపడుతున్నారని, తొందరపడుతున్నారని చిత్రీకరించడానికి అవసరమైన ప్రాతిపదికను పార్టీ అధిష్టానం తయారు చేసింది. ఆ రకంగా జగన్ స్థాయిని తగ్గించింది. రాష్ట్ర కాంగ్రెసులో తనను మించిన నాయకుడు లేడని, రాష్ట్రంలోని ఏ నాయకుడ్ని కూడా గుర్తించాల్సిన అవసరం లేదని, తాను రాష్ట్ర నాయకులకు మించిన నాయకుడినని, అధిష్టానంతోనే తాను వ్యవహారాలను నడుపుతానని చాటి చెప్పడానికి ఇన్నాళ్లు జగన్ ప్రయత్నిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రిగా రోశయ్యను గుర్తించడానికి కూడా ఆయన నిరాకరిస్తున్నట్లు వ్యవహరించారు. రోశయ్యతో వేదికను పంచుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు తాను గుర్తించడానికి నిరాకరించిన నాయకులతోనే తలపడడానికి సిద్ధపడే పరిస్థితిని అధిష్టానం కల్పించింది.

ముఖ్యమంత్రి కె. రోశయ్యనే నేరుగా రంగంలోకి దింపి అధిష్టానం జగన్ పై సమరానికి పురికొల్పింది. జగన్ వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని, జగన్ వ్యవహారం రాష్ట్ర పరిధిలోది కాదని అంటూ వచ్చిన రోశయ్య ఇప్పుడు అధిష్టానం ఆదేశాలతో ముందుకు దూకారు. పాల్వాయి గోవర్దన్ రెడ్డి, వి హనుమంతరావు వంటి నాయకులను ఉసిగొల్పింది. దీంతో జగన్ స్థాయికి మించి రోశయ్య పెరిగే అవకాశం ఏర్పడింది. మిగతా రాష్ట్ర నాయకులకు సమానంగా జగన్ దిగిపోయే పరిస్థితి వచ్చింది. తాను ఇంత వరకు ఎవరినైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ భావించాడో వారితోనే తలపడాల్సిన పరిస్థితిని కల్పించింది. ఇది జగన్ స్థాయిని తగ్గించినట్లేనని భావించవచ్చు.

దానికితోడు, రోశయ్యకు, జగన్ కు మధ్య విభేదాలుగా ప్రస్తుత వ్యవహారం మారిపోయింది. అధిష్టానంతో సంప్రదింపులు జరిపే పరిస్థితిని కూడా జగన్ దాంతో కోల్పోయారు. నిజానికి, పార్టీ అధిష్టానానికి సంబంధించిన అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీ వంటి నాయకులు జగన్ కు ఇంత వరకు గౌరవం ఇస్తూ తమతో భేటీకి అంగీకరిస్తూ వచ్చారు. కాంగ్రెసు సమన్వయ కమిటీలో ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ లతో సమానంగా పీట వేసింది. కానీ దాన్ని జగన్ వాడుకోలేదు. ఇప్పుడు ఢిల్లీ పెద్దలు చేతులు కట్టుకుని జగన్ వ్యవహారాన్ని రక్తి కట్టిస్తున్నారు.

బహుశా, ఇక జగన్ కు అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం కూడా లభించకపోవచ్చు. రోశయ్య, జగన్ ల మధ్య వ్యవహారంగా చూపిస్తూ మంత్రులు వారిద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చేసేదేమీ లేదని, అంతా అధిష్టానం చెబుతున్నట్లే జరుగుతోందని తెలిసీ ఆ ప్రయత్నాలు చేయడంలో అర్థం లేదని బహుశా వారికి కూడా తెలిసి ఉంటుంది. జగన్ కు అధిష్టానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లే భావించాలి.

కాగా, ఇంత కాలం జగన్ కు ఏదో మేరకు అనుకూలంగా ఉంటూ వస్తున్న కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని సోనియా గాంధీ పక్కకు తప్పించినట్లేనని చెబుతున్నారు. జగన్ పై ప్రత్యక్ష సమారానికి సిద్ధపడడానికి మొయిలీని తప్పించడం తప్ప మార్గం లేదని భావించారు. కాగా, మొయిలీని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా కూడా తప్పించే అవకాశాలున్నాయి. జగన్ తన భవిష్యత్తు పథకాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించడానికి వీలైన యుద్ధానికి పార్టీ అధిష్టానం తెర లేపింది. ఇక తేల్చుకోవాల్సిందే జగనే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X