జయసుధ ఔట్, జయప్రద ఇన్?

జయసుధకు పెద్గగా రాజకీయాలు తెలియవు. ఆ విషయాన్ని ఆమెనే పలుసార్లు అంగీకరించారు. శాసనసభ్యురాలిగా ఎన్నికైన తర్వాత ఆమె రాజకీయాల పట్ల తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. రాజకీయాల్లోంచి తప్పుకుంటానని కూడా చెప్పారు. రాటు దేలిన రాజకీయాల్లో జయసుధ అంతగా పనికి రారనే అభిప్రాయాన్ని కలిగించారు. పైగా, మేయర్ కార్తిక రెడ్డితో ఆమెకు పడడం లేదు. ఆమెతో కయ్యానికి దిగారు. ఆ వివాదం ముఖ్యమంత్రి రోశయ్య దాకా వెళ్లింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో జయసుధ రాజకీయాల్లో ఉంటారా, లేదా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.
కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అధిష్టానంపై ధిక్కారం వినిపిస్తున్న సమయంలో జయసుధ పార్టీకి కట్టుబడి ఉంటారనేది కూడా సందేహమేనని అంటున్నారు. ఆమె జగన్ శిబిరంలోకి మారినా ఆశ్చర్యం లేదు. జగన్ కు ఆమె తన విధేయతను పలుసార్లు ప్రకటించారు. ఆ ఖాళీని భర్తీ చేయడం ఇప్పుడు కాంగ్రెసు పార్టీకి అవసరం కూడా. దాంతో జయప్రదను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. జయప్రద రాజకీయానుభవం దండిగానే ఉంది. అవగాహన కూడా ఉంది. సమాజ్ వాదీ పార్టీ నుంచి అమర్ సింగ్ బహిష్కరణకు గురైన తర్వాత జయప్రద పార్టీలేని నాయకురాలిగా మిగిలారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగడం కూడా ఆమెకు అంత సులభం కాకపోవచ్చు. దాంతో ఆమె సొంత రాష్ట్రం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం గతంలో జరిగింది. అయితే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై కూడా ఆమెకు అనుమానాలు ఉన్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెసు పార్టీలో చేరి తిరిగి పార్లమెంటుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకోవాలనేది జయప్రద ఆలోచన చెబుతున్నారు.












Click it and Unblock the Notifications