వైయస్ జగన్ వెంట కొత్త శక్తులు

రోజా, లక్ష్మీపార్వతి వంటివారే కాకుండా కాంగ్రెసులోని ద్వితీయ శ్రేణి నాయకులనే కాకుండా తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల నాయకులను కూడా తన వైపు ఆకర్షించే పనిని వైయస్ జగన్ పనిగా పెట్టుకున్నారు. తెలుగుదేశం అసమ్మతి శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓదార్పు యాత్రలో జగన్ వెంట ఉన్నారు. పార్టీని ధిక్కరిస్తూ ఆయన జగన్ కు మద్దతు తెలిపారు. అలాగే, మంత్రాలయం శాసనసభ్యుడు బాలినేని శివనాగిరెడ్డి కూడా జగన్ వెంట వెళ్లే అవకాశాలున్నాయి. మూడు పార్టీల్లోని అసమ్మతి, ద్వితీయ శ్రేణి నాయకులను కూడగట్టే పనిని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అనుచరులు పనిగా పెట్టుకున్నారు.
శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి వంటి కాంగ్రెసు శాసనసభ్యులు డజను మందికి తగ్గకుండా జగన్ వెంట ఉన్నారు. అంబటి రాంబాబు, కొండా సురేఖ వంటి నాయకులు జగన్ బలాన్ని సమీకరించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి పూర్తిగా జగన్ ను సమర్థించారు. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ జగన్ తప్ప లోకం లేదని, జగన్ తప్ప నాయకుడు లేడని ప్రకటించారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇప్పటికే జగన్ వెంట ఉన్నారు. మరో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా జగన్ వెంట ఉన్న విషయం తెలిసిందే. ఈ పాత నాయకులు కొత్త శక్తులను సమీకరించే పనిని సాగిస్తున్నారు. నెల్లూరులో జరిగిన ఓదార్పు ముగింపు సభ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వారంతా పార్టీ ధిక్కరించడానికే సిద్ధమైనట్లు కూడా అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications