వైయస్ ఫ్యామిలీలో కలతలు

తొలిసారి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి కడప పార్లమెంటు సభ్యత్వానికి వివేకానంద రెడ్డి చేత రాజీనామా చేయించి కుమారుడు వైయన్ జగన్ చేత పోటీ చేయించడానికి పూనుకున్నారు. ఇది వివేకానంద రెడ్డికి నచ్చలేదని చెబుతున్నారు. అయినా రాజీనామా చేయడానికి వివేకానంద రెడ్డి సిద్ధపడ్డారు. కానీ సోనియా అందుకు అంగీకరించలేదు. దీంతో వివేకానంద రెడ్డి పూర్తి కాలం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. తదుపరి ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి వైయస్ జగన్ కు కడప లోకసభ టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. దీంతో రాజకీయాల్లో వైయస్ జగన్ ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వంలో పలు విషయాలను ఆయన ప్రభావితం చేస్తూ వచ్చారు. వివేకానంద రెడ్డి ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
వైయస్ మృతి తర్వాత పులివెందుల శాసనసభా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. నిజానికి ఈ స్థానం నుంచి తానే పోటీ చేసి శాసనసభకు రావాలని, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవాలని వైయస్ జగన్ భావించారు. కానీ అందుకు అధిష్టానం అంగీకరించలేదు. వైయస్ కుటుంబంలో ఒకరికి పులివెందుల టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్పింది. దీంతో వైఎస్ సోదరుడు భాస్కర్ రెడ్డి పులివెందుల అభ్యర్థిత్వం కోసం పో టీ పడ్డారు. ఆయనతో పాటు వివేకానంద రెడ్డి కూడా అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అభ్యర్థిత్వం కోసం నేరుగా ఢిల్లీలో ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయినా ఆయనకు అభ్యర్థిత్వం దక్కలేదు. ఇది కూడా వైఎస్ కుటుంబంలో విబేధాలకు దారి తీసింది. వైఎస్ సతీమణివి జయలక్ష్మిని అభ్యర్థిగా అధిష్ఠానం ఎంపిక చేసింది. దీంతో ఎవరూ అందుకు భిన్నంగా వ్యవహరించలేకపోయారు. ఓదార్పు యాత్రపై సోనియాకు వివరణ ఇచ్చేందుకు తన తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిలతో కలిసి జగన్ ఢిల్లీ వెళ్లారు. వైఎస్ తర్వాత అప్పటికి క్రియాశీల రాజకీయాల్లో వివేకానంద రెడ్డి ఉన్నారు. గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వివేకానందకు ఢిల్లీలో మంచి సంబంధాలున్నాయి. సోనియాతో కూడా సత్సంబంధాలున్నాయి. అయినా తనను సోనియా వద్దకు తీసుకుపోకపోవడం పైనా వివేకానంద మనస్తాపానికి గురయ్యారని చెబుతారు. సమైక్యాంధ్ర ఉద్యమ సందంర్భంలో వైయస్ వివేకానంద రెడ్డి తీరు కూడా విభేదాలను బయటపెడుతోందని అంటున్నారు. కానీ, ఎవరు కూడా విభేదాల గురించి మాట్లాడే తెగువ ప్రదర్శించలేకపోయారు. ఒక రకంగా దాన్ని వైయస్ కుటుంబ సమస్యగానే చూశారు.












Click it and Unblock the Notifications