వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెగులు' న్యూస్ చానెళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi-TV 5-TV 9
తెలుగు టీవీ న్యూస్ చానెళ్ల తీరు వివాదాస్పదంగా మారింది. వార్తా ప్రసారాల్లో, చర్చా కార్యక్రమాల్లో అవి అనుసరిస్తున్న తీరు ప్రమాణాలకు తగినట్లు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీవీ న్యూస్ చానెళ్ల తీరుపై రాజకీయ నాయకులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంచలనాలను సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా అవి పనిచేస్తున్నాయి. దీంతో వార్తాప్రసారాలు, చర్చా కార్యక్రమాలు వెర్రితలలు వేస్తున్నాయి. తాము ప్రసారం చేసే వార్తా కథనాల వల్ల సంభవించే పరిణామాలు ఎలా ఉంటాయనే ఆలోచన కూడా లేకుండా ప్రసారాలకు పూనుకుంటున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి వెనక కుట్ర ఉందంటూ రష్యన్ వెబ్ సైట్ వార్తా కథనాన్ని తీసుకుని తెలుగు న్యూస్ చానెళ్లు సృష్టించిన విధ్వంసం తాజాగా మన ముందున్నది. దీని వెనక కుట్ర దాగి ఉందనే విషయాన్ని పక్కన పెడితే ఆ వార్తా కథనాన్ని పోటీ పడి టీవీ చానెళ్లు ప్రసారం చేయడం, దానిపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించడం చూస్తే టీవీ జర్నలిజం ఎంత దిగజారుడు స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పోటీలో ముందుండడానికి ప్రయత్నించిన టీవీ9 ఆంధ్రజ్యోతి ఎబిన్ వార్తా కథనాన్ని చూసిందో ఏమో వెంటనే వెనక్కి తగ్గింది. రష్యన్ వెబ్ సైట్ ది ఎగ్జైల్డ్ నమదగ్గది కాదని, దాని స్వరూప స్వభావాలను ఆంధ్రజ్యోతి ఎబిని చానెల్ వెంటనే బయటపెట్టింది. దీని వల్ల పునరాలోచనకు అవకాశం చిక్కి టీవీ9 వెనక్కి తగ్గినట్లుంది. కానీ పోటీలో ఊదరగొట్టి ఉండేదే.

అయితే, వార్తా కథనంతో తమకు సంబంధం లేదని నటించడానికి ప్రయత్నించిన టీవీ9 తర్వాత అందులో చిక్కుకోక తప్పలేదు. వార్తా కథనం ప్రసారం వల్ల టీవీ5, ఎన్టీవీ,సాక్షి న్యూస్ చానెళ్లు ఇరకాటంలో పడ్డాయి. చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడ్డాయి. దీంతో ఈ వివాదంలోకి టీవీ9ను కూడా సాక్షి చానెల్ లాగింది. రష్యన్ వెబ్ సైట్ కథనం ఆధారంగా వైయస్ మృతిపై టీవీ9 ప్రసారం చేసిన వార్తాకథనాన్ని సాక్షి చానెల్ ప్రసారం చేసి టీవీ9ను కూడా వివాదంలోకి లాగింది. రేటింగ్ పెంచుకోవడానికి న్యూస్ చానెళ్లు సంచలనాత్మక కథనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయనే వాదన ఉంది. ఇందులో నిజం లేకపోలేదు. అయితే రాజకీయ నిబద్ధతలు కూడా టీవీ చానెళ్లను ఈ వివాదంలోకి లాగుతున్నాయి. టీవీ న్యూస్ చానెళ్లు రాజకీయంగా రెండుగా విడిపోయి ఉన్నాయి. ఈ విషయం వార్తాకథనాల ప్రసారం తీరును బట్టి అర్థమవుతూనే ఉంటుంది. తమ తమ రాజకీయ నిబద్ధతలను బట్టి తమకు అనుకూలంగా వార్తా కథనాలను ప్రసారం చేసుకోవడం కోసమే కొన్ని చానెళ్లు పుట్టాయని అందరికీ తెలిసిందే. అందువల్ల అవి అంతకన్నా భిన్నంగా ఉండే అవకాశం లేదు.

కాగా, ఊదరగొట్టుడు కూడా టీవీ న్యూస్ చానెళ్లకు ఆనవాయితీగా మారింది. లైవ్ చర్చా కార్యక్రమాలు తలనొప్పిగా, భరింపశక్యంగానిగా ఉంటాయి. రాజకీయ నాయకులు తమ తమ వైఖరులను మార్చుకోవడం కుదరదనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ, సమైక్యాంధ్ర వివాదంలో ఎవరి పట్టుకు వారు కట్టుబడి ఉన్నారు. దీనిపై నిరంతరం చర్చా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వివాదంలో అటు వైపు నుంచి ఒకరిని, ఇటు వైపు నుంచి ఒకరిని పెట్టి అర్థం పర్థం లేని చర్చలు సాగిస్తున్నాయి. తిట్లపురాణం, ఆవేశకావేషాలు వీటి వల్ల మరింతగా పెరుగుతున్నాయి. సమస్య పరిష్కారం దిశగా ఈ చర్చా కార్యక్రమాలు ఉండాలంటే హెచ్ఎంటీవిని చూసైనా నేర్చుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నాల్లో ఆ టీవీ చానెల్ రాష్ట్ర విభజన సమస్యపై అర్థవంతమైన చర్చను నడిపింది. హంగులూ, ఆర్భాటాలు మిగతా న్యూస్ చానెళ్లతో చూసుకుంటే దానికి తక్కువ. కానీ అది ఆ సాహసం చేయగలిగింది. మిగతా చానెళ్లకు ఎన్నో హంగులు, సౌకర్యాలు, వ్యవస్థ ఉన్నప్పటికీ అందుకు ప్రయత్నించకపోవడం వెనక భావదారిద్ర్యమైనా అయి ఉండాలి లేదా సమాజం పట్ల బాధ్యతనైనా లేకపోవాలి. ఈ టీవీ న్యూస్ చానెళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులకు చాలా మందికి కనీస పరిజ్ఞానం కూడా ఉండడం లేదు. ఈ విషయంలో రాజకీయ నాయకుల నుంచి రిపోర్టర్లు ఎప్పటికప్పుడు మొట్టికాయలు తింటూనే ఉన్నారు. దీనికి తోడు, కొంత మందికి ఎనలేని అహంకారం. ఇంటర్వ్యూలో చేసేటప్పుడు ఇది బయటపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. విజయశాంతి లాంటి వాళ్లు కూడా జర్నలిస్టులను లైవ్ లోనే నిలదీసిన సందర్భాలున్నాయి.

మొత్తం మీద పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు తామరతంపరలాగా తెలుగులో టీవీ న్యూస్ చానెళ్లు పనిచేస్తున్నాయి. ఎన్ని నిలబడుతాయి, ఎన్ని పోతాయనేది చెప్పలేం గానీ ఇప్పుడైతే వార్తాకాలుష్యంతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. అజ్ఞానం, అహంకారం, పక్షపాత ధోరణి వంటి సవా లక్ష అవలక్షణాలు భుజకీర్తులు ధరించి ఊరేగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X