వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుగ్గల్ కు రామానాయుడు కుంపటి

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడుకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడమేమిటో గానీ అది శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ పాలిటి శాపంగా మారింది. రామానాయుడు అవార్డు వచ్చిన సందర్భంగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ఓ విందు ఇచ్చారు. ఆ విందుకు సుబ్బిరామిరెడ్డి దుగ్గల్ ను ఆహ్వానించారు. గత నెల 23వ తేదీన ఆ విందుకు దుగ్గల్ హాజరయ్యారు. సుబ్బిరామిరెడ్డి ఎక్కడికెక్కడో లింకులు పెడతారనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో దుగ్గల్ పై తెలంగాణ నేతలు గుర్రుమంటున్నారు. దుగ్గల్ పై కాంగ్రెసు తెలంగాణ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు దుగ్గల్ ను తీవ్రంగా తప్పు పడుతున్నారు. అది మళ్లీ కాంగ్రెసు సీమాంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య వివాదానికి కూడా దారి తీసింది.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించడానికి సమయం దగ్గర పడుతున్న సమయంలో సీమాంధ్ర నాయకుల విందులకు దుగ్గల్ హాజరు కావడం అనుమానాలు కలిగిస్తోందని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి తాము ఎంతకైనా తెగిస్తామని సీమాంధ్ర నాయకులు చెబుతున్న తరుణంలో ఇలాంటి వ్యవహారాలు నమ్మకాన్ని సడలిస్తాయని వారన్నారు. సీమాంధ్ర నాయకుల ఇళ్లకు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు వెళ్లడమేమిటని వారు ప్రశ్నించారు. తెలంగాణ పార్లమెంటు సభ్యుల తీరుపై కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు తెలంగాణ నాయకులు కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెసులోని సీమాంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య అపనమ్మకాలు మరింతగా పెరిగిపోయాయి.

దుగ్గల్ సుబ్బిరామిరెడ్డి విందుకు హాజరు కావడంపై తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ కూడా ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వివాదం తెలుగు టీవీ చానెళ్లకు విందు భోజనంగా మారింది. మరోసారి తెలంగాణ, సీమాంధ్ర నాయకుల మధ్య చిచ్చును పెంచడానికి వాటికి ఇది బాగా ఉపయోగపడింది. ఈ చర్చా కార్యక్రమాల్లో దుగ్గల్ తీరుపై తెలంగాణ నాయకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దుగ్గల్ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రభావాలకు దుగ్గల్ గురవుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని, దీంతో తెలంగాణ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. దుగ్గల్ వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రజల భయాలను పెంచుతున్నాయని ఆయన అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించే డిసెంబర్ 31వ తేదీ గడువు ముగిసే లోగానే రాష్ట్రంలో మరింతగా వివాదం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుగ్గల్ వ్యవహార శైలి అందుకు కారణంగా మారుతోంది. తెలుగు లలితా కళాతోరణం పేరు మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టడానికి టి. సుబ్బిరామిరెడ్డి పది కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పటికే ఓ వివాదానికి కారణమయ్యారు. తెలుగు లలిత కళాతోరణం పేరును మార్చడానికి సుబ్బిరామిరెడ్డి ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించడాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదనే విషయం అర్థమవుతోందని మీడియా అప్పట్లో అర్థాలు తీసింది. ఇప్పుడు దుగ్గల్ ను విందుకు పిలిచి మరోసారి ఆ వాదనను బలపరిచే విధంగా ఆయన వ్యవహరించారు. తెలంగాణను అడ్డుకోవడానికి టి. సుబ్బిరామిరెడ్డి సీమాంధ్రుల తరఫున ప్రయత్నాలు సాగిస్తున్నారా అనే అనుమానాలు ప్రస్తుత వాతావరణంలో బలపడుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X