అసలేం జరిగింది?

కాంగ్రెసు అధినాయకత్వం తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నది. అయితే, అందుకు ప్రక్రియను ప్రారంభించడానికి అనువైన సందర్భం దొరకడం లేదు. కెసిఆర్ నిరాహార దీక్ష ఆ సందర్భాన్ని తెచ్చి పెట్టింది. నిజానికి, కెసిఆర్ తో మన్మోహన్ సింగ్ మాట్లాడి ఉంటే ఆయన దీక్ష విరమించేవారే. దీక్ష విరమిస్తే మొదట్లో విద్యార్థుల నుంచి వచ్చిన ఒత్తిడి కూడా ఆ తర్వాత వచ్చే పరిస్థితి లేదు. విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు కేంద్రం నుంచి ప్రకటన రాకున్నా సరే విరమించాలని విజ్ఞప్తి చేశారు. కానీ కెసిఆర్ అందుకు సిద్ధంగా లేరు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి 2009 డిసెంబర్ 7వ తేదీ నాటికి పూర్తిగా క్షీణించింది. నిమ్స్ వైద్యులు ఆయన ఆరోగ్యం గురించి వాస్తవాలను బయటి ప్రపంచానికి వెల్లడించకుండా కుటుంబ సభ్యులపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన కెసిఆర్ కు వైద్యం అందిస్తున్న బృందం నుంచి ఒక వైద్యుడు వెళ్లిపోయాడు కూడా. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. కెసిఆర్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురైన ముఖ్యమంత్రి రోశయ్య విషయాన్ని కాంగ్రెసు అధిష్టానానికి విన్నవించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నందున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మరోసారి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోవాలని రోశయ్యకు కబురు అందింది. ఆ మేరకు 7వ తేదీన రోశయ్య అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి సమావేశ వివరాలను కేంద్రానికి పంపారు. దాని ఆధారంగా కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని చిదంబరం రోశయ్య హైదరాబాద్ చేరుకునే లోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి 8వ తేదీన పార్టీ అధిష్టానం నాయకులు రోశయ్యకు కూడా చెప్పినట్లు తెలిసింది. కానీ రోశయ్య ఇక్కడి పరిస్థితి చూసి మాట మార్చినట్లు చెబుతున్నారు.
చిదంబరం ప్రకటన వచ్చేలోగానే కెసిఆర్ చేత దీక్ష విరమింపజేయడానికి రంగం సిద్ధమైంది. అయితే చిదంబరం నుంచి ప్రకటన వెలువడే ఆవకాశం ఉండడంతో ఆ విరమణను క్షణక్షణం వాయిదా వేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. తెరాస నాయకులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఢిల్లీలోని ఒక కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆ విషయం కనుక్కుంటూ వచ్చినట్లు సమాచారం. చిదంబరం ప్రకటన వెలువడగానే కెసిఆర్ చేత దీక్ష విరమింపజేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకుండానే దీక్ష విరమింపజేయడానికి అన్ని వైపుల నుంచి కెసిఆర్ కుమారుడు, శాసనసభ్యుడు కెటి రామారావుపై, కూతురు కవితపై తీవ్రంగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఖమ్మం వ్యవహారంతో తీవ్రంగా మనస్తాపం చెందిన కెసిఆర్ ఓ వైపు దీక్ష విరమించడానికి మొండి పట్టు పట్టారు. దానికి తోడు, నైతికంగా దెబ్బ తిని తన తండ్రి బతికే కన్నా ఒక ప్రయోజనం కోసం మరణించినా ఫరవా లేదని కెటి రామారావు, కవిత అన్నట్లు సమాచారం. గుండె దిటవు చేసుకుని అందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో చిదంబరం ప్రకటన రావడంతో కెసిఆర్ బయట పడ్డారు.
అయితే, సీమాంధ్రలో అనూహ్యంగా ఆందోళనలు చెలరేగడం, సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో, అన్నింటినీ మించి తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి మాట మార్చడంతో చిదంబరం కాస్తా సవరణలతో 23వ తేదీ ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. అయితే రెండు ప్రాంతాల్లోనూ ఉద్యమాలు చల్లారకపోవడంతో చిదంబరం మరోసారి 31వ తేదీన మరో ప్రకటన చేశారు. తాను 9వ తేదీన గానీ, 23వ తేదీన గానీ చేసిన ప్రకటనల్లో వ్యత్యాసం లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రాంతాలవారీగా చీలిపోవడంతో ముందుకు అడుగు వేయడం కాస్తా ఇబ్బందిగా ఉందని చిదంబరం స్పష్టం చేశారు. పైగా, చాలా స్పష్టంగా తెలంగాణ విషయంలో తాము ఉన్నామనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో 2010 జనవరి 5వ తేదీన రాష్ట్ర రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని చిదంబరం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ చిదంబరం తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతుందని, రాజకీయ పార్టీలు సహకరిస్తే మరో అడుగు ముందుకు పడుతుందని ఆయన అన్నారు. చిదంబరం వరుసగా చేస్తున్న ప్రకటనలు యుపిఎ ప్రభుత్వం తెలంగాణకు కట్టుబడి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రకటనల బట్టి ఎక్కువ కాలం ఈ వ్యవహారాన్ని సాగదీయడానికి కూడా సిద్ధంగా లేనట్లు అర్థమవుతోంది. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి చర్చల ప్రక్రియ పూర్తికి కాల పరిమితి విధిస్తామని కూడా చిదంబరం చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాల పరిమితి విధించడానికి మాత్రం ఆయన అంగీకరించడం లేదు. అలా అంగీకరించకపోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉండాల్సిన కారణాలు ఉన్నాయి.
రాష్ట్ర ఏర్పాటుకు కాల పరిమితి విధిస్తే ఊహించని ఆటంకాలు ఎదురైతే దాన్ని పాటించడం కష్టమవుతుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మాట నిలబెట్టుకోనట్లవుతుంది. పైగా, అలాంటి పరిస్థితి వస్తే తెలంగాణలో తలెత్తే ఉద్యమాలను నియంత్రించడం కూడా సాధ్యం కాదు. ఈ విషయం తెలంగాణ విద్యార్థులకు, మేధావులకు, రాజకీయ నాయకులకు స్పష్టంగానే అర్థమైంది. ఇదే విషయాన్ని సిపిఐ రాష్ట కార్యదర్శి నారాయణ మరో రూపంలో చెప్పారు. చర్చలను బట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తప్ప దేశంలో మరో కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సిద్ధంగా ఉండకూడదనే పట్టుదలతో కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది కేవలం ఒక్క చిదంబరం వ్యవహారం కాదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి, రక్షణ మంత్రి ఆంటోనీకి తెలియకుండా, వారి సమ్మతి లేకుండా అవుతుందని అనుకోవడం పూర్తిగా పిచ్చితనమే అవుతుంది. ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, ప్రజారాజ్యాలను నడ్డి విరిగేలా కొట్టడం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనక ఉంది. మరో వైపు వైయస్ జగన్ బ్లాక్ మొయిల్ రాజకీయాలకు సంకెళ్లు వేయడం కూడా ఇందులో భాగమే. పైగా, మాట నిలబెట్టుకున్న ఖ్యాతి తెలంగాణ నుంచి దక్కుతుంది. అన్నీ ఆలోచించిన తర్వాతనే కాంగ్రెసు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటుకు ఎక్కువ కాలం కూడా పట్టకపోవచ్చు. అయితే, ఒక రాష్ట్ర ఏర్పాటుకు కనీసం రెండేళ్లు పడుతుందని హోం శాఖ మంత్రిత్వ శాఖ అభిప్రాయం, అనుభవం. అయితే తెలంగాణ ఏర్పాటుకు అంత సమయం కూడా పట్టకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. అయితే, పట్టు విడిస్తే సీమాంధ్ర లాబీ పుంజుకోవచ్చుననే అనుమానంతో, కాంగ్రెసు తన మాట నుంచి వెనక్కి తగ్గి కాలయాపన చేయవచ్చుననే భయంతో, సీమాంధ్ర లాబీకి అవకాశం దక్కనీయకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో ఉద్యమాలను కొనసాగించాలనే ఉద్దేశం విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.












Click it and Unblock the Notifications