వైయస్ జగన్ చేయాల్సిందేమిటి?

పార్టీ అధిష్టానం సోమవారం సాయంత్రం చేసిన ప్రకటనను జగన్ కు ఆఖరి అవకాశంగా భావిస్తున్నారు. తాము పార్టీపరంగా ఓదార్పు యాత్రను తలపెడితే జగన్ వ్యక్తిగతంగా యాత్రను చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అధిష్టానం ప్రశ్నించే అవకాశం ఉంది. వ్యక్తిగత ప్రయోజనం ఆశించకపోతే, పార్టీ ప్రయోజనమే ముఖ్యమైతే వైయస్ జగన్ పార్టీ అధిష్టానం కార్యక్రమానికి సహకరించాల్సి ఉంటుందనే వాదన వినిపిస్తోంది. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కోసం, పదవీ కాంక్షతో జగన్ అధిష్టానం మాట వినడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
జగన్ వర్గం ఎంతగా సమర్థించుకుంటున్నా ఆయన ఉద్దేశ్యమేమిటో ఇప్పటికే చాలా వరకు ప్రజల్లోకి వెళ్లింది. ముఖ్యమంత్రి పదవి కోసమే జగన్ ఓదార్పు యాత్ర పేర ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయించుకున్నారనే విషయం స్పష్టంగానే అర్థమవుతోంది. దాన్ని కప్పి పుచ్చడానికి చేసే ప్రయత్నాలేవీ ఫలించే అవకాశాలు లేవు. ఓదార్పు యాత్రకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని జగన్ వర్గం చెప్పుకుంటోంది. అయితే, పార్టీతో తన భవిష్యత్తు ముడిపడి ఉందని భావిస్తే, పార్టీకి ఆ బలాన్ని అందించి ఉండేవారని అంటున్నారు. పార్టీ హైకమాండ్ ను ఇరకాటంలో పెడుతూ తన లక్ష్యాన్ని సాధించుకోవడమే వ్యూహంగా జగన్ ముందుకు నడుస్తున్నారు. అధిష్టానం మాటకు జగన్ కట్టుబడే అవకాశం లేదు. అందువల్ల సెప్టెంబర్ 2వ తేదీ తర్వాత ఆయనపై వేటు వేయడానికే ఎఐసిసి చివరి అవకాశంగా పార్టీపరంగా ఓదార్పు చేపడుతున్నట్లు ప్రకటించిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications