డిసెంబర్ తర్వాత ఏమవుతుంది?

తెలంగాణకు అనుకూలంగా నివేదిక వస్తే సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగుతాయని అనుకుంటున్నారు. సమైక్యవాదులు తీవ్ర ఉద్యమాలకు శ్రీకారం చుడతారని భావిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అనుకుంటున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నివేదిక వస్తే తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసే వాతావరణమే ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ జెఎసిలు డిసెంబర్ తర్వాత ఉద్యమాలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నాయి. శ్రీకృష్ణ కమిటీపై తెలంగాణలో పూర్తి నమ్మకం లేదు. ఆ అపనమ్మకంతోనే వివిధ వర్గాలను ఉద్యమాలకు సిద్ధం చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఇరు ప్రాంతాల్లోనూ సిలబస్ ను డిసెంబర్ లోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
హైదరాబాదు పరిస్థితి ఎలా ఉంటుందనే భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. హైదరాబాదును కేంద్ర పాలితంగా చేస్తారనే ప్రచారం ఇటీవలి కాలంలో ఊపందుకుంది. దాన్ని తిప్పికొట్టడానికి తెలంగాణవాదులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రతి అంశంపై వివాదాలు చెలరేగుతున్నాయి. ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటువంటి ఆందోళన వల్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఏమైనా, డిసెంబర్ తర్వాత రాష్ట్రంలోని పరిస్థితులు సాధారణంగా ఉంటాయని ఎవరూ అనుకోవడం లేదు.












Click it and Unblock the Notifications