మోహన్ బాబు ఘోష

మోహన్ బాబు మరోసారి తెలంగాణవాదులపై, సినీ పరిశ్రమలోని పెద్దలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా సినీ పరిశ్రమ పెద్దలు రాలేదని, వారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాదులో కొంత మంది తెలంగాణ నాయకులు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆడిపోసుకున్నారు. అంతకు ముందు నేరుగా తిరుపతి వెళ్లి సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమానికి బాసటగా నిలుస్తూ ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత నిరాహార దీక్ష చేస్తున్న విజయవాడ నేతలు లగడపాటి రాజగోపాల్ ను, దేవినేని ఉమామహేశ్వర రావును పరామర్శించారు. ఈ అన్ని సమయాల్లోనూ తెలంగాణ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. తాను హైదరాబాదులో శాంతిర్యాలీ పెడతానంటూ రెచ్చిపోయారు. కయ్యానికి కాలు దువ్వారు. హైదరాబాదు గురించి అర్థం పర్థం లేకుండా వ్యాఖ్యలు చేశారు. ఇదంతా తెలంగాణ వాదులకు మింగుడు పడని వ్యవహారంగా మారిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలకు కూడా తెలంగాణలో అదే పరిస్థితి ఎదురైంది. చిరంజీవి మోహన్ బాబులా ఘాటుగా మాట్లాడలేదు. సినీ పరిశ్రమ తెలంగాణ ఆందోళనకారుల వల్ల భయభ్రాంతులకు గురవుతోందని మాత్రమే మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి చిదంబరానికి, తదితర ప్రభుత్వ పెద్దలకు ఆయన మొర పెట్టుకున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు మోహన్ బాబు, చిరంజీవి స్పష్టంగా తెలంగాణ వ్యతిరేక వైఖరి తీసుకున్నారు.
వారిద్దరు కూడా నిర్మాతల మండలిని గానీ ఇతర సినీ పరిశ్రమకు చెందిన సంస్థలను గానీ ఆశ్రయించిన దాఖలు లేవు. పైగా, సినీ పరిశ్రమ ఎటో ఒక వైపు మొగ్గు చూపదని ఆ రంగానికి చెందిన ప్రముఖులు ప్రకటిస్తూనే వస్తున్నారు. ఈ స్థితిలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వారికి మద్దతుగా నిలిచే పరిస్థితి లేకుండా పోయింది. జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి వేరు. తన సినిమాను అడ్డుకుంటామని తీవ్రమైన హెచ్చరికలు చేసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహానికి గురికాలేదు. తన నేపథ్యాన్ని, సినీ పరిశ్రమ పరిస్థితిని వివరించి, తాను హైదరాబాదులోనే పుట్టాను, హైదరాబాదులోనే ఉంటానని చెప్పారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడకపోవడం జూనియర్ ఎన్టీఆర్ కు కలిసి వచ్చింది. అది తెలంగాణలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గొంతు విప్పడానికి అవకాశం కల్పించింది. మరో వైపు కోర్టు నుంచి భద్రతకు సంబంధించిన ఉత్తర్వులను అదుర్స్ సినిమా సంపాదించుకోగలిగింది. మరో వైపు తెలంగాణ జెఎసిలోని ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెసు సినిమాల ప్రదర్శనను అడ్డుకోవడాన్ని వ్యతిరేకించాయి. మోహన్ బాబు కుమారుడు విష్ణువర్ధన్ సినిమా సలీం విషయంలో గానీ చిరందీవి కుటుంబ సభ్యుల సినిమాల విషయంలో గానీ ఈ సానుకూలాంశాలు లేవు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టకుండా జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమా తెలంగాణలో కూడా ప్రదర్శనకు తగిన వాతావరణాన్ని కల్పించుకుంది. ఈ విషయాలు ఆలోచించకుండా మోహన్ బాబు మరోసారి అగ్నికి ఆజ్యం పోసినట్లు మాట్లాడారు. అది ఆయనకు మరింత వ్యతిరేకమవుతుందే గాని సానుకూలం కాదు.