వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ధీమా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
ముఖ్యమంత్రి కె. రోశయ్య ఢిల్లీ పర్యటనపై తన వర్గం టెన్షన్ తో ఎదురు చూస్తున్నప్పటికీ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ లో మాత్రం దీమా నెలకొని ఉంది. మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ఏర్పాటులో భారీ మార్పులుంటాయని భావిస్తున్నారు. ఈ భారీ మార్పుల కోసమే ముఖ్యమంత్రి కె. రోశయ్యను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన సోమవారం సోనియాతో భేటీ అవుతారు. మరో సీనియర్ నాయకుడు కె. కేశవరావు కూడా సోనియాతో సమావేశమయ్యే అవకాశం ఉంది. వైయస్ జగన్ వర్గంపై వేటు వేయడమే ప్రధానంగా సోనియాతో రోశయ్య భేటీ సాగుతుందని బలమైన ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దానితో పాటు పిసిసి అధ్యక్షుడి నియామకం కూడా జరుగుతుందని అంటున్నారు. వైయస్ జగన్ కు చెక్ పెట్టేందుకు వీలుగా ఈ మార్పులు జరుగుతాయని అంటున్నారు.

మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలుకుతారని, ఇతర నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారని అంటున్నారు. మొత్తం 7గురు మంత్రులకు రోశయ్య ఉద్వాసన పలికే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరిలో జగన్ వర్గానికి చెందిన ఆ ఇద్దరు మంత్రులే కాకుండా కర్ర విరగకుండా పాము చావకుండా ఇంకా జగన్ తో సంబంధాలు కొనసాగిస్తున్న మంత్రులు ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం మంత్రుల సంఖ్య 33 ఉంది. ఈ 33 మందిని అలాగే ఉంచినా మరో 11 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఏడుగురికి ఉద్వాసన పలకడం ద్వారా 18 మందిని కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకోవడానికి రోశయ్యకు వీలు కలుగుతుంది. చిరంజీవితో పాటు ప్రజారాజ్యం పార్టీకి చెందిన మరి కొంత మందిని రోశయ్య మంత్రివర్గంలో చేర్చుకుంటారని భావిస్తున్నారు. రోశయ్యకు సహకరించే మంత్రులు ఉండాల్సిన అవసరం ఉందని ప్రజారాజ్యం పార్టీ నేత వేదవ్యాస్ ఓ టీవీ చానెల్ లో అన్నారు. దాన్ని బట్టి మంత్రివర్గంలో ప్రజారాజ్యం చేరడం ఖాయమైనట్లేనని అనుకుంటున్నారు.

జగన్ మాత్రమే కాకుండా ఆయన వర్గానికి చెందిన కొండా సురేఖ వంటి నాయకులు మాత్రం రోశయ్య అంత సులభంగా మంత్రివర్గ విస్తరణను చేపట్టబోరనే నమ్మకంతో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ చేపడితే మంత్రిపదవులపై ఆశ పెట్టుకున్నవారు అవి దక్కకపోతే ఆసమ్మతికి ఆజ్యం పోస్తారని, వారంతా తమ వైపు వస్తారని అధిష్టానం భావిస్తుందని, అందువల్ల మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తారని జగన్ వర్గం భావిస్తోంది. మంత్రి పదవుల కోసమే చాలా శాసనసభ్యులు తన వెంట రావడానికి వెనకాడుతున్నారని జగన్ నమ్ముతున్నట్లు సమాచారం. ఒక్కసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే తనవైపు శాసనసభ్యులు రావడానికి వీలవుతుంది. దానివల్ల ప్రభుత్వం పడిపోయే ప్రమాదం కూడా ఉంటుందని అనుకుంటున్నారు. ఈ విషయాలు అధిష్టాన వర్గానికి తెలుసునని, అందుకే మార్పులకు ఒడిగట్టకపోవచ్చునని విశ్వసిస్తున్నారు. వైయస్ జగన్ పై కూడా పార్టీ చర్యలు తీసుకోదని, జగన్ వెంట ఉన్న ప్రజాబలానికి అధిష్టానం భయపడుతుందని నమ్ముతున్నారు. ఒక వేళ చర్యలకు ఒడిగట్టి, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిపితే తమ పని సులభం అవుతుందని కూడా జగన్ వర్గం అనుకుంటున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X