వైయస్ జగన్ మంత్రులెవరు?

వైయస్ జగన్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయదలుచుకుంటే మొదట రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకునేది బాలినేని శ్రీనివాస రెడ్డి. ఈయన గనుల శాఖ మంత్రి. వైయస్ కుటుంబానికి సమీప బంధువు. రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ వంటి సీనియర్ మంత్రులు కూడా జగన్ వెంట ఉండేవారే. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డికె అరుణ, పెద్ది రామచంద్రారెడ్డి, విశ్వరూప్, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి జగన్ కు పక్కా నమ్మకస్థులు. జగన్ వైపు ఉండేవారు. ధర్మాన ప్రసాద రావు కూడా వైయస్ కు సన్నిహితుడే.
పార్టీ నాయకత్వంపై జగన్ తిరుగుబాటు చేస్తే వారంతా ఆయనతో పాటు వస్తారా అనే చర్చ ఇప్పుడు రాజకీయ రంగంలో జరుగుతోంది. అయితే, కాంగ్రెసును వదులుకోవద్దనేది చాలా మంది అభిమతంగా కనిపిస్తోంది. కాంగ్రెసును వదిలితే లాభం కన్నా నష్టమే ఎక్కువని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సహనం వహించడమే మంచిదని వారు జగన్ కు సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి రఘువీరా రెడ్డి సలహా మేరకే శ్రీకాకుళం ఓదార్పు యాత్రను జగన్ వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. ఏమైనా, రాబోవు కాలంలో ఏం జరుగుతుందో జగన్ విషయంలో చెప్పలేని పరిస్థితే ఉంది.












Click it and Unblock the Notifications