• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్ జగనే ప్రతిపక్షం

By Pratap
|

YS Jagan
రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డే ప్రతిపక్ష పోషిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తన సమావేశాల ద్వారా, పత్రిక సాక్షి ద్వారా ఈ పాత్రను పోషించడానికి సిద్ధపడినట్లు అర్థమవుతోంది. తమ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రోశయ్య అధికారానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం సాగిస్తున్నారు. ఈ పోరాటం కాస్తా నిర్మాణాత్మకంగా ఉన్నట్లే కనిపిస్తోంది. సంక్షేమ పథకాలకు రోశయ్య ప్రభుత్వం కోత పెడుతుండడాన్ని ఆయన తీవ్రంగా తీసుకున్నారు. ఆ కోతలే ఆయుధాలుగా ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు.ఫీజుల రియంబర్స్ మెంట్, మహిళలకు పావలా వడ్డీకి రుణాలు వంటి సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన నేరుగానే ఎత్తిచూపుతున్నారు. వీటికి సంబంధించి జగన్ కు చెందిన సాక్షి దినపత్రికలో వరుసగా వార్తాకథనాలు వస్తున్నాయి. మహిళలకు పావలా వడ్డీ రుణాలు అందకపోవడంపై కడప జిల్లాలో నిర్వహించిన ప్రజాపథంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై పోరాటం చేసి దాన్ని సాధిస్తానని జగన్ చెప్పారు.

సాక్షి దినపత్రికలో వస్తున్న వార్తాకథనాలపై మంత్రులు స్పందించకపోవడాన్ని, వారు ఆ కథనాలను ఖండించకపోవడాన్ని ఎత్తి చూపుతూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రులు కర్ర విరగకుండా, పాము చావకుండా మాట్లాడుతూ వస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై రామోజీరావు వంటివారి పత్రికలకు మాత్రమే కాదు, జగన్ కు చెందిన పత్రికకు కూడా వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వంటి మంత్రులు అంటున్నారు. కానీ వారు జగన్ వ్యవహారాలపై వ్యతిరేకత చూపే పరిస్థితిలో లేరు. దివంగత నేత, తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రోశయ్య ప్రభుత్వం ఒక్కొటొక్కటే రద్దు చేసుకుంటూ వస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి సాక్షి దిన పత్రిక ద్వారా తీసుకెళ్లడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రభుత్వంపై విమర్శల ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టవచ్చుననేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై విమర్శలతో ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం వల్ల పత్రిక సర్క్యులేషన్ పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో దాని సర్క్యులేషన్ పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న ఈనాడు, ఇతర పత్రికల కన్నా తన పత్రికకు క్రెడిబిలిటీ పెరుగుతుందనేది ఆయన భావనగా కనిపిస్తోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఎలాగూ కాంగ్రెసుకు వ్యతిరేకంగానే వార్తాకథనాలు ప్రచురిస్తాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఈ స్థితిలో సాక్షిలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాస్తే పత్రికకు విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంటుందని ఆయన అనుకుంటున్నట్లు భావించవచ్చు.

ఇకపోతే, మరో ప్రయోజనాన్ని కూడా జగన్ పొందాలని భావిస్తున్నట్లు చెప్పవచ్చు. ప్రభుత్వంపై సమరానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటనలు సాగిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు క్రెడిబిలిటి దక్కకూడదనేది జగన్ ఎత్తుగడగా భావించవచ్చు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంచడం ద్వారా చంద్రబాబుకు దక్కాల్సిన ఆదరణ కూడా తానే పొందవచ్చునని ఆయన భావిస్తుండవచ్చు. ఇకపోతే, ముఖ్యమంత్రి రోశయ్య అధికారంలో నిలదొక్కుకోవడానికి ఏ విధమైన సమయం కూడా ఇవ్వకూడదని జగన్ కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. రోశయ్య నిలదొక్కుకుంటే తనకు అధికారం దూరమవుతుందని ఆయన భావిస్తున్నట్లు చెప్పవచ్చు. మొత్తం మీద, అన్ని విధాలుగా జగన్ ప్రభుత్వాన్ని చుట్టుముడుతూ అధికార పక్షంలోనే ప్రతిపక్షంగా పనిచేస్తున్నారు. దీనిపై మర్రి శశిధర్ రెడ్డి, వి. హనుమంతరావు వంటి నేతలు తప్పు పడుతున్నారు. ఈ స్థితిలో జగన్ కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిసి సాక్షి కథనాలపై వివరణ ఇచ్చుకున్నారు. ఆయన ఎం వివరణ ఇచ్చారో ఎవరికీ తెలియదు కానీ సాక్షిలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలను తగ్గించలేదు, తన ప్రజాపథం కార్యక్రమాల్లో ప్రభుత్వంపై విసుర్లు మానలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X