• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అయోమయం: తెలంగాణపై తలో మాట

By Srinivas
|

Sonia Gandhi and Ghulam Nabi Azad
తెలంగాణ అంశం తీవ్రమవుతున్న కొద్దీ కాంగ్రెసు పార్టీ అధిష్టానం మాత్రం దానిపై తాత్సారం చేస్తూ, నేతలు విరుద్ధ ప్రకటనలు చేస్తూ, మీడియా ముందు ఓ రకంగా ఆ తర్వాత మరో రకంగా మాట్లాడుతూ మరిన్ని చిక్కులు సృష్టిస్తున్నారు. అధిష్ఠానం సమస్యను పరిష్కరించే బదులు రకరకాల సంకేతాలను పంపుతోంది. ప్రత్యేక రాష్ట్ర సమస్య గురించి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు, పార్టీ అధికార ప్రతినిధులు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ మొదలుకొని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ ఆజాద్ వరకు అందరిదీ ఇదే తీరు. దీనిని బట్టి తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం అసలు వైఖరేంటో పార్టీ పెద్దలకే అంతుబట్టనట్లు కనిపిస్తోంది. లేదా సమస్య పరిష్కారం విషయంలో అధిష్ఠానంలోనే దిక్కుతోచని అయోమయ పరిస్థితి నెలకొందా? అన్న అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ అయోమయాన్ని పెంచటంలో సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అభిషేక్ సింఘ్వి, మనీష్ తివారీ తమవంతు పాత్ర పోషిస్తున్నట్లు కనబడుతోంది.

తెలంగాణ పరిష్కారానికి అధిష్ఠానం ఎలాంటి వైఖరి అవలంబించనుందో కాంగ్రెస్‌లోని సీమాంధ్ర నేతలకు గానీ తెలంగాణ నేతలకు గానీ బోధపడటం లేదు. నిజానికి ఈ సమస్య గత తొమ్మిది సంవత్సరాలుగా పార్టీ అజెండాలో ఉన్నప్పటికీ అది ఇప్పుడే తలెత్తిందన్న అమాయకత్వం రాష్ట్ర నేతల్ని కొందరు ఢిల్లీ నేతలు అడుగుతున్న ప్రశ్నల్లో వ్యక్తమవుతోంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఢిల్లీ వచ్చినప్పుడు ఆజాద్ అసలు తెలంగాణలో ఉద్యమ తీవ్రత మీరు అనుకున్నంత స్థాయిలో ఉందా? అని ప్రశ్నించటం గమనార్హం. 2004లో టిఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు కుదుర్చటంలో ఆజాదే కీలక పాత్ర పోషించినప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఏ హామీలు ఇచ్చామని పార్టీ నేతల్ని ఆయన అడిగటం విశేషం. మరోవైపు సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ కూడా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఢిల్లీలో యుపిఎ ప్రభుత్వం ఎదుర్కొనే ఇబ్బందుల్ని ప్రస్తావించారు. హైదరాబాద్ విషయంలో ఏం చేయాలని ఆయనే తెలంగాణ నేతల్ని అడిగారు.

నిజానికి తొమ్మిది సంవత్సరాల క్రితం కూడా ప్రణబ్ తమను ఇవే ప్రశ్నలు అడిగారని, అప్పటికీ ఇప్పటికీ ఆయన వైఖరిలో ఏమీ తేడా కనిపించలేదని కాంగ్రెస్‌లోని తెలంగాణ నేత ఒకరు వ్యాఖ్యానించారు. రాజీనామాలు చేసినందుకు తెలంగాణ నేతలపై ప్రణబ్ ఒకింత ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తెలంగాణ అంశంపై తాము కోర్‌కమిటీలో చర్చించామని, దానిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఒకవైపు చెబుతూనే మరోవైపు జాతీయ మీడియా ప్రతినిధులకు తాము బ్లాక్‌మెయిల్‌కు లొంగబోమని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ లేకపోయినా ఫర్వాలేదని లీకులు ఇవ్వటం ఆశ్చర్యకరం. కాగా, ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ తెలంగాణ విషయంలో అటు బహిరంగంగానూ, ఇటు అంతర్గత చర్చల్లోనూ ఏ మాత్రం సానుకూలంగా ఉన్నట్లు మాట్లాడటం లేదు. చర్చలు జరపకుండా తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకుంటామని ఆయన పదేపదే ప్రశ్నిస్తున్నారు.

తాజాగా చైనాలో కూడా ఆయన ఒక ప్రకటన చేస్తూ అసెంబ్లీ తీర్మానం లేకుండా తెలంగాణ సమస్య పరిష్కారం ఒక అంగుళం కూడా ముందుకు కదలదని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధుల్లో కూడా సమస్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిలో ఏ మార్పూ ఉండదని, సమస్యను పరిష్కరించకపోవటమే నిజమైన పరిష్కారమని ఒక అధికార ప్రతినిధి విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్నప్పుడు చెప్పగా తాజాగా మరొక అధికార ప్రతినిధి హైదరాబాద్ అంశాన్ని పక్కనపెట్టి తెలంగాణ సమస్యను పరిష్కరించవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. అయితే ఈయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన విషయాలను కూడా ఈయన పేరుతో మీడియాకు పొక్కడంతో గులాం నబీ ఆజాద్ స్వయంగా సదరు అధికార ప్రతినిధికి ఫోన్ చేసి సాంకేతిక అంశాలపై మీడియాతో మాట్లాడకూడదని గట్టిగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో మీడియాపై అసహనం వ్యక్తం చేసిన సదరు ప్రతినిధు తాను తెలంగాణ వంటి సమస్యాత్మక అంశాలపై ఇక మాట్లాడ కూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ విషయంలో కాంగ్రెసు నేతలలో విభేదాలు ఉన్నాయా? లేక ఉద్దేశ్య పూర్వకంగా అధిష్టానమే అయోమయంలో పడేస్తుందా? అనే ప్రశ్నలు ఉదయించడం సహజమే.

English summary
It seems, Congress High Command in dylemma on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X