సీమాంధ్రకు బెంబేలెత్తుతున్న సోనియా

తెలంగాణ నుంచి ఒత్తిడి తీవ్రమవుతుండగా, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీ తీవ్రమైన ఇబ్బందుల్లో పడినట్లేనని చెప్పాలి. నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసే అవకాశాలు సన్నగిల్లడం కాంగ్రెసు అధిష్టానానికి పెద్ద సమస్యగా మారింది. కాంగ్రెసు అధిష్టానం మాత్రం తెలంగాణపై సాధ్యమైనంత కాలయాపన వైఖరిని అనుసరించాలనే ఉద్దేశంతో ఉంది. అయితే, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కూడా సత్వరమే నిర్ణయం తీసుకోవాలని పట్టుబడుతున్నారు. దీంతోనే ప్రణబ్ ముఖర్జీ తీవ్రమైన అసహనానికి గురైనట్లు కనిపిస్తున్నారు. అరవై ఏళ్ల సమస్య, ఇందిరా గాంధీ, పివి నరసింహారావులే తేల్చలేకపోయారని, తమతో ఇంత తొందరగా అవుతుందా అని ఆయన సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల వద్ద అసహనాన్ని వ్యక్తం చేశారు. వివాదం ఎక్కువ కాలం సాగడం కూడా కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు తలనొప్పిగా మారింది. దాంతోనే వారు సత్వర పరిష్కారం కోరుతున్నారు. అయితే, ఆ పరిష్కారం తాము కోరుతున్నట్లుగా ఉండాలనేది వారి ఒత్తిడి రాజకీయాల లక్ష్యం.
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో మార్గం లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, బన్సల్ వారితో సమావేశమయ్యారు. వారు పరిస్థితిని వివరించారే తప్ప తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు ఏ విధమైన హామీ ఇవ్వలేదు. దీంతో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు శాంతించే పరిస్థితి కూడా లేదు. తెలంగాణలో పరిస్థితిని తాము అర్థం చేసుకున్నామని వీరప్ప మొయిలీ చెప్పినా సమస్యకు మాత్రం పరిష్కారం దొరికే పరిస్థితి కాంగ్రెసు అధిష్టానానికి లేదు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల బెదిరింపు రాజకీయాలు సోనియాను ఇరకాటంలో పడేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల వల్లనే ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడుతుందా అనే భయం ఆమెను పట్టుకున్నట్లుంది.